ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన వరదల ఉరవడి తగ్గు ముఖం పట్టింది. పంట చేలను ముంచెత్తిన వరద నీరు తగ్గే కొద్ది రైతుల గుండెలు అవిసిపోతున్నాయి. నీట మునిగి పాచిపోయిన పంటలు పైకి తేలుతున్నాయి. చచ్చిపోయిన జంతు కళేబరాలు ఉబ్బి భయానకంగా కనిపిస్తున్నాయి. ఏటి పాలైన మూగ జీవాల లెక్కలెన్నో తేలాల్సి ఉంది. కృష్ణా జిల్లాలో బుడమేరు పారినంత దూరం పూచికపుల్లా మిగల్లేదు. భారీ వర్షాలతో వచ్చిన వరదలకు గుంటూరు జిల్లాలో పత్తి పంట మిగల్లేదు. కోస్తా జిల్లాలలో నేల మట్టమైన అరటి, మామిడి వంటి ఉద్యాన పంటలు, కూరగాయల తోటలు బిక్కుబిక్కుమంటూ దర్శనమిస్తున్నాయి. ముంపు బారిన పడిన వరిపొలాలు కుళ్లి కంపుగొడుతున్నాయి.
రంగయ్యాప్పారావుపేటకు చెందిన రామకోటేశ్వరరావు మూడు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి పంట వేస్తే ఈవేళ నయాపైసా చేతికి వచ్చేది లేదు. పెరికీడు వన్ డ్రైన్ పొంగి పొర్లడంతో ఆయన పొలంతో పాటు కొన్ని వందల ఎకరాలు నీట మునిగి వరి కుళ్లి పోయింది. దాదాపు లక్ష రూపాయలు ఆయన నష్టపోయారు.
గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన కె.శరత్ తనకున్న రెండెకరాల పొలంలో పత్తి పంట వేశారు. పూత పిందె దశలో పంట ఉంది. ఇంతలో ఒక్కుమ్మడిగా భారీ వర్షాలు కురిసి నీళ్లు నిల్వ ఉండడంతో ఇప్పుడా చేను ఎందుకూ కాకుండా పోయింది. ఇప్పటికే ఆయన దానిపై లక్షన్నర పెట్టుబడి పెట్టారు.
ఇలా ఒకరా ఇద్దరా.. లక్షలాది మంది రైతులు ఈ వరదలు, భారీ వర్షాలకు నష్టపోయారు. ఆకు తోటలు వేసి కొందరు అరటి తోటలు వేసి మరికొందరు పసుపు పంట వేసి ఇంకొందరు లక్షల్లో నష్టపోయారు. ప్రస్తుతం ఏ గుండెను కదిలించినా హాహా కారాలే ఆక్రందనలే. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ దాటింది. వేసిన పంట నేల మట్టం కాగా మిగిలిన వాటిని కాపాడినా ఫలితం లేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతుల్న ఆదుకోవాల్సి ఉంది. ప్రత్యామ్నాయ పంటలకు సాయం అందించాల్సి ఉంది.
విధ్వంసానికి బలైన వారెందరో...
విజయవాడ సహా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఇటీవలి వరదలకు వ్యవసాయం కుదేలయింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. మౌలిక సదుపాయాలకు, జీవనోపాధికి అపార నష్టం కలిగింది. సుమారు 6లక్షల 40వేల మంది వరకు ఈ వరదలకు నష్టపోయారు. అధికారిక డేటా ప్రకారమే ఈ లెక్క. అనధికార విధ్వంసమెంతో మాటల్లో చెప్పనలవి కాదు. నీట మునిగిన ఊళ్లు తిరిగి మామూలు స్థితికి చేరుకోవడానికి ఎంతకాలం పడుతుందో ఇప్పుడిప్పుడే చెప్పలేం. ఉపశమనం కలిగించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు.
5 లక్షల ఎకరాల్లో పంట నష్టం..
వరదలు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. 19 జిల్లాల్లో 5 లక్షల 8వేల 882 ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. 2లక్షల 57వేల691 మంది రైతులు నష్టపోయారు. సుమారు 50వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ధ్వంసం అయ్యాయి. 12 జిల్లాల్లో 30,902 మంది ఉద్యాన రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. పట్టు పరిశ్రమ (సెరికల్చర్) విభాగంలో ముఖ్యంగా కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వేయి ఎకరాల వరకు దెబ్బతింది. 114 మంది రైతులు నష్టపోయారు. ఈ నష్టాలు రాష్ట్ర వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన దెబ్బ. ఇంతటి విపత్తుకు వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతులు కోలుకోవడం కష్టమనే చెప్పాలి.
నష్టాల వివరాలు ఎలా ఉన్నాయంటే...
వరదల్లో పశుసంపద బాగా దెబ్బతింది. మూగ జీవాలు ప్రాణాలు విలవిల్లాడాయి. 1,294 జంతువులు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నా ఈ సంఖ్య కనీసం ఐదు వేలకు పైమాటే అంటున్నారు రైతులు. సుమారు రెండు లక్షల కోళ్లు చనిపోయాయి. 32,765 జంతువులకు అధికారులు చికిత్స అందించామంటున్నారు. 59,713 పశువులకు టీకాలు వేశారు. వరదలకు ఎన్ని పశువులు కొట్టుకుపోయాయనే దాన్ని అధికారులు నామమాత్రంగా చెప్పినట్టు కనిపిస్తోంది. 605 పశువుల జాడ తెలియడం లేదంటే నమ్మశక్యం కాదు. 251 పడవలు దెబ్బతిన్నాయి. 435 పడవలు గల్లంతయ్యాయి. 2,465 చేపలు పట్టే వలలు ఏటి పాలయ్యాయి.
వరదల రాష్ట్ర మౌలిక సదుపాయాలపై చాలా ఎక్కువగా ఉంది. 4,461 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయారు. 76 చోట్ల గండ్లు పడ్డాయి. 288 వంతెనలు దెబ్బతిన్నాయి. 220 చోట్ల గండ్లు పడ్డాయి. 339 అలుగులు దెబ్బతిన్నాయి. 274 చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ముఖ్యంగా విద్యుత్, రోడ్లు, భవనాల రంగాలలో విధ్వంసం సృష్టించాయి. 76 విద్యుత్ సబ్‌స్టేషన్లు, 33కెవి ఫీడర్లు 55 దెబ్బతిన్నాయి. 1,283 విద్యుత్ స్తంభాలు, 2,985 డైనమిక్ థర్మల్ స్టేషన్లు పాడయ్యాయి. మరమ్మతులు చేపట్టారు. పలు జిల్లాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాల పునరుద్ధరణ కొనసాగుతోంది.
కేంద్ర ప్రభుత్వ బృందాలు రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి. నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. ఆ సాయం ఎప్పుడొస్తుందో చెప్పలేకపోయినా కనీసం ఎంత మేర నష్టం జరిగిందన్న విషయమైనా ప్రజలకు తెలుస్తుంది.