
ఉత్తర కోస్తాకు భారీ వర్షాలు
బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలోని ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయి.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే 24 గంటల్లో మరింతగా బలపడి ఉత్తర కోస్తా తీరంలో భారీ వర్షలు కురిసే అవకాశం ఉంది. 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటి కప్పుడు వాతావరణ హెచ్చరికలు వింటుండాలని అధికారులు హెచ్చరించారు.
గోదావరి వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని, ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.78 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోందని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది ప్రవాహం 3.42 లక్షల క్యూసెక్కులుగా వుంది. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.