పురోహితుడికి ఘోర అవమానం.. కదిలొచ్చిన హిందూ సంఘాలు
x

పురోహితుడికి ఘోర అవమానం.. కదిలొచ్చిన హిందూ సంఘాలు

పిఠాపురంలో ఓ పురోహితుడిని కొందరు ఆకతాయిలు అవమానించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.


మన చేష్టలు, మాటలు ఎదుటి వారికి నొప్పించకూడదు, బాధపెట్టకూడదు, అవమాన పరచకూడదు అని మనకు చిన్నప్పటి నుంచి మనకు స్కూళ్లలో నేర్పించినవే. కానీ పెరిగి పెద్దయ్యే కొద్ది కొందరు దీన్ని పూర్తి మర్చిపోయి. తమ క్షణికానందం కోసం ఎదుటివారిని ఎంతలా అవమానించడానికైనా, బాధపెట్టడానికైనా వెనకాడటం లేదు. ఈ చేష్టలకు వాళ్లు ముద్దుగా పెట్టుకున్న పేరే ప్రాంక్. ఈ ఒక్క పదాన్ని చూపుతూ కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులకు చూస్తే చిర్రెత్తుకు వస్తుంది. వాళ్లు కొందరు చేసే పనుల వల్ల సమాజమే తలదించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా కాకినాడ జిల్లా మూలపేట గ్రామంలో జరిగింది. నవ వధూవరులను వివాహ బంధంతో ఒక్కటి చేయడానికి వచ్చిన పురోహితుడిని పెళ్ళికి విచ్చేసిన కొందరు ఆయనను తీవ్రంగా అవమానించారు.

అసలు ఏం జరిగింది

ఈ ఘటన ఏప్రిల్ 12న జరగగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆచెళ్లా సూర్యనారాయణ మూర్తి శర్మ.. పిఠాపురం మండటం మూలపేట గ్రామంలో గ్రామ పురోహితునిగా వృత్తిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగమణి అనే మహిళ కుమారుడి పెళ్ళి కార్యక్రమానికి ఏప్రిల్ 12న పురోహితునిగా వెళ్లారు. అక్కడ కొందరు ఆయన కుంకుమ ప్యాకెట్లు విసరడం, కండువాలు విసరడం వంటివి చేశారు. ఇతరత్రా వస్తువులను కూడా వారు పురోహితునిపైకి విసిరారు. అది చాలదన్నట్లుగా మండపం ఉన్న వస్తువులను కూడా చిందరవందరగా పడేసి ఆయనను అవమానించారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి దానికి ఒక పాటను జోడించి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం అది కాస్తా వైరల్ కావడంతో.. అది వాళ్ల మెడకే చుట్టుకుంది. ఈ ఘటనపై హిందూ సంఘాలు కదిలి వచ్చాయి.



ఖండించిన సంఘాలు

ఈ విషయంపై విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌ దళ్, జయ హనుమాన్ సేవాసమితి వంటి ఇతర హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సదరు బాధిత పురోహితుడిని ఆయా సంఘాలు నాయకులు వెళ్లి పరామర్శించారు. ఈ వీడియోలో పురోహితుడిని అవమానించిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. అంతేకాకుండా పెళ్ళి జరిగిన వారి బంధువుల ఇంటికి వెళ్లి ఆ దురాగతానికి పాల్పడిన ఆకతాయుల గురించి ఆరా తీశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అన్నది ఇంకా తెలియలేదు.

మండిపడుతున్న నెటిజన్లు

ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో దీనిపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిని అవమానించడమే తప్పంటే పిలిచి అవమానించడం మరీ తప్పని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు. నమ్మకం లేకుండా మానుకోవాలే తప్ప వెళ్లి ఇలా చేయకూడదని హితవు పలుకుతున్న వారు కూడా ఉన్నారు.

Read More
Next Story