వణికిస్తున్న వాన.. ఇళ్లల్లోనే ఉండాలని ఆన
x
ఐఎండీ విడుదల చేసిన తుపాను కదలిక చిత్రం

వణికిస్తున్న వాన.. ఇళ్లల్లోనే ఉండాలని ఆన

ముంచుకొస్తున్న మొంథా.. రేపు, ఎల్లుండి వర్ష బీభత్సమే. సెల్ టవర్లు కూలవచ్చునని, జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు


మొంథా తుపాను తరుముకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఇప్పటి నుంచి ఏ క్షణంలోనైనా తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. గంటకు 18కి.మీ వేగంతో కదులుతోంది. గడచిన 3 గంటల్లో తుపాను స్పీడు పెరిగింది. ప్రస్తుతానికి చెన్నైకి 600కి.మీ, విశాఖపట్నంకి 710 కి.మీ, కాకినాడకి 680 కి.మీ దూరంలో కేంద్రీకృతం ఉంది. ఇవాళ ఉదయంలోగా నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి, అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది.

మంగళవారం దాదాపు 12 గంటలపాటు దాని తీవ్రత కొనసాగి, తర్వాత తుపానుగా బలహీనపడొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మంగళ, బుధవారాల్లో గరిష్ఠంగా గంటకు 110 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని చెప్పింది. వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండని రాష్ట్ర విపత్తుల విభాగం హెచ్చరించింది. నిశితంగా వేచి చూడాలని, ప్రజలు ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని సలహా ఇచ్చింది.

7 జిల్లాలకు రెడ్ ఎలర్ట్...
తుపాను నేపథ్యంలో ఐఎండీ సోమవారం 7 జిల్లాలకు ‘రెడ్‌’ ఎలర్ట్, 16 జిల్లాలకు ‘ఆరెంజ్‌’, మరో 3 జిల్లాలకు ‘ఎల్లో’ ఎలర్ట్, మంగళవారం 14 జిల్లాలకు ‘రెడ్‌’, 8 జిల్లాలకు ‘ఆరెంజ్‌’, మరో 4 జిల్లాలకు ‘ఎల్లో’ ఎలర్ట్‌ జారీచేసింది.
సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకూ సమాచారం అందించారు.
తుపాను నేపథ్యంలో సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్‌ఎఫ్, 7 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాల్లో ఉన్నాయని, మరికొన్ని బృందాలు హెడ్‌క్వార్టర్స్‌లో సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వర్షాలు ఎక్కడెక్కడ పాడవచ్చునంటే..
సోమవారంనాడు అంటే ఇవాళ కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి. తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
మంగళవారంనాడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు; పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైస్సార్‌ కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
బుధవారంనాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు; అల్లూరి సీతారామరాజు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని చెప్పింది.

సెల్ టవర్లతో జాగ్రతగా ఉండాలని విపత్తుల నిర్వహణసంస్థ హెచ్చరించింది. ఇళ్లపైన ఏర్పాటు చేసిన సెల్ టవర్లు గాలికి కూలవచ్చునని, జాగ్రత వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో పలు చోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటు అయ్యాయి.

కృష్ణా జిల్లాలో తుపాను కమాండ్ కంట్రోల్ కేంద్రాల ఫోన్ నెంబర్లు..
కలెక్టర్ కార్యాలయం (91549 70454)
విజయవాడ ఆర్డీవో కార్యాలయం: 0866 2574454
నందిగామ ఆర్డీవో కార్యాలయం: (78930 53534)
తిరువూరు ఆర్డీవో కార్యాలయం: (83098 36215)
Read More
Next Story