రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య బీమా
x

రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య బీమా

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రి మండలి సమావేశం జరిగింది.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ సీఎం చంద్రబాబు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్‌ భారత్‌–ఎన్టీఆర్‌ వైద్య సేవా పథకం కింద రూపొందించిన యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో గురువారం మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 30 అంశాలపైన చర్చించిన మంత్రి వర్గం వాటికి ఆమోద ముద్ర వేసింది. మంత్రి వర్గం ఆమోదించిన యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ కింద ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ. 25లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్సలు అందించే విధంగా సరికొత్త విధానాన్ని కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్థిక స్థితిగతులతో ఎలాంటి సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ ఈ హెల్త్‌ పాలసీని అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 1.63 కోట్ల కుటుంబాలకు ఈ ఆరోగ్య బీమా అందేవిధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీఎం చంద్రబాబు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

అంతేకాకుండా ఈ హెల్త్‌ పాలసీ కింద ఆంధ్రప్రదేశ్‌లోని 2,493 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందించే విధంగా ఎన్టీఆర్‌ వైద్యసేవ హైబ్రిడ్‌ విధానాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దీంతో పాటుగా 3,257 వైద్య సేవలను ఈ హైబ్రిడ్‌ విధానంలో అందించనున్నారు. వైద్య సేవలు అవసరమైన వారికి కేవలం ఆరు గంటల్లోనే అనుమతులు ఇచ్చే విధంగా ప్రీ ఆర్గనైజేషన్‌ మేనేజ్‌మెంట్‌ను ఇప్పటికే ఒక కొలిక్కి తీసుకొచ్చారు. దీంతో పాటుగా రూ. 2.5లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్‌లు బీమా కంపెనీల పరిధిలోకి వచ్చే విధంగా ఈ హైబ్రిడ్‌ విధానాన్ని తయారు చేశారు. వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చు రూ. 2.5లక్షల నుంచి రూ. 25లక్షల వరకు బిల్లులను ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు భరించనుంది. ఏపీలో పీపీపీ మోడ్‌లో 10 కొత్త మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు కూడా సీఎం చంద్రబాబు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో ఈ మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు.

Read More
Next Story