గూగుల్ డేటాతో మారనున్న తర్లువాడ తలరాత
x
గూగుల్ డేటా ఏర్పాటయ్యే తర్లువాడ ఇదే

'గూగుల్ డేటా'తో మారనున్న తర్లువాడ తలరాత

ఇదిగో ఇక్కడే.. గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది. ఊరు ఊరంతా సంబరపడుతోంది..


(బొల్లం కోటేశ్వరరావు, విశాఖపట్నం)
నిన్న మొన్నటి దాకా ఆ ఊరు సాదాసీదా పల్లెటూరు. కూరగాయలు, ఆకుకూరలు, పూలు వంటివి పండించే ఒక పల్లెగానే పేరు. అంతకుమించి ఆ ఊరి ప్రత్యేకతలు చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఉపాధినిచ్చే పరిశ్రమ ఒక్కటీ లేదు. మరి ఇప్పుడు? ఆ ఊరి పేరు మార్మోగిపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ 'గూగుల్ తల్లి' ఖండాలు దాటి ఆ ఊళ్లోకి అడుగు పెడుతుండడమే అందుకు కారణం. ఊరూ వాడా అందరి నోళ్లలోనూ నానుతున్న ఆ కుగ్రామమే తర్లువాడ. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతోందక్కడ. కలలోనైనా ఊహించని ఈ పరిణామానికి తర్లువాడ వాసులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.

తర్లువాడ గ్రామ బోర్డు

గూగుల్ డేటా సెంటర్ రాకతో తమ బతుకులు బాగుపడతాయన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే దాని రాక కోసం తహతహలాడుతున్నారు. 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్థితిగతులతో పాటు గూగుల్పై వారి మనోగతాన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసింది.

తర్లువాడ ఎక్కడుందంటే?

తర్లువాడ జిల్లా కేంద్రం విశాఖపట్నానికి 34, మండల కేంద్రం ఆనందపురానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆనందపురం నుంచి ఆ ఊళ్లోకి వెళ్లాలంటే 15 అడుగుల రోడ్డు తప్ప మరో మార్గం లేదు. జాతీయ రహదారి-16 నుంచి వెళ్లడానికి కిలోమీటరు దూరమే ఉన్నా అదీ గతుకుల రోడ్డే. ఆ ఊరి జనాభా 3,600 ఉండగా 900 వరకు గడపలున్నాయి. వీటిలో అక్కడక్కడ పూరి గుడిసెలు, రెండు, మూడంతస్తుల మేడలు ఉన్నాయి. పశువుల శాలలు, పెంట కుప్పలు కనిపిస్తున్నాయి.

గూగుల్ డేటా సెంటర్ కి కేటాయించిన స్థలం

వ్యవసాయం, వ్యవసాయేతర, కూలి పనులు చేసుకునే వారే ఎక్కువ. ఇన్నాళ్లూ ఒక్క పరిశ్రమ వాసన కూడా లేని ఆ గ్రామంలో ఇప్పుడు ఏకంగా అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతోంది.

తర్లువాడ ఊళ్లో రోడ్ల పై ఆడుకుంటున్న పిల్లలు

దీనికి తర్లువాడలో 308 ఎకరాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం డీ-పట్టా భూములు 110.61 ఎకరాలు, ఆక్రమణలో ఉన్న 89, ఖాళీ స్థలం 102, అన్ క్లెయిమ్డ్ 7 ఎకరాలను సేకరించింది. ఆ ఊళ్లో కొండకు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు ఆనుకుని ఉన్న స్థలంలో గూగుల్ డేటా సెంటర్ రానుంది.

