తెలంగాణలో పెరిగిపోతున్న ‘పరువు’ హత్యలు
x
Illustration by Edel Rodrigue (Source: Newsweek)

తెలంగాణలో పెరిగిపోతున్న ‘పరువు’ హత్యలు

అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసిన కూతుర్లు తమను కాదని ఇష్టపడిన వాళ్ళని వివాహాలు చేసుకోవటాన్ని కొందరు తండ్రులు సహించలేకపోతున్నారు


తెలంగాణలో కొంతకాలంగా పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసిన కూతుర్లు తమను కాదని ఇష్టపడిన వాళ్ళని వివాహాలు చేసుకోవటాన్ని కొందరు తండ్రులు సహించలేకపోతున్నారు. అతిప్రేమో లేకపోతే తమను కాదని వివాహంచేసుకున్నదన్న కోపమో తెలీటంలేదు. కారణం ఏదైనా కొందరు తండ్రులు విచక్షణ మరచిపోయి చివరకు కూతురుకుటుంబాన్ని విచ్చిన్నంచేయటానికి కూడా వెనకాడటంలేదు. దాంతో ఏమవుతోందంటే కూతురుభర్త(అల్లుడిని అనచ్చా ?)ను హత్య చేయిస్తున్నారు. కిరాయి హంతకులతో మాట్లాడి కొందరు తండ్రులు, తామే కత్తులు చేతపట్టుకుని ఇంకొంతమంది లేకపోతే కొడుకులను ఉసిగొలిపి ఏదో పద్దతిలో కూతురు బతుకును చిద్రంచేయటానికి కూడా ఏమాత్రం సంకోచించటంలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇలాంటి పరువుహత్యల్లో(Honor Killings) అత్యధికం కులాంతర వివాహాలే. ఎక్కడో ఒకటి, అరా మతాంతర వివాహాలు కూడా ఉంటున్నాయి.

కూతురు ప్రేమికుడిని నరికేసిన తండ్రి-2025, మార్చి 27


పెద్దపల్లి నియోజకవర్గంలో పరువుహత్య జరిగింది. ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామంలో అమ్మాయి తండ్రి పూరిళ్ళసాయికుమార్ అనే కుర్రాడిని కత్తితో నరికేశాడు. కారణం ఏమిటంటే తనకూతురితో సాయికుమార్(17) ప్రేమలో ఉన్నాడని. తన కూతురు ఒక ఎస్సీ కుర్రాడిని ప్రేమించటం అమ్మాయి తండ్రి తట్టుకోలేకపోయాడు. కూతురుకి నయానో భయానో నచ్చచెప్పేందుకు చాలా ప్రయత్నించాడు. ఏ విధంగా చెప్పినా కూతురు తండ్రిమాట వినలేదు. ఈ నేపధ్యంలోనే తన కూతురు, సాయికుమార్ ఊరిచివరలో కలిసున్నట్లు తండ్రికి తెలిసింది. దాంతో ఆవేశంపట్టలేక కుటుంబసభ్యులను వెంటపెట్టుకుని కూతురున్న చోటుకి వెళ్ళాడు. మిత్రులతో కలిసి పార్టీచేసుకుంటున్న సాయికుమార్ ను చూడగానే తండ్రి కోపం కట్టలు తెంచుకున్నది. వెంటనే తన మనుషులతో దాడిచేసి కత్తులతో విచక్షణా రహితంగా నరికేసి పారిపోయాడు. విషాధం ఏమిటంటే పుట్టినరోజే సాయికుమార్ చావురోజు కూడా అవ్వటం. మిత్రులతో కలిసి పుట్టినరోజు పార్టీ చేసుకుంటున్న సాయికుమార్ చివరకు అదేరోజు మరణించాడు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

