ఉచిత గ్యాస్ లబ్ధిదారులు ఎంత మంది?
ఉచిత గ్యాస్ పథకానికి లబ్ధిదారులు ఎంత మందో ప్రభుత్వం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు. దీని వెనుక మతలబు ఏమిటి?
ఏపీలో ఉచిత గ్యాస్ లబ్ధిదారులు ఎంత మంది అనే విషయం స్పష్టం కాలేదు. మంగళవారం ఎవరికి వారు గ్యాస్ డీలర్ల వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకున్నారు. ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ ఉండీ, తెల్లరేషన్ కార్డు ఉన్న వారు రేషన్ కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్ నెంబరు, ఆదార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం తీసుకుని గ్యాస్ డీలర్ వద్దకు వెళితే అక్కడి వారు బయో మెట్రిక్ మిషన్ ద్వారా వేలిముద్రను సరిచూసి కేవైసీ పూర్తయిన తరువాత పంపిస్తున్నారు.
ఈనెల 29 నుంచి ఉచిత గ్యాస్ కోసం గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఈనెల 31న పథకాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. ప్రారంభించిన తరువాత గ్యాస్ సిలెండర్ మార్చి నెలలోపు ఎప్పుడైనా బుక్ చేసుకుని తీసుకోవచ్చు. బుక్ చేసుకునే ముందు కేవైసీ చేయించుకుంటేనే పథకం కిందకు వస్తారు. లేకుంటే పథకం వర్తించదు.
తెలియని లబ్ధిదారుల సంఖ్య
ఉచిత గ్యాస్ పథకం కింద లబ్ధిదారులు ఎంత మంది అనే విషయం ఇప్పటి వరకు తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఏడాదికి రూ. 2,600 కోట్లు పథకానికి ఖర్చవుతుంది. అయితే వైట్ రేషన్ కార్డులు 1.48కోట్ల కుటుంబాలకు ఉన్నాయి. ఈలెక్కన ఇంకా ఎక్కువ మొత్తం ఈ పథకానికి ఖర్చవుతుంది. అయితే ప్రభుత్వం ఏ లెక్కన ఈ మొత్తం ఖర్చవుతుందని చెప్పిందనేది సందేహంగా ఉంది. అంటే లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని భావించాల్సి వస్తోందని పలువురు పేదలు అంటున్నారు.
గ్యాస్ కంపెనీల వారిదే హవా
గ్యాస్ కంపెనీల వారు అనుకుంటే ఉచిత గ్యాస్ పేదలకు వస్తుంది. లేదంటే రాదనేది స్పష్టమైంది. ఎందుకంటే వారి వద్ద ఈకేవైసీ చేయించుకోవాల్సి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్యాస్ కనెక్షన్ తీసుకునే ముందు ఈకేవైసీ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరి గ్యాస్ కనెక్షన్‌కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పడాల్సి ఉంటుంది కాబట్టి ఈకేవైసీ చేసి ఉంటుంది. అయినా మరోసారి ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పటం వెనుక లబ్దిదారులను తగ్గించే కుట్ర ఉందని కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. పేరుకే ఉచిత గ్యాస్ పథకం కానీ చాలా మందికి ఈ పథకం వర్తించేలా లేదని పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య ప్రకటిస్తే తప్ప లబ్ధిదారులు ఎంత మంది అనేది ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Next Story