ఆంధ్రను హడలెత్తించనున్న వడగాలులు.. ఎన్ని జిల్లాల్లో అంటే..
ఆంధ్రలో ఎండ తీవ్రత రానున్న రోజుల్లో అధికం కానుందని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా..
ఆంధ్రలో ఎండ తీవ్రత రానున్న రోజుల్లో అధికం కానుందని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రలో వేడి పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఇందులో భాగంగానే రేపు అంటే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 149 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, అదే విధంగా 160కి మండలాల్లో వడగాలులు వీయొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఎల్లుండి కూడా ఈ వడగాలుల తీవ్రత అధికంగానే ఉంటుందని, 195 మండలాల్లో తీవ్రస్థాయి వడగాలులు, 147 మండలాల్లో వడగాలులు వీయొచ్చని ఆయన చెప్పారు.
ఈ మండలాల ప్రజలు జాగ్రత్త
రేపు శ్రీకాకుళం 22, విజయనగరం27, పార్వతీపురంమన్యం 15, అల్లూరి 2, విశాఖ6, అనకాపల్లి 20, కాకినాడ 18, కోనసీమ 7, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 4, ఏలూరు 7, కృష్ణా 2, బాపట్ల కొల్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. కావున ఆ మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చుట్టుపక్కల మండలాలపై కూడా ఈ వడగాలుల ప్రభావం ఉంటుందని ఆయన వెల్లడించారు. వీటితో పాటుగా శ్రీకాకుళం 8, అల్లూరి 8, విశాఖ 2, అనకాపల్లి 2, కాకినాడ 3, కోనసీమ8, తూర్పుగోదావరి 1, పశ్చిమగోదావరి 13, ఏలూరు 21, కృష్ణా 19, ఎన్టీఆర్ 17, గుంటూరు 17, పల్నాడు 15, బాపట్ల 20, ప్రకాశం 6 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
జాగ్రత్తలు తప్పనిసరి
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరగనున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. బయటకు వీలైనంత వరకు రావొద్దని, తప్పని పరిస్థితుల్లో వస్తే ముఖానికి కర్చీఫ్, స్కార్ఫ్ వంటివి ధరించాలని చెప్పారు. దాంతో పాటుగా ప్రతి అరగంటలకు ఒకసారి ద్రవపాణీయాలు తీసుకుంటూ శరీరం డీహైడ్రేడ్ కాకుండా చూసుకోవాలని చెప్పారు. ఎండ తీవ్రత అధికంగా ఉంటున్న క్రమంలో వీలైనంత వరకు నీడపట్టున ఉండేలా చూసుకోవాలని, ఇంట్లో కూడా చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
ఈరోజు ఉష్ణోగ్రత్తలు ఇలా
సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడులో అత్యధికంగా 41.9 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా మనుబోలులో 41.5°C, బాపట్ల జిల్లా వేమూరు, కృష్ణా జిల్లా పెడనలో 40.9°C, అల్లూరి జిల్లా చింతూరులో 40.8°C, పల్నాడు జిల్లా నాదెండ్ల, విజయనగరం జిల్లా డెంకాడలో 40.7°C, అనకాపల్లి జిల్లా రావికమతంలో 40.4°C, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 40°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.