టీటీడీ గోశాలలో వందలాది గోవులెలా చనిపోయాయి?
x
A Devotee performing pooja to a cow at SV Gosala

టీటీడీ గోశాలలో వందలాది గోవులెలా చనిపోయాయి?

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన సంచలన ఆరోపణ. ఖండించిన టీటీడీ. అసలు ఏం జరుగుతోంది. నెయ్యి వివాదం మరువక మునుపే ఈ గోల ఏమిటీ?


తిరుమల తిరుపతిలో ఏమి జరుగుతోంది? కల్తీ నెయ్యి వివాదం మరువక ముందే ఇప్పడు సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. స్వామివారి గోశాలలో వందలాది గోవులు చనిపోతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఆయన ఆరోపణలను టీడీడీ పాలకమండలి ఖండించినా చనిపోయిన ఆవుల ఫోటోలు భక్తుల్లో కలకలం రేపాయి. శ్రీవారి ఆలయ ప్రతిష్టతను దెబ్బ తీయడమే కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) మండిపడ్డారు.

TTD Former Chairmen Bhumana Karunakar Reddy

ఏప్రిల్ 11న తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు. తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని కూటమి ప్రకటించింది. కానీ, ఇవాళ జరుగుతోంది ఏంటి?. టీటీడీ గోశాల(TTD Goshala)లో అమ్మకంటే అత్యంత పవిత్రంగా గోవులను చూస్తారు. కానీ, తిరుమల గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా గోవులు మృతి చెందాయి. మూగజీవాలు దిక్కుమొక్కు లేకుండా మరణిస్తున్నాయి. కనీసం చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదు. ఎందుకు చనిపోతున్నాయో కారణాలూ చెప్పడం లేదు అని ఆయన ఆరోపించారు.

"మా పాలనలో 500 గోవులను దాతల నుంచి సేకరించి సంరక్షించాం. గతంలో వందే గో మాతరం అనే కార్యక్రమం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో చేపట్టాం. అయినా ఎల్లో మీడియా ద్వారా మాపై విషం చిమ్మారు. ఆ ఆవుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గోవుల పట్ల కూటమి సర్కార్‌ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. లేగదూడలను పట్టించుకునేవాడు లేడు. చెత్తకు వేసినట్లుగా ఆవులకు గ్రాసం వేస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి గోశాలకు ఓ డైరెక్టర్‌ అంటూ లేడు. డీఎఫ్‌వో స్థాయి అధికారిని గోశాలకు ఇన్చార్జిగా నియమించారు. సాహీవాల్ ఆవు గోశాలనుంచి బయటకు వెళ్లి ట్రైన్ కింద పడి చనిపోయింది. టీటీడీకి చెందినది కాదని చెప్పేందుకు చెవులు కట్ చేశారు. గోశాల.. గోవధశాలగా మారింది" అన్నారు కరుణాకర్ రెడ్డి.
పవన్ కల్యాణ్ ఎక్కడ?
"భగవంతుడితో సమానమైన గోవులకు ఈ పరిస్థితి ఎదురైంది. ఈ మహా పాపం కూటమి సర్కార్‌, టీటీడీ అధికారులదే. ఇంత జరుగుతున్నా.. పవనానంద స్వామి(Pawan Kalyan) ఎక్కడ? ఏం చేస్తున్నారు?. గోవుల మృతి విషయాన్ని కూటమి ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందన్న భూమన.. గోవుల మృతిపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్‌ చేశారు. హైందవ సమాజం గోశాలలో ఘటనలపై స్పందించాలని కోరారు.
పూర్తి పాఠం ఇలా ఉంది..
ఎస్వీ గోశాల గోవధ శాలగా మారింది. ఇది సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చేసిన పాపమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి‌. గోవులు దేవుళ్లతో సమానం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయి. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది గోమాత‌. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో వందకు పైగా గోవులు చనిపోయాయి. టీటీడీ అధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గత మూడు నెలలుగా వందకుపైగా ఆవులు చనిపోతున్నా పట్టించుకోకుండా ఉన్నారు. ఎస్వీ గోశాలలో గోవులను దుస్థితి దారుణంగా ఉంది. వందకు పైగా ఆవులు చనిపోయాయి. ఆ లెక్కలు, ఆవుల మృతి బయటకు రాకుండా చూశారు. కనీసం పోస్టు మార్టం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. ఈ మహాపాపం టీటీడీది, ప్రభుత్వానిది కాదా ? అని నిలదీశారు. గోశాలపై పర్యవేక్షణలో అధికారి లేకపోవడంతోనే ఈ దుస్థితికి కారణం. గోవుల మరణాలపై విచారణ జరిపించాలి. గోశాల నుండి తిరుమలకు పాలు వెళ్తాయి. స్వామి వారికి నైవేద్యంగా వెన్న ఇక్కడ నుండి ఇస్తారు. వైసీపీ పాలనలో గుజరాత్, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాల నుండి ఆవులను తీసుకోచ్చి స్వామి వారి సేవలు అందించాం. 580 ఆవులను మా ప్రభుత్వంలో తీసుకొచ్చాం. వైసిపి పాలనలో 1500 లీటర్ల పాలు తిరుమలకు రోజు అందించాం. ఇప్పుడు కూటమీ ప్రభుత్వం ఐదు వందల లీటర్ల పాలు తిరుమలకు వెళ్లడం లేదు. అయితే, పవన్ కల్యాణ్, చంద్రబాబు. జగన్ పై అసత్య ప్రచారం చేశారు. కానీ, హిందు ధర్మాన్ని కాపాడింది జగన్‌‌. కూటమీ ప్రభుత్వం టిటిడి ఎస్వీ గోశాలనే రక్షించలేకపోయారు. అక్కడి అధికారుల నిర్లక్ష్యంతోనే గోవులను చనిపోయాయి. ఇప్పటి వరకు టీటీడీ జేఈవో, సీవీ ఎస్వీ సహా ఇతర అధికారులను నియమించలేదు. తొక్కిసలాట ఘటనలో ఏమాత్రం సంబంధం లేని ఎస్వీ గోశాల డైరెక్టర్ హరినాధ్ రెడ్డి కావాలనే సస్పెండ్ చేసి. ఇప్పుడు గోవుల మృతికి చంద్రబాబు కారణం అయ్యారు.

ఎస్వీ గోశాల గోవధ శాలగా మారింది. గోవులను మరణాలపై హిందువులు నిరసనలు చేపట్టాలి‌‌‌. టిటిడి అనుమతి ఇస్తే ఈ రోజే ఎస్వీ గోశాలకు వెళతా. గోవులను మృతికి టిటిడినే కారణం. వారి నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు కరుణాకర్‌ రెడ్డి. వెంటనే అక్కడి పరిస్థితి టిటిడి చక్కదిద్దడానికి ప్రయత్నం చేయాలి. ఇది చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసినా పాపం మే అన్నారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి.
టీటీడీ ఖండన..
టిటిడి గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. మృతి చెందిన గోవులు పోటోలు టిటిడి గోశాలకు సంబంధించినవి కావు, దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవులు పోటోలను టిటిడి గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రచారం చేస్తున్నారంటూ టీటీడీ ఖండించింది. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని టిటిడి కోరింది.
Read More
Next Story