గ్రామంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్

కొండకు దిగువన, ఊరికి ఎగువన ఇది నిర్మితమవుతుంది. గూగులు కేటాయించిన స్థలంలో ఇంకా ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు. దీంతో ఆ స్థలం తుప్పలు, డొంకలతో ఉంది.
గూగుల్ అంటే తెలియని వారే ఎక్కువ..
గూగుల్ అంటే తెలియని వారే తరువాడలో ఎక్కువగా ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాక ఆ ఊరికి అధికారుల తాకిడి మరింత అధికమైంది. రోజూ పదుల సంఖ్యలో కార్లు వచ్చి వెళ్తున్నాయి. ‘మా ఊళ్లో ఏదో సెంటరు వత్తందంట. అదేటో మా పిల్లలకీ, సదువుకున్నోల్లకే తప్ప మాకేటీ తెలీదు బాబూ' అని అప్పలనాయుడు అనే 70 ఏళ్ల వృద్ధుడు చెప్పాడు. 'మా ఊరి కొండ దగ్గిర కంపినీ పెడతారంట. మా బతుకులు బాగుపడ్తాయని అందరూ అనుకుంటన్రు. మా ఊరే మారిపోద్దంట. అలా జరిగితే మంచిదే కదా' అని సింహాచలం అనే 60 ఏళ్ల మహిళ అభిప్రాయపడింది.
మూడు ప్రాంతాలను ఎంపిక చేసినా..
గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ల కోసం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మూడు ప్రాంతాలను ఎంపిక చేశారు. వీటిలో విశాఖ జిల్లాలోని తర్లువాడలో 308 ఎకరాలు, ముడసర్లోవ (అడవివరం)లో 120, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో 160 ఎకరాలను కేటాయిస్తున్నారు. వీటిలో తర్లువాడ భూములు సిద్ధంగా ఉన్నందున తొలిదశలో అక్కడ డేటా సెంటర్ పనులు చేపడ్తారు. ముడసర్లోవలో భూములు సింహాచలం దేవస్థానికి చెందినవి కావడంతో దేవదాయ శాఖకు ప్రత్నామ్నాయంగా మరో చోట భూములు కేటాయిస్తారు. ఇక రాంబిల్లి వద్ద కేటాయించే భూములు అక్కడ నేవల్ అల్టర్నేటివ్ ఆపరేటింగ్ బేస్ (ఎన్ఏవోబీకి) చేరువలో ఉన్నాయి. అందువల్ల అక్కడ భూములపై రక్షణ శాఖ నుంచి అనుమతులు రావలసి ఉంది. ఈ మూడు ప్రాంతాల్లో ఒక్క తరువాడ సెంటర్ మాత్రమే ఊరికి ఆనుకుని ఉంది. అందువల్ల అక్కడ రైతుల భూములకు పరిహారం, ఉపాధి కల్పనపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముడసర్లోవ సమీపంలో ఆరిలోవ ఉన్నా ఊరిని తరలించాల్సిన అవసరం రాదు. పైగా సింహాచలం దేవస్థానం భూములు కాబట్టి రైతులకు పరిహారం ఇవ్వాల్సిన పని లేదు.
గూగుల్ డేటా సెంటర్ కథాకమామిషు ఇదీ..
విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో భారత్లో తొలి ఏఐ నగర నిర్మాణానికి పునాది పడింది. వైజాగ్ను ఏఐ సిటీగా మార్చేందుకు పునాది వేసే ప్రాజెక్టు డేటా సెంటర్ ద్వారా గూగుల్ సంస్థ 15 బిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.1,31,280 కోట్ల) పెట్టుబడి పెట్టనుంది. దీంతో ఒక గిగావాట్ (వెయ్యి మెగావాట్ల) హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది ప్రపంచంలో అమెరికా తర్వాత గూగుల్కు ఇది రెండోది, ఆసియాలో ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు ఇదే.
ప్రస్తుతం పది బిలియన్ డాలర్లు (రూ.87,280 కోట్లు) పెట్టుబడి వ్యయం ప్రకటించినప్పటికీ వచ్చే ఐదేళ్లలో అది 15 బిలియన్ డాలర్లకు పెంచనన్నట్టు గూగుల్ సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా తదితర 12 దేశాలతో సబ్ సీ కేబుల్ అనుసంధానం కానుంది. గూగుల్ ప్రపంచవ్యాప్తంగా అందించే అన్ని రకాల ఉత్పత్తులను ఈ హబ్ ద్వారానే వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028-32 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు సమకూరుతుందని అంచనా. 1,88,220 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు. గూగుల్ క్లౌడ్ ఆధారిత కార్యక్రమాల ద్వారా ఏటా రూ.9,553 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.47,720 కోట్ల ఉత్పాదకత జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
నీరు, విద్యుత్ సౌలభ్యతే కీలకం..