చెల్లెలిని పెళ్ళిచేసుకున్నాడని మిత్రుడినే చంపేశాడు-2025, జనవరి 28


సూర్యాపేట మండలంలోని మామిళ్ళగడ్డ గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ, కొట్ల నవీన్ మంచిమిత్రులు. ఇద్దరు కలిసి స్ధానికంగా కొన్ని సెటిల్మెంట్లు కూడా చేస్తుండేవారు. ఒకరోజు నవీన్ తన మిత్రుడు కృష్ణను ఇంటికి తీసుకెళ్ళాడు. తన చెల్లెలు భార్గవిని పరిచయంచేశాడు. ఇంటికి రాకపోకలు జరిపే క్రమంలో కృష్ణ-భార్గవి మధ్య పరిచయం పెరిగి స్నేహితంగామారి తర్వాత ప్రేమగా మారింది. కృష్ణ ఎస్సీ, భార్గవి బీసీ అయినా వీళ్ళకు కులాలు అడ్డుగా కనిపించలేదు. అందుకనే ఒకరోజు ఇద్దరు ఇంట్లోచెప్పకుండా వివాహం చేసుకున్నారు(Inter cast Marriages). తన చెల్లెలు తన మిత్రుడిని వివాహంచేసుకోవటాన్ని నవీన్ అంగీకరించలేకపోయాడు. కారణం ఏమిటంటే ఇద్దరు వేర్వేరు కులాల అవటమే. ఆరునెలలు వెయిట్ చేసిన తర్వాత తండ్రి కొట్ల సైదులు, చిన్న తమ్ముడు కొట్ల వంశీతో పాటు మరో మిత్రుడు బైరుమహేష్ తో కలిసి కొట్ల నవీన్ ప్లాన్ వేశాడు. ప్లాన్ ప్రకారమే తామిద్దరికి కామన్ ఫ్రెండ్ అయిన మహేష్ తో నవీన్ ఫోన్ చేయించి రావాలని కృష్ణకు కబురుచేయించాడు. ఫ్రెండ్ రమ్మన్నాడు కదాని మూసీనది దగ్గరకు వచ్చిన కృష్ణను మాటువేసి కత్తులతో నవీన్ కుటుంబం చంపేసింది. కృష్ణ తండ్రి వడ్లకొండ డేవిడ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

చెల్లిని చంపిన అన్న-2024, డిసెంబర్ 02


కులాంతర వివాహం చేసుకున్నదన్న కోపంతో చెల్లెలిని అన్న నడిరోడ్డుపైనే చంపేశాడు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మృతురాలు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుండటం. విషయం ఏమిటంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మండలంలోని హయత్ నగర్ పోలీసుస్టేషన్లో రాయపోలు నామణి ఉద్యోగంచేస్తోంది. ఈమె కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన శ్రీకాంత్ ను వివాహంచేసుకున్నది. ఎలాంటి సమస్యలు లేకుండా ఇద్దరు సుఖంగానే కాపురంచేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఒకరోజు నాగమణి డ్యూటీకి వెళుతుండగా వెనుకనుండి ఒక కారు వచ్చి గట్టిగా ఢీకొట్టడంతో నాగమణి రోడ్డుపైన పడిపోయింది. తలకు బలమైన గాయాలు తగలటంతో ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే మరణించింది. ప్రత్యక్షసాక్ష్యులు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేశారు. చివరకు తేలింది ఏమిటంటే కారుతో స్కూటర్ ను వెనుకనుండి ఢీకొట్టింది స్వయంగా నాగమణి అన్నే. కారణం ఏమిటంటే తమిష్టాన్ని కాదని కులాంతర వివాహం చేసుకున్నదన్న కోపంతో చివరకు చెల్లెలును చంపటానికి కూడా అన్న వెనకాడలేదు.

