ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
x

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు.


ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రేపు దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో వచ్చే 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదలే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు. బుధ, గురు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాల పడే అవకాశం ఉందన్నారు. నెల్లూరు, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాల కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాల పడే అవకాశం ఉందన్నారు.

పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్‌ హోల్స్‌కు దూరంగా ఉండాలని కూర్మనాథ్‌ తెలిపారు. బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్‌ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్‌ క్రింద ఉండరాదని తెలిపారు. పాత బిల్డింగ్స్‌ వదిలి సురక్షిత భవనాల్లో ఉండాలన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్‌ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు.
Read More
Next Story