నిధుల విడుదల పై క్లారిటీ ఇచ్చిన కోర్టు..
x

నిధుల విడుదల పై క్లారిటీ ఇచ్చిన కోర్టు..

నిధుల విడుదల అంశంలో ఏపీ ప్రభుత్వానికి ఒక్కరోజు సమయమిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేతల జోక్యం ఉండకూడదని స్పష్టం చేసింది.


ప్రభుత్వ పథకాలకు నిధులు విడుదల చేయడానికి ఆంధ్ర ప్రభుత్వ చేసిన అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎటువంటి సంక్షేమ పథకాల నిధులను విడుదల చేయొద్దని ఎన్నికల సంఘం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎన్నికల సమయంలో అధికమొత్తంలో నిధులు విడుదల చేస్తే వాటి ప్రభావం ఎన్నికలపై ఉంటుందని ఈసీ భావించింది. అదే విషయాన్ని ప్రభుత్వానికి వివరించింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత నిధులను విడుదల చేసుకోవాలని సూచించింది.

ఏపీ ప్రభుత్వ అభ్యర్థన ఇది

ఆసరా, విద్యా దీవెన, చేయూత, ఈబీసీ నేస్తం, రైతులను పెట్టబడి రాయితీ(ఇన్‌పుట్ సబ్సిడీ) వంటి వాటన్నింటికీ కలుపుకుని మొత్తం రూ.14,165 కోట్లు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఆంధ్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ఆయా పథకాలకు నిధులు విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించామని, తేదీలతో సహా విన్నవించింది. కాగా ఈ సమయంలో అంత అధికమొత్తంలో నిధులు విడుదల చేయడం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావించిన ఎన్నికల సంఘం అందుకు నిరాకరించింది.

హైకోర్టును ఆశ్రయించిన ఏపీ

నిధుల విడుదల విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈసీ నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని తమ తరపు వాదన వినిపించింది. అదే సమయంలో ఎన్నికల సమయంలో ఇంత మొత్తం నిధుల విడుదల ఎన్నికల పారదర్శకతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈసీ తెలిపింది. మే 13 తర్వాత విడుదల చేసుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈసీ తరపు న్యాయవాది వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం ఏపీ ప్రభుత్వానికి కాస్త ఊరట కలిగించేలా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలపై ఒక్కరోజు స్టే విధిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వానికి కూడా కొన్ని కీలక సూచనలు చేసింది.

ప్రచారం చేయొద్దు

నిధుల విడుదలకు ఒక్కరోజు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఈ నెల 11 నుంచి 13 వరకు ఎటువంటి నిధులను విడుదల చేయొద్దని, అదే విధంగా విడుదల చేస్తున్న నిధుల విషయాన్ని ప్రచారం చేయొద్దని స్పష్టం చేసింది కోర్టు. అదే విధంగా ఈ నిధుల విడుదల విషయంలో నేతలు జోక్యం ఉండకూదని హెచ్చరించింది. అనంతరం ఈ పిటిషన్ తదుపరి విచారణను జూన్ 27కు వాయిదా వేస్తున్నట్లు ఉన్నతన్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోసారి ఈసీని ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

నిధుల విడుదలకు హైకోర్టు ఒకరోజు సమయం కల్పించడంతో కోర్టు తీర్పు కాపీని తీసుకుని ఆంధ్ర ప్రభుత్వం.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఎన్నికల సంఘం క్లారిఫికేషన్ ఇచ్చిన వెంటనే నిధుల విడుదల జరుగుతుందని అధికారులు వెళ్లారు. కాగా ఇప్పటివరకు కోర్టు ఉత్తర్వులపై ఈసీ క్లారిఫికేషన్ ఇవ్వలేదు. వారి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతనే తాము నిధుల విషయంలో ముందుకు వెళ్లగలమని అధికారులు చెప్తున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేయనున్న నిధులకు సంబంధించి వాటిని విడుదల చేయనున్నట్లు 23 జనవరి 2024 నుంచి 14 మార్చ్ 2024 మధ్య ప్రకటించినవే. దీంతో ఇప్పుడు ఈ నిధులను విడుదల చేయడానికి ఆంధ్ర ప్రభుత్వం కసరత్తులు చేయడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. మార్చి 14 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ నిధులను ఎందుకు విడుదల చేయలేదని, ఎన్నికల ముందే నిధులు విడుదల చేయాలన్న విషయం ఎందుకు గుర్తొచ్చిందని ప్రతిపక్ష వర్గాలు, కొన్ని వర్గాల ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రజలను ఆకట్టుకోవడానికి, తాము అధికారంలోకి వస్తే ఇలాంటి సంక్షేమ పథకాలు ఉంటాయని చూపించుకోవడానికి ఏపీ ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నవారూ లేకపోలేదు. ఏది ఏమైనా ప్రజల నిర్ణయం తుది తీర్పని మరికొందరు సర్ది చెప్పుకుంటున్నారు. మరి ఈ ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More
Next Story