‘‘పిచ్చి అబద్దాలు మానుకోవాలి’.. జగన్‌కు హోంమంత్రి అనిత సూచన
x

‘‘పిచ్చి అబద్దాలు మానుకోవాలి’.. జగన్‌కు హోంమంత్రి అనిత సూచన

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా పిచ్చి పిచ్చి అబద్దాలు చెప్పడం మానుకోవాలంటూ హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు.


మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా పిచ్చి పిచ్చి అబద్దాలు చెప్పడం మానుకోవాలంటూ హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. అబద్దాలు చెప్పడం జగన్‌కు ఎంత వెన్నతో పెట్టిన విద్య అన్న విషయం రాష్ట్ర ప్రజలకు కూడా బాగా తెలుసని, ఆయన అబద్దాలు వినలేకే ప్రజలు ఎన్నికల్లో ఆయనకు ఘాటుగా బుద్ధి చెప్పారంటూ ఎద్దేవా చేశారు. అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థ ప్రమాద ఘటనపై కూటమి సర్కార్ సరిగా స్పందించలేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అనిత ఘాటుగా స్పందించారు. జగన్.. మృతుల కుటుంబీకుల దగ్గరకి వెళ్లి నవ్వుతారు.. బాధితుల దగ్గర సరదాలు చేస్తారు.. ఆయన ఏం మనిషో అర్థం కావడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు అనిత. అన్ని విషయాలను రాజకీయం చేయడం తప్ప జగన్‌కు ఏమీ తెలియదని విమర్శలు కూడా గుప్పించారామే.

జగన్ మాటలు హాస్యాస్పదం

‘‘వైసీపీ హయాంలో ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదం జరిగింది. అప్పుడు తీవ్రంగా గాయపడిన వారికి రూ.20వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.10 వేలు పరిహారం అందించాలని సీఎంగా జగన్ ప్రకటించారు. ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పరిహారం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదంలో 15 మంది మరణించారు. వారిలో ముగ్గురికి వారు ప్రకటించినట్లు రూ.కోటి పరిహారం అందలేదు. దాని గురించి జగన్ పట్టించుకోను కూడా పట్టించుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయలేదు. ఎసెన్షియా ప్రమాదంలో చనిపోయిన 17 మందికి రూ.కోటి పరిహారంతో పాటు 36 మంది క్షతగాత్రులకు ప్రకటించిన పరిహారం ఆర్‌టీజీఎస్ ద్వారా నగదు అందించడం పూర్తయింది’’ అని గుర్తు చేశారు.

పులివెందుల ఎమ్మెల్యే జగన్ మాత్రం తెలిసీ తెలియకుండా శవాలు మీద పేళాలు వేరుకునేలా మాట్లాడటం బాధాకరమని, మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి నీచ రాజకీయాలకు చేయడం ఆయన ప్రతిష్టకే భంగం కలిగిస్తుందని ఆమె అన్నారు. అదే విధంగా ఎసెన్షియా ప్రమాదం గురించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇద్దరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం చేశారని చెప్పారు.

ఆ డబ్బు ఏమయ్యాయి..

‘‘ఎల్‌జీ పాలిమర్స్ దగ్గర వైసీపీ ప్రభుత్వం రూ.150కోట్లు తీసుకుంది. అవి ఎవరి జేబుల్లోకి వెళ్లాయో జగన్ చెప్పాలి. ఒక పాఠశాలలో రూ.50కోట్ల వ్యవయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిద్ధం చేస్తామని జగన్ చేసిన ప్రకటన ఏమైంది. రెండు బోర్డుల ఏర్పాటుకే పరిమితమైందా? మిగిలిన పనులు ఎందుకు ప్రారంభం కాలేదు?’’ అని ప్రశ్నించారు.

జగన్ ఏమన్నారంటే..

‘‘అచ్యుతాపురం ఘటన పట్టపగలు జరిగింది. అయినా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పర్యవేక్షణకు వెళ్తున్నాను అని హోం మంత్రి నోట మాట కూడా రాలేదు. కార్మిక శాఖ మంత్రి అయితే మరీ దారుణంగా ప్రమాదానికి సంబంధించిన వివరాలు తన దగ్గర లేవన్నారు. ఎంత మంది చనిపోయారో కూడా తెలియదని చేతులెత్తేశారు. ఈ ఘటనపై స్పందించకూడదన్న తాపత్రయం తప్ప బాధితులకు న్యాయం చేయాలన్న తపన ప్రభుత్వంలో కనిపించలేదు. ఘటన స్థలానికి అంబులెన్సులు కూడా రాని పరిస్థితి. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి దగ్గర కూడా ఒళ్లంతా కాలిన గాయాలు ఉన్నా బాధితులే స్వయంగా బస్సు దిగి ఆసుపత్రిలోకి వెళ్ళిన దుస్థితి’’ అంటూ జగన్ మండిపడ్డారు.

Read More
Next Story