తన ప్రాణం కంటే ఆ ఆగురుగురే ముఖ్యమనుకున్నాడు.. వరదల నుంచి కాపాడుకున్నాడు
x

తన ప్రాణం కంటే ఆ ఆగురుగురే ముఖ్యమనుకున్నాడు.. వరదల నుంచి కాపాడుకున్నాడు

చెన్నకేశవరావు కుర్చీలు, మంచాలు చేసే ఒక చిన్న షాపు యజమాని. బుడమేరు వరదల్లో ఆ షాపు మునిగింది. అందులో పని చేసే ఆరుగురు కార్మికులు వరదల్లో చిక్కుకొని పోయారు. తన ప్రాణాలను తెగించి వారిని కాపాడుకున్నారు. ఎలాగంటే..


తన షాపు, అందులో లక్షలు విలువ చేసే సామాను కంటే తన షాపులో పని చేసే ఆరుగురు ప్రాణాలు కాపాడాలనుకున్నాడు ఒక యజమాని. తనకు ఈతొచ్చు. కాబట్టి ప్రాబ్లమ్‌ లేదనుకున్నారు. వరద ప్రవాహలో దూకాలనుకున్నారు. పోలీసులు వారించడంతో వెనక్కి తగ్గారు. అంతటితో ఆగలేదు. వెంటనే ఆరు వందలు పెట్టి ఒక లారీ ట్యూబ్‌ను కొన్నాడు. దానిక ఒక చెక్కను కట్టారు. ఇక పోలీసులు వారిస్తున్నా వినలేదు. వరద ప్రవాహంను చూసి భయపడనూ లేదు. తన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలు చెంద లేదు. చివరికి తన తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. వాటి కంటే ఆ ఆరుగురి ప్రాణాలే ముఖ్యమనుకున్నాడు. ట్యూబ్‌ను వేసుకొని వరద ప్రవాహంలోకి దూకాడు. రెండు కిలోమీటర్ల వరకు ఈదుకుంటూ వెళ్లాడు. వరద ప్రవాహంలో చిక్కుకొని రాత్రంతా బయటకు రాలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ వరణికి పోతున్న ఆరుగురిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన ఎక్కడో కాదు రెండు వారాల క్రితం విజయవాడలో బీభత్సం సృష్టించిన బుడమేరు వరదల్లో చోటు చేసుకుంది.

