సొంతింటికే కన్నం వేసి.. ఆపై పోలీసులకు చిక్కి..
x
నిందితులతో మీడియాకు వివరాలను వెల్లడిస్తున్న విశాఖ సీపీ బాగ్చీ

సొంతింటికే కన్నం వేసి.. ఆపై పోలీసులకు చిక్కి..

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో వచ్చిన నష్టాలతో అప్పుల పాలై, వాటిని తీర్చడానికి సొంతింటికే కన్నం వేసిన ప్రబుద్ధుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.

తండ్రిలాగే తానూ వ్యాపారంలో సక్సెస్‌ అవ్వాలనుకున్నాడు పందొమ్మిదేళ్ల ఆ కొడుకు. అడ్డదారుల్లో తొందరగా ఎదగాలని తలంచాడు. అందుకు సరైన మార్గాన్ని కాకుండా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ను ఎంచుకున్నాడు. అయితే అది కాస్తా బెడిసి కొట్టడంతో అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులను తీర్చడానికి సొంతింటికే కన్నం వేయాలని స్నేహితులతో కలిసి సినీ ఫక్కీలో ప్లాన్‌ వేశాడు. ప్లాన్‌ అయితే వర్కవుట్‌ అయింది గాని పాచిక పారలేదు. చివరకు ఆధునిక టెక్నాలజీతో పోలీసులకు చిక్కి ఊచలు లెక్క పెడుతున్నాడు. ఆసక్తి రేకెత్తించే ఈ ఘటన విశాఖ నగరంలో జరిగింది. ఆన్‌లైన్‌ బెట్టింగులు, చెడు వ్యసనాలకు బానిసలవుతున్న యువత ఎలాంటి అడ్డదారులు తొక్కుతుందో ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

అసలేం జరిగిందంటే?
విశాఖ నగరం కంచరపాలెంలోని ఇంద్రానగర్‌లో ధర్మాన ఆనందంరెడ్డి భార్య, తల్లి, కుమార్తె, కుమారుడితో నివాసం ఉంటున్నారు. ఆనందంరెడ్డి జీవీఎంసీలో కాంట్రాక్టరు కావడంతో ఆర్థికంగా స్థిరపడ్డాడు. కుమారుడు కృష్ణకాంత్‌కు తానూ స్థితిమంతుడిని కావాలని చిన్న వయసులోనే కోరిక పుట్టింది. ఆ కోరికను తీర్చుకోవడానికి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ బాట పట్టి బోల్తా కొట్టాడు. ఆపై చెడు దారి పట్టాడు. భారీగా చేసిన అప్పులను తీర్చడానికి తన ముగ్గురి స్నేహితులు పరపతి ప్రమోద్‌కుమార్‌ (30), షేక్‌ అభిషేక్‌ (21), అవసరాల సత్య సూర్యకుమార్‌ (22)లతో కలిసి ఉపాయాన్ని ఆలోచించాడు. తన సొంతిల్లు ఉండగా ఎవరింటికో కన్నం వేయడం ఎందుకు? అనుకున్నాడు. అంతా కలిసి స్కెచ్‌ వేశారు. కృస్ణకాంత్