మతాంతర వివాహమే బలితీసుకున్నదా ? 2022, మే 3

బిల్లిపురం నాగరాజు, సయ్యద్ అస్రుల్ సుల్తానా చిన్ననాటి మిత్రులు. చిన్ననాటి స్నేహం వీళ్ళతో పాటు పెరిగి ప్రేమగా మారింది. నాగరాజు ఐఐటి చదవగా, సుల్తానా బీకాం చదువుతోంది. ఇద్దరి కుటుంబాలు వికారాబాద్ లోనే ఉంటాయి. తమ ప్రేమనే అర్ధంచేసుకోలేని కుటుంబాలు ఇక వివాహాన్ని అంగీకరిస్తాయన్న నమ్మకం వీరిలో కలగలేదు. అందుకనే ఇద్దరు వికారాబాద్ నుండి వచ్చేసి హైదరాబాదులోని ఆర్యసమాజ్ లో 2022, జనవరి 31వ తేదీన వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న విషయం ఇద్దరు తమకుటుంబాలకు చెప్పారు. అయితే ఊహించినట్లుగానే వీళ్ళ వివాహాన్ని రెండుకుటుంబాల్లోని పెద్దలు అంగీకరించలేదు. దాంతో వికారాబాద్ లోనే ఉంటే సమస్యలు వస్తాయని అనుకుని ఇద్దరు వైజగ్ పారిపోయారు. విశాఖపట్నంలో కొంతకాలం కాపురంచేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు చేరుకుని సరూర్ నగర్ ప్రాంతంలో కాపురం పెట్టారు. అయితే వీళ్ళకు తెలియని విషయం ఏమిటంటే తాము వైజాగ్ వెళ్ళి తిరిగి హైదరాబాద్ కు వచ్చినా తమ ఆచూకీ కోసం సుల్తానా కుటుంసభ్యులు వెతుకుతున్నారని. ఒకరోజు సుల్తానా సోదరుడికి మిత్రుడి దగ్గరనుండి ఫోన్ వచ్చింది. ఏమనంటే నాగరాజు, సుల్తానాలు సరూర్ నగర్ ఏరియాలో కాపురం ఉంటున్నారని.


వీళ్ళిద్దరు కాపురం ఉంటున్న ఏరియాను, ఇంటిగురించి తెలుసుకున్నట్లు మిత్రుడు చెప్పటంతో వెంటనే సుల్తానా కులుంబసభ్యులంతా సరూర్ నగర్ కు చేరుకున్నారు. ఒకరోజు సరూర్ నగర్ లో నాగరాజు వచ్చేదారిలో వెయిట్ చేశారు. కొంతసేపటికి ఒంటరిగా మోటారుసైకిల్ పై వస్తున్న నాగరాజును గమనించారు. సడెన్ గా సుల్తానా సోదరుడు సయ్యద్ మొబిన్, మొబిన్ బావమరిది మహమ్మద్ మసూద్ అహ్మద్ తో పాటు మరికొందరు నాగరాజుపై కత్తులతో దాడిచేసి విచక్షణా రహితంగా పొడిచి చంపేశారు. విషయం తెలుసుకున్న సుల్తానా భోరున ఏడుస్తు ఘటనాస్ధలానికి చేరుకుంది. తర్వాత తేరుకుని తన సోదరుడిపైన ఫిర్యాదుచేసింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి హంతకులందరినీ అరెస్టుచేసి కోర్టులో సాక్ష్యాధారాలతో సహా ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు హంతకులందరికీ జీవితఖైదు విధించింది.

కిడ్నాప్ చేసి ఉరేసి మరీ చంపేశారు-2020, సెప్టెంబర్ 24

రాజేంద్రనగర్ కు చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన అవంతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కూతురు ప్రేమ వివాహాన్ని తండ్రితో పాటు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. తమిష్టానికి వ్యతిరేకంగా కులాంతర వివాహం చేసుకోవటమే కాకుండా తమకళ్ళముందే తిరుగుతున్న కూతురు, ఆమె భర్తను చూసి తట్టుకోలేకపోయాడు అమ్మాయి తండ్రి లక్ష్మారెడ్డి. తన తమ్ముడితో మాట్లాడి కొందరు కిరాయిమనుషులతో ఒప్పందం చేసుకున్నాడు. ఒకరోజు గుడికి వెళ్ళి వస్తున్న హేమంత్, అవంతిని గుర్తుతెలీని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్ల నుండి ఎలాగో తప్పించుకున్న అవంతి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు కూడా స్పందించి గాలింపు మొదలుపెట్టారు.


మరుసటిరోజు ఒక యువకుడు సంగారెడ్డి శివార్లలో చెట్టుకు ఉరివేసుకుని ఉన్నట్లు స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. అవంతి ద్వారా ముందురోజే ఫొటోను చూసిన పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకోగానే చెట్టుకు వేలాడుతున్న హేమంత్ ను గుర్తించారు. విచారణలో గుర్తుతెలీని వ్యక్తులు హేమంత్ ను ఉరితీసి చంపినట్లు నిర్ధారణైంది. అవంతి ఫిర్యాదు ఆధారంగా ఆమె తండ్రి, బాబాయ్ ను అరెస్టుచేసి విచారించిన పోలీసులకు హత్యాపథకం అంతా తెలిసిపోయింది. మొత్తం 11 మందిపైన పోలీసులు హత్య ఆరోపణలతో కేసులు నమోదుచేశారు. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది.

