
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
70 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తివేసి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరి కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావం వల్ల గురువారం భారీ వర్షాలు పడే అకాశాలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తక్కిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మరి ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కృష్ణా నదికి వరద ఉధృతి అధికంగా ఉంటున్న నేపథ్యంలో పంట్లు, నాటు పడవలతో ప్రయాణించడం వంటివి, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయొద్దని హెచ్చరించారు.