తెలంగాణా ఫ్యామిలీ సర్వేలో అడగబోయే వివరాలు ఇవే
x

తెలంగాణా ఫ్యామిలీ సర్వేలో అడగబోయే వివరాలు ఇవే

4వ తేదీన ప్రారంభమయ్యే ఈ సర్వేని డిసెంబర్ 9వ తేదీకి ముగించాలని తెలంగాణా ప్రభుత్వం(Telangana Government) డెడ్ లైనుగా పెట్టుకుంది.


నవంబర్ 4వ తేదీనుండి తెలంగాణాలో ఫ్యామిలీ సర్వే(Family Survey) మొదలవ్వబోతోంది. నెలరోజులు జరగబోయే సర్వేకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. 4వ తేదీన ప్రారంభమయ్యే ఈ సర్వేని డిసెంబర్ 9వ తేదీకి ముగించాలని తెలంగాణా ప్రభుత్వం(Telangana Government) డెడ్ లైనుగా పెట్టుకుంది. 4వ తేదీనుండి వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఫాంలను అందిస్తారు. ఆ ఫాం(Form)లను ఇంట్లోని వాళ్ళు క్షుణ్ణంగా చదివి జాగ్రత్తగా వివరాలు అందించాలి. ఈ సర్వేను ప్రభుత్వం సమగ్ర, సామాజిక, ఆర్ధిక, రాజకీయ సర్వేగా చెబుతోంది. ఈ సర్వేలో సుమారు 90 వేలమంది ప్రభుత్వ సిబ్బంది పాల్గొంటారు. క్షేత్రస్ధాయి సర్వేను 15 రోజుల్లో పూర్తిచేసి తర్వాత ఆ వివరాలను సక్రమంగా నమోదుచేసి డేటారూపంలోకి తీసుకొచ్చి కంప్యూటరీకరించటానికి మరో 15 రోజులు పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

ఈ సర్వే ఫాం రెండు విభాగాలుగా ఉంటుంది. మొదటి విభాగంలో సిబ్బంది తాము సర్వే చేస్తున్న ఏరియా వివరాలను భర్తీ చేయాల్సుంటుంది. అక్కడే జిల్లా కోడ్, మండల కోడ్, ఇంటి నెంబర్ నమోదు చేయాలి. అందులోనే జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం లేదా వార్డు లేదా డివిజన్ వివరాలను పూర్తిగా నమోదుచేయాలి. ఈ వివరాల ఆధారంగానే సదరు కుటుంబానికి ప్రభుత్వం ఒక సీరియల్ నెంబర్ కేటాయిస్తుంది. ఈ వివరాలు నమోదుచేసిన తర్వాత పార్ట్ 1లో మరిన్ని వివరాలు నమోదుచేయాలి. కుటుంబంలోని సభ్యులు, యజమాని ఎవరు, కుటుంబంలోని సభ్యులకు యజమానికి రిలేషన్, మతం, కులం, వయస్సులు, మాతృభాష తదితర వివరాలను చెప్పాలి. వీటితో పాటు అభ్యంతరం లేకపోతే ఆధార్ కార్డు వివరాలు కూడా చెప్పాలి. ఒకవేళ ఆధార్(Aadhar) వివరాలు చెప్పటంలో అభ్యంతరం ఉంటే చెప్పక్కర్లేదు.

మొబైల్ నెంబర్లు(Mobile Number), చదువు, ఉద్యోగాలు, జీతాలు, ఉపాధి, వ్యాపారం, వృత్తి, ఆస్తుల వివరాలతో పాటు బ్యాంకు ఖాతాలున్నాయా ? ఎన్ని ఖాతాలున్నాయనే వివరాలను కూడా చెప్పాలి. అలాగే రిజర్వేషన్ కేటగిరీకి సంబందించిన వాళ్ళయితే ఇప్పటివరకు పొందిన ప్రయోజనాల వివరాలు కూడా చెప్పాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించాలి. ఈ వివరాలతో పాటు ప్రభుత్వం అదనంగా మరో వివరం కూడా జోడించింది. అదేమిటంటే రాజకీయ నేపధ్యం. అంటే ఇంట్లోని వాళ్ళు రాజకీయంగా చురుగ్గా ఉంటే ఏ పార్టీలో ఉన్నారు ? పార్టీలో పదవులు, పార్టీ ద్వారా ప్రభుత్వంలో పొందిన పదవులు, సభ్యత్వం, ఎంతకాలంగా పనిచేస్తున్నారనే వివరాలను కూడా ఇవ్వాల్సుంటుంది. పనిలోపనిగా ఫాంలో భూములకు సంబంధించిన వివరాలు కూడా భర్తీ చేయాలి. కలిగి ఉన్న భూములు, ధరణి పాస్ బుక్ ఉంటే ఆ వివరాలు, భూమి ఉన్న ప్రాంతం, ఏ రకం(తరి, మెట్ట, పడవు), సాగు భూమి, కౌలుకి ఇచ్చారా లేకపోతే సాగు సొంతంగానే చేస్తున్నారా అన్న వివరాలు కూడా చెప్పాల్సిందే.

ఇక పార్ట్ -2 లో ఐదేళ్ళల్లో తీసుకున్న అప్పులు, ఎందుకోసం అప్పు తీసుకున్నారు, ఎక్కడినుండి అప్పు తీసుకున్నారు లాంటి వివరాలు చెప్పాలి. కుటుంబానికి ఉన్న స్ధిర, చరాస్తి వివరాలు, ఆవులు, గేదెలు, కోళ్ళు, మేకల్లాంటి పశుసంపద వివరాలు కూడా అందించాలి. రేషన్ కార్డుంటే ఆ వివరాలు, సొంతిల్లుంటే ఇంటి విస్తీర్ణం, ఎప్పుడు కొన్నారు, ఇంట్లోని గదుల సంఖ్య, ఇంట్లోని సౌకర్యలు తదితరాలు కూడా ఇవ్వాలి. వివరాలన్నింటినీ ఇచ్చిన తర్వాత కుటుంబ యజమాని సంతకంచేసిన మొబైల్ నెంబర్ వేయాలి. దాన్ని ఎన్యూమరేటర్ పరిశీలించి సర్టిఫై చేస్తారు. తర్వాత సూపర్ వైజర్ క్రాస్ చెక్ చేసుకుంటారు. ఈ కులగణన లేదా ఫ్యామిలీ సర్వే వివరాలను బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీభవన్లో(Gandhi Bhavan) రేవంత్ రెడ్డి(Revanth Reddy) విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పీసీసీ (PCC President) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, సీనియర్ నేతలంతా పాల్గొన్నారు.

Read More
Next Story