లడ్డూ వివాదంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ
x

లడ్డూ వివాదంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ

లడ్డూ వివాదంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఘాటు వ్యాఖ్యలు చేసిన న్యాయం స్థానం గురువారం ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


తిరుమల లడ్డూ వివాదంతో తెరపైకి వచ్చిన దేవుడి రాజకీయాలు, మత విద్వేషాలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గత కొద్ది రోజులుగా అట్టుడికి పోయింది. తిరుమల లడ్డూ వివాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదు. దేశం నలుమూలలకు పాకింది. దీంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఎంతో సున్నితమైన ఈ అంశాన్ని అధికారంలో ఉన్న నాయకులే రచ్చకెక్కేలా చేశారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్నామనే సోయ లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లు విచక్షణా రహితంగా వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్‌ అయితే లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో ఏకంగా పంది కొవ్వు కలిసిందనే ఆరోపణలు గుప్పించారు. ఇతర మంత్రులు, ప్రభుత్వ పెద్దలందరూ ఇదే దారి పట్టారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అయితే హిందూ ధర్మానికి అపచారం జరిగితే కోపం రాదా? చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చుంటారా? ఎన్ని రోజులు ఇలా ఉంటారు? అని రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉండి విచారణ చేసి దోషులను శిక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలే ఇలా వ్యవహరించడంతో భక్త లోకం విస్తుపోయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పగ సాధించడం కోసం దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడమేంటనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వంటి పలువురు నేతలు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిగ్గు తేల్చాలని పిటీషన్లు వేశారు. దీనిపైన సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైన, సీఎం చంద్రబాబుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ రాజకీయాల్లోకి దేవుళ్లను ఎందుకు లాగుతున్నారని మొట్టికాయలు వేసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచారని చివాట్లు పెట్టింది. నెయ్యి కల్తీ జరిగినట్లు ఆధారాలున్నాయా అని నిలదీసింది. సెకెండ్‌ ఒపినీయన్‌ తీసుకున్నారా? కల్తీ జరిగిందని చెప్పడానికి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారా? లడ్డూను ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు అంటూ తీవ్రంగానే వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను అక్టోబర్‌ 3కి వాయిదా వేసింది.
గురువారం దీనిపై తిరిగి విచారణ జరగనుంది. ఏపీ స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు పక్షాన వాదించిన సిద్ధార్థ్‌ లూథ్రా వంటి ప్రముఖ లాయర్లు వాదనలు వినిపించనున్నారు. దాదాపు 11 మంది పేరు ప్రఖ్యాతులు పొందిన న్యాయవాదులు ప్రభుత్వం తరపున వాదించనున్నారు. పిటీషనర్ల తరపున మరో 20మందికి పైగా న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. సంచలనంగా మారిన లడ్డూ వివాదం ప్రపంచ వ్యాపితం కావడం, ఇప్పటికే సీఎం చంద్రబాబు, ఆయన ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో గురువారం ఎలా విచారణ చేపట్టనుంది, ఎలాంటి తీర్పును వెలువరించనుందనే దానిపై దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
Read More
Next Story