
ఏపీలో భారీ వర్షాలు..సీఎం చంద్రబాబు సమీక్ష
వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలకు తక్షణ సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సీఎస్ విజయానంద్ తదితరులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రస్తుతం కృష్ణా నదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 3.09 లక్షల క్యూసెక్కుల నీరు 35 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువలకు 5 వేల క్యూసెక్కుల మేర నీరు విడిచిపెట్టినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువన నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను కూడా ఎత్తినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.