మొట్టమొదటి పరువుహత్య-2018, సెప్టెంబర్ 18

పరువుహత్యలు మొదలైంది ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనే. మారుతీరావు అనే వ్యాపారి కూతురు అమృతవర్షిణి, తనమిత్రుడు ప్రణయ్ కుమార్ ను ప్రేమించింది. ఇంట్లో విషయం చెప్పి వివాహం చేయమని అడిగినపుడు మారుతి తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకరోజు అమృత ఇంట్లోనుండి వెళిపోయి ప్రణయ్ ను కులాంతర వివాహం చేసుకున్నది. కూతురు వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న మారుతిరావు పెద్ద గొడవే చేశాడు. భర్తను వదిలేసి తిరిగి ఇంటికి వచ్చేయమని కూతురితో తండ్రి చాలాసార్లు గొడవలుపడ్డాడు. అయినా ఎలాంటి ఉపయోగం లేకపోగా కూతురు గర్భవతి అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. దాంతో కూతురి భర్తపై పట్టరాని కోపంతో తమ్ముడు శ్రవణ్ ద్వారా కొందరు కిరాయి హంతకులతో మాట్లాడుకున్నాడు.


ఒకరోజు ప్రణయ్ తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్షలు చేయించి తిరిగి మొటారుసైకిల్ పై వస్తున్నపుడు కొందరు గుర్తుతెలీని వ్యక్తులు దాడిచేసి ప్రణయ్ ను కత్తులతో పొడిచి చంపేశారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్ధలానికి వచ్చి అమృత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మారుతిరావు, శ్రవణ్ తో పాటు అస్గర్ ఆలీ, అబ్బాస్ బారి, అబ్దుల్ కరీం, ఎస్. శివ, ఎంఏ నిజాంను అరెస్టుచేశారు. అయితే కేసు కోర్టు విచారణలో ఉండగానే మారుతిరావు హైదరాబాదులోని ఒక హోటల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు ఏడేళ్ళ విచారణ తర్వాత పోయిన నెలలోనే కోర్టు నిందితులందరికీ శిక్షలు విధించింది. హత్యలో మారుతితో పాటు కీలకపాత్ర పోషించిన బాబాయ్ శ్రవణ్ కు ఉరిశిక్ష విధించింది. మిగిలిన అందరికీ యావజ్జీవ శిక్ష విధించింది. సూర్యాపేట స్పెషల్ సెషన్స్ కోర్టు జడ్జి ఎన్ రోజారాణి తీర్పు చెబుతు పరువు హత్య రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలోనే మొట్టమొదటి పరువుహత్యగా అభివర్ణించారు.


మతాంతర, కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాహకాలను ఇస్తోంది. ఒకవైపు కులాంతర, మతాంతర వివాహాలను ప్రభుత్వం స్వయంగా ప్రోత్సహిస్తున్నా మరోవైపు పరువుహత్యలు పెరిగిపోతుండటం ఆశ్చర్యంగానే ఉంది. జరిగిన పరువుహత్యల్లో కామన్ పాయింట్ ఏమిటంటే కుటుంబసభ్యులు తమ కూతుర్లను వివాహం చేసుకున్న అబ్బాయిలను చంపేస్తుండటమే. అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసిన తమ కూతుర్లు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహాలు అందులోను కులాంతర వివాహాలు చేసుకుని వెళిపోతుండటాన్ని చాలామంది తండ్రులు ఇష్టపడటంలేదు. కూతుళ్ళపైన అతిప్రేమో లేకపోతే తమ కూతుళ్ళని తమకు కాకుండా చేశారన్న కోపంతోనో అమ్మాయిల తండ్రులు ఏదోపద్దతిలో అబ్బాయిలను హత్యలు చేయిస్తున్నారు. మరీ పరువు హత్యలు ఎప్పటికి ఆగుతాయో చూడాలి.

Read More
Next Story