ఏపీలో ఇవాళ కూడా వానలే వానలు.. జాగ్రత్త!
x

ఏపీలో ఇవాళ కూడా వానలే వానలు.. జాగ్రత్త!

ఉత్తరాంధ్రకు ఆరెంజ్ ఎలర్ట్, రాయలసీమకు ఎల్లో ఎలర్ట్, విజయవాడలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు


ఆంధ్రప్రదేశ్ లో మరో 48 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్లన్ని జలమయం అయ్యాయి.. లోతట్టు ప్రాంతాలలో నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై నీరు చేరడంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
వాయవ్య బంగాళాఖాతం-ఒడిశా మధ్య అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావం కోస్తాంధ్రపై ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్ష సూచన ఉంది. తీరం వెంట 35-45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు (Rains) కురుస్తున్నాయి. విజయవాడ (Vijayawada) నగరంలో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. కట్టెలేరు వంతెనపై వస్తున్న వరదనీటిని అధికారులు మళ్లిస్తున్నారు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, గన్నవరం, పామర్రు, పెనమలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది.
28న అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
పార్వతీపురంమన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read More
Next Story