అతని పేరు చెన్నకేశవ రావు. కృష్ణలంకలో నివాసం ఉంటారు. అతనికి అజిత్‌సింగ్‌నగర్‌లో మంచాలు, కుర్చీలు తయారు చేసే ఒక చిన్న ఫర్నిచర్‌ షాపు ఉంది. ప్రతి రోజు కృష్ణలంక నుంచి సింగ్‌నగర్‌కు వెళ్లి షాపు నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంటారు. ఇక్కడ ఫోల్డింగ్‌ ఐరన్‌ మంచాలు, ఐరన్‌ కుర్చీలు, స్టూడెంట్‌ చైర్లు లేదా స్టడీ చైర్లు వంటి ఫర్నిచర్‌ను తయారు చేస్తుంటారు. వీటిని తయారు చేయడానికి నలుగురు కార్మికులు పని చేస్తుంటారు. వీరు విజయవాడ నివాసులు కాదు. ఉత్తరాదికి చెందిన వారు. తెలుగు రాదు. హిందీనే మాట్లాడుతారు. పగలంతా ఈ పనులు చేసుకుంటూ రాత్రులు ఇదే షాపులోనే బస చేస్తుంటారు. ఇక్కడే వంట కూడా చేసుకొని తింటుంటారు. శనివారం రాత్రి వరకు ఇలాగే చేసుకుంటూ వచ్చారు. అయితే ఆగస్టు నెలాఖరు శనివారం సాయంత్రానికి ఆ ప్రాంతంలోకి బుడమేరు వరద నీరు రావడం మొదలైంది. షాపులోకి రావనుకున్నారు. ఇబ్బందేముండదులే అనుకున్నారు. ఆ రోజు మాత్రం ఆరుగురు కార్మికులు షాపులో ఉన్నారు. బయట వరకు వచ్చి ఆగి పోతుందిలే అనుకున్నారు. రాత్రి వరకు అదే ధైర్యంతోనే ఉన్నారు. సాయంత్రం యదావిధిగా తమ పని పూర్తి చేసుకున్నారు. భోజనం చేశారు. రాత్రి అక్కడే పడుకున్నారు.
బయట బుడమేరు వరద ప్రవాహం పెరుగుతుండటంతో రాత్రి 8, 9 గంటల నుంచి నుంచి వరద నీరు షాపులోకి రావడం మొదలైంది. కొన్ని నిముషాల వ్యవధిలోనే షాపులోకి నీరు వచ్చేసింది. ఆ పాంత్రం అంతా వరద మయం కావడంతో కరెంట్‌ను కట్‌ చేశారు అధికారులు. పవర్‌ ఉంటుందనే ఉద్దేశంతో మొబైళ్లకు చార్జింగ్‌ కూడా పెట్టుకోలేదు. ఉన్న కాస్త చార్జింగ్‌తో ఫోన్‌ ద్వారా తమ యజమానికి పరిస్థితిని తెలిపారు. అలా ప్రతి పది నిముషాలకు ఫోన్‌లో వరద గురించి చెబుతూనే ఉన్నారు. మధ్య, మధ్యలో వీడియో కాల్‌ చేసి కూడా పరిస్థితిని చూపిస్తూ వచ్చారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో షాపులోకి వరద నీటి ప్రవాహం పెరిగి పోవడంతో షాపులోకి పెద్ద ఎత్తున నీరు వచ్చేసిందని, తమకు ఇక్కడ ఎవ్వరూ తెలియదని, ఏమి చేయాలో అర్థం కాలేదని చెన్నకేశవరావుకు ఫోన్‌ చేసి ఏడ్చేశారు. తర్వాత ఫోన్లకు ఉన్న చార్జీంగ్‌ అయిపోయింది. ఇక యజమానితో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఇక అక్కడ నుంచి యజమానికి ఆందోళనలు మొదలయ్యాయి. అక్కడ వరద పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే వీలు లేకుండా పోయింది. భయాందోళనలు ఆవరించాయి. దీంతో షాపులోకి నీళ్లు ఎంత లోతు వచ్చాయో, కార్మికులు ఎలా ఉన్నారో, మునిగి పోయి ఉంటారా..వాళ్లను ఎలా రక్షించుకోవాలనే ఆలోచనలతో చెన్నకేశవరావుకు కంటి మీద రాత్రంతా కునుకు లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడెళ్లి కార్మికులను రక్షించుకోవాలనే ఆలోచనల్లోనే ఉండి పోయారు.
ఇక ఆదివారం తెల్లవారు జాము నాటికి వరద ప్రవాహం పెద్ద ఎత్తున పెరిగి పోయింది. పైపుల రోడ్డులోని తన షాపును దాటుకొని సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ వరకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. తన షాపునకు చేరుకోవాలంటే అదే రూట్‌ నుంచే వెళ్లాలి. ఆదివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు చెన్నకేశవరావు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. తన షాపు మునిగి పోయిందని, ఆరుగురు కార్మికులు అందులోనే ఉండి పోయారని వారిని రక్షించాలని ఎంత వేడుకున్నా పోలీసులు వినలేదు. వరద ప్రవాహం ఎక్కువుగా ఉందని ఇప్పుడు వెళ్లడం మంచిది కాదని వారించారు. చెన్నకేశవరావుకి గుండెగినంత పనైంది. ఏమి చేయాలో దిక్కు తోచలేదు. కళ్ల ముందు ఆ ఆరుగురు కార్మికులే కనిపిస్తున్నారు. ఎలాగైనా వారిని సేవ్‌ చేయాలనుకున్నారు.
ఇంతలో ట్యూబ్‌తో వెళ్చొనే మెరుపు ఆలోచన తన మైండ్‌కు తట్టింది. ఇక క్షణం వేస్ట్‌ చేయలేదు. అక్కడ నుంచి నేరుగా ఆటోనగర్‌కు తన బైక్‌పై వెళ్లాడు. సింగ్‌నగర్‌ నుంచి ఆటోనగర్‌కు దాదాపు 9కిలోమీటర్ల దూరం ఉంటుంది. రూ. 500 పెట్టి ఒక లారీ ట్యూబ్‌ను కొన్నాడు. అంతే స్పీడ్‌గా సింగ్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ వద్దకు చేరుకున్నారు. దానికి ఒక చెక్కను అమర్చుకున్నారు. తన ఫ్రెండ్‌ సతీష్, భావమరిదితో కలిసి క్షణం వృధా చేయకుండా, తన ప్రాణాలను లెక్క చేయకుండా ట్యూబ్‌ను వేసుకొని వరద ప్రవాహంలోకి దూకారు. దాదాపు రెండు కిలోమీటర్ల ఈదుకుంటూ తన షాపు వద్దకు చేరుకున్నారు. కార్మికులు ఎలా ఉన్నారో చూసుకున్నారు. రాత్రంతా వరద ప్రవాహం ఉండటంతో షాపు గోడల మీదకు ఎక్కి కూర్చున కార్మికులను చూసిన చెన్నకేశవరావుకు కళ్లు చెమ్మగిలాయి. ఒక్కొక్కరిని ట్యూబ్‌ను ఆధారంగా చేసుకొని వరద ప్రవాహం నుంచి దాటించి రక్షించుకున్నామని షాపు యజమాని చెన్నకేశవరావు ‘ది ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’కు వివరిస్తూ పర్యంతమయ్యారు. తనను నమ్ముకొని షాపులో పని చేస్తున్నారని, వారిని కాపాడుకోవలసిన బాధ్యత తనపై ఉందని, అందుకే తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని, పోలీసులు వారిస్తున్నా వరద ప్రవాహంలోకి దూకేశానని చెప్పుకొచ్చారు.
వరదల వల్ల తనకు చాలా నష్టం వాటిల్లిందని చెప్పారు. దాదాపు రూ. 5లక్షల వరకు నష్టం వచ్చిందన్నారు. రెండు యంత్రాలు పాడైపోయాయి. మంచాలకు వేసే ఫ్లై ఉడ్‌ చెక్కలు మునిగి పాడైపోయాయి. బయటే ఉండి పోవడంతో పరుపుల్లా ఉపయోగించే బండిల్స్‌ వరద నీటిలో కొట్టుకొని పోయాయి. 16 బండిల్స్‌ వరద ప్రవాహంలో కొట్టుకొని పోయాయి. తయారు చేసిపెట్టి సేల్స్‌కు సిద్ధంగా ఉన్న 64 మంచాలు, 54 కుర్చీలు వరద నీటిలో మునిగి పోయి పనికి రాకుండా పోయాయి. దీంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ నష్టం తనకు మించిన భారమని, దీని నుంచి కోలుకోవడానికి ఏడాదైన పడుతుందని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. వరదలకు ముందు సత్యనారాయణ పురంలో ఉన్న సేల్స్‌ ఫర్నచర్‌ షాపు షార్ట్‌ సర్క్యూట్ వల్ల కాలిపోయిందని, దీంతో రెండు విధాలుగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More
Next Story