డేటా సెంటర్ నిర్వహణకు ఎక్కువ మొత్తంలో నీరు, విద్యుత్ అవసరమవుతుంది. కూలింగ్ కోసం ఈ నీటిని వినియోగిస్తారు. సమీపంలో ఉన్న సముద్రపు నీటిని డిశాలినేషన్ చేసుకుని మంచినీటి అవసరాలు తీర్చుకోవచ్చనే ఉద్దేశంతో గూగుల్ డేటా సెంటర్ విశాఖను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. పోలవరం నీటిని ఏలేరు రిజర్వాయరు ద్వారా తీసుకునే అంశం కూడా పరిశీలనలో ఉంది. డేటా సెంటర్లకు అవసరమైన హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుల్స్ను సముద్ర మార్గంలో సింగపూర్, అమెరికా, అస్ట్రేలియా తదితర దేశాల నుంచి విశాఖకు తీసుకురానున్నారు. ఇక
రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీకి విస్తృత అవకాశాలున్నాయి. కంపెనీలు ఏపీలో ఎక్కడైనా సొంతంగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే అక్కడ నుంచి గ్రిడ్ ద్వారా డేటా సెంటర్లకు యూనిట్కు రూ.2కే అందుతుంది.
రైతులకు పరిహారం ఇలా..
గూగుల్ డేటా సెంటర్ కోసం తమ డీ-భూములివ్వడానికి తొలుత రైతులు ఒప్పుకోలేదు. పైగా ఆందోళనలు కూడా చేపట్టారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం రైతులకు ఒకరానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం, ఇంటికి ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, ఎకరానికి 20 సెంట్ల జిరాయితీగా మార్పు చేసి ఇవ్వడానికి, డేటా సెంటర్ ప్రాంతంలో నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్లో ఒక్కో షాపును కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఇంకా ఖాళీ స్థలంలో ఉన్న 520 మందికి మూడేసి సెంట్ల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. దీనికి మెజారిటీ రైతులు అంగీకరించడంతో ఆందోళన సద్దుమణిగింది. గూగుల్ డేటా సెంటర్కు లైన్ క్లియర్అయింది.
అప్పుడే రెట్టింపైన భూముల ధరలు..
ఇక తరువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఖాయమని తెలిశాక ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. దాదాపు తొమ్మిది నెలల క్రితం గూగుల్ డేటా సెంటర్పై ఉప్పందుకున్న కార్పొరేట్, రియల్ ఎస్టేట్ సంస్థలు, రాజకీయ నాయకులు తర్లువాడ పరిసరాలపై పడ్డారు. వీరు ముందుచూపుతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. కొందరు కొనుగోలు చేసి ఉంచుకోగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు వేశారు. రియల్టర్లు 'అదిగదిగో అదే గూగుల్ డేటా సెంటర్' అంటూ కనుచూపు మేర నుంచి చూపిస్తున్నారు. ఏడాది క్రితం ఎకరం రూ.కోటి ధర పలికిన భూములు ఇప్పడు రూ.2 కోట్లు, కోటిన్నర పలికినవి రూ.3 కోట్ల చొప్పున పెరిగాయి. అంతేకాదు.. ఉన్నత పదవుల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం తమ ప్రాంతంలో భూముల కోసం ఆరా తీస్తున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు.
ఊరు బాగుపడుతుందని ఆశ..
గూగుల్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా తమ ఊరితో పాటు ఆ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఆశాభావంతో తరువాడ ప్రజలున్నారు. కొన్నాళ్లుగా ఊళ్లోకి వస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల రాకపోకలతో నిత్యం సందడి సందడిగా ఉంటోంది. వాటిల్లో వచ్చి వెళ్తున్న ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, వారి వందిమాగధులు హడావుడి చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతరులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేస్తుండడంతో మున్ముందు తమ భూములకు రూ.కోట్లలో ధర పలుకుతుందని, తమ బిడ్డలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని గంపెడాశతో ఉన్నారు. అందుకే గూగుల్ డేటా సెంటర్పై కొన్ని వర్గాల నుంచి వస్తున్న విమర్శలను అంతగా పట్టించుకోవడం లేదు.
స్థానిక యువతకు ఉద్యోగాలొస్తాయి..

