
చార్మినార్ దగ్గర టాప్ మోడల్స్ వాక్
ప్రపంచదేశాల్లోని సుమారు 120 మంది అందెగత్తెలు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. ప్రపంచదేశాల్లోని సుమారు 120 మంది అందెగత్తెలు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అద్వితీయమైన కార్యక్రమాలను రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఈఏర్పాట్లను టూరిజం శాఖ(Telangana Tourism) కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచంలోని టాప్ మోడల్స్(World Top Models) హైదరాబాద్(Hyderabad) వస్తున్న సందర్భంగా చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 6వ తేదీన చార్మినార్(Charminar) దగ్గర హెరిటేజ్ వాక్(Heritage Walk), మే 7వ తేదీన చౌమొహల్లా ప్యాలెస్(Chowmahalla Palace) లో అందాలభామలకు వెలకమ్ డిన్నర్ ను టూరిజం శాఖ ఏర్పాటుచేస్తోంది. పై రెండు సందర్భాల నేపధ్యంలో చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్ లో జరుగుతున్న, చేయాల్సిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు సమీక్షించారు.
తెలంగాణ బ్రాండ్ వాల్యు పెరిగేలా, తెలంగాణ ఆతిధ్యానికి వన్నెతెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు(Miss World-2025 Contest) నిర్వహించాలని ప్రభుత్వం గట్టిపట్టుదలతో ఉన్నది. మే 7వ తేదీన మొదలయ్యే అందాల పోటీలు మే 31వ తేదీన ముగియబోతున్నాయి. ఈమధ్యలో ప్రపంచసుందరీమణులందరినీ తెలంగాణలోని అనేక చారిత్రక, వారసత్వసంపద కలిగిన ప్రదేశాలకు తీసుకువెళ్ళేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. అందాలపోటీల నిర్వహణలో టూరిజంశాఖకు జీహెచ్ఎంసీ, హెరిటేజ్, పోలీసుశాఖలు సాయంగానిలబడుతున్నాయి. చార్మినార్ వాక్ సందర్భంగా అందాలభామలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అలాగే వెల్కమ్ డిన్నర్లో 120 మంది టాప్ మోడల్స్ తో పాటు మరో 400 మంది సిబ్బంది, ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, అంతర్జాతీయ స్ధాయి ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్లు కూడా పాల్గొంటారు. డిన్నర్ చాలా గ్రాండ్ గా ఉండేందుకు నిజాం కాలంనాటి ఫేమస్ వంటకాలతో పాటు తెలంగాణ రుచులను మెనులో ఉంచబోతున్నారు. చౌమొహల్లా ప్యాలెస్ లో ఫొటో షూట్ కోసం అవసరమై సీటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్, సూఫీ మ్యూజిక్, కవ్వాలీ సంగీత ప్రదర్శన, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా, మోడల్స్ ను ఆకట్టుకునేలా 25 నిముషాల పాటు ప్రదర్శనలు ఉండబోతోంది.
మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచదేశాల్లో మారుమోగిపోవటం ఖాయమని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రపంచదేశాలకు తెలంగాణ గురించి తెలిసొస్తుంది కాబట్టి, బాగాపరిచయం అవుతుంది కాబట్టి పెట్టుబడులు రాబట్టడానికి ఈ పోటీలను ప్రభుత్వం ఒక వేదికగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. అందుకనే కోట్లరూపాయలను ఖర్చుపెట్టి అందాలపోటీల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మరి ప్రభుత్వం తనలక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాల్సిందే.