
రాయలసీమలో భారీ వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
బంగాళాఖాతంలో కమ్ముకొస్తున్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఆదివారం రాయలసీమతో పాటు కోస్తా తీరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్ది రోజులుగా ఇవి కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉండటంతోపాటుగా ఉక్కపోత కూడా ఎక్కువుగానే ఉంటుండగా.. మరి కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. శనివారం వాతావరణ పరిస్థితి చూస్తే.. కృష్ణా జిల్లా గన్నవరం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు వంటి ప్రాంతాల్లో అధిక స్థాయిలో 36 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. కడప, కాకినాడ, ఎన్టీఆర్, చిత్తూరు జిల్లాతో పాటుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కర్నూలు, విజయనగరం వంటి పలు జిల్లాల్లో వానలు పడ్డాయి. కడప జిల్లా పెద్దముడియం మండలం దిగువ కల్వకట్లలో అత్యధికంగా 18.6 సెంటీమీటర్ల వర్షపాతం శనివారం సాయంత్రం నమోదైంది.