చంద్రశేఖర్


'మా తర్లువాడకు గూగుల్ డేటా సెంటర్ వస్తే భావితరాల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. బీటెక్ లు, ఎంటెక్ లు, డిగ్రీలు పాసైన యువకులు ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడకో వెళ్తున్నారు. ఇంకొందరు ఉద్యోగాలు రాక చాలా బాధలు పడుతున్నారు. గూగుల్ సెంటర్ వస్తే నాలాంటి చదువుకున్న స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వారి జీవనశైలి మార్చుకునేందుకు వీలుంటుంది. మా ఊరికి గూగుల్ సెంటర్ వస్తుందంటే యువత హ్యాపీగా ఉంది' అని బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన తర్లువాడకు చెందిన యువకుడు చంద్రశేఖర్ చెప్పాడు.
గూగుల్ సెంటర్ రావడం మా అదృష్టం..

రైతు బాలి వెంకట్రాజు


'మా ఊరికి డేటా సెంటర్ రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సెంటర్కి నా 11 ఎకరాల భూమిని ఇచ్చాను. గూగుల్ సెంటర్ ఏర్పాటైతే అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుంది. పాలు, టిఫిన్ సెంటర్, కిరాణా షాపుల వారికి సైతం లబ్ధి చేకూరుతుంది. మా ఆదాయం రెట్టింపవుతుంది. మా పిల్లలకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలొస్తాయి. మాకున్న కొద్దిపాటి భూములకు మున్ముందు మరింత రేట్లు పెరుగుతాయి. గూగుల్ డేటా సెంటర్ ఉద్యోగాలిస్తే ముందుగా మా గ్రామస్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం' అని రైతు బాలి వెంకట్రాజు తెలిపారు.
పరిహారం సంతృప్తికరంగా ఉంది..

'గూగుల్ డేటా సెంటర్కు నాకున్న 4.08 ఎకరాల డీ-పట్టా భూమిని ఇచ్చాను. మాకు పరిహారంగా ఎకరానికి రూ.50 లక్షలు, 20 సెంట్ల జిరాయితీ భూమి, షాపింగ్ కాంప్లెక్స్ కట్టి అందులో ఒక షాపు చొప్పున ఇస్తామన్నారు. మాలాంటి డీ-పట్టాదార్లందరికీ ఇస్తున్న పరిహారం సంతృప్తికరంగానే ఉంది. గూగూల్ డేటా సెంటర్ మా ఊరికొస్తుందని తెలిసి సంతోషిస్తున్నాం' అని తరువాడ మాజీ ఉప సర్పంచ్, రైతు బాలి వెంకట్రావు చెప్పారు.
మా ఊళ్లో సంబరాలు చేసుకుంటున్నాం..
'మా మారుమూల గ్రామానికి ప్రపంచంలోనే పేరున్న గూగుల్ సెంటర్ వస్తోందంటే ఎంతో ఆనందపడుతున్నాం. ఈ డేటా సెంటర్తో మా ఊరి పిల్లలకు ఉద్యోగాలొచ్చి స్థిరపడతారని అనుకుంటున్నాం.

గ్రామ సర్పంచ్ బీఆర్బీ నాయుడు

మా ఊరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలొస్తాయి. ఇవన్నీ వస్తే అన్ని వర్గాల వారికీ ఉపాధి దొరుకుతుంది. మా ఊరికి నిరంతరాయంగా విద్యుత్, మంచినీటి సరఫరా జరుగుతుంది. మా గ్రామానికి గూగుల్ వంటి పెద్ద కంపెనీ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పటి వరకు మా ఊళ్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటరే పెద్దదనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా రూ. లక్షల కోట్ల పెట్టుబడులతో గూగుల్ డేటా సెంటరే వస్తుండడంతో మా ఊళ్లో అందరం సంబరాలు చేసుకుంటున్నాం' అని తరువాడ గ్రామ సర్పంచ్ బీఆర్బీ నాయుడు 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి'తో చెప్పారు.
"గూగుల్" వచ్చిందో లేదో అనేది సమస్య కాదు. "గూగుల్‌తో పాటు తర్లువాడ ఎలా ఎదుగుతోంది?" అనే కథే ఇకపై ప్రపంచం వినాల్సినది. మారుతున్న ఊరు కథగా తర్లువాడ నిలవాలి.
Read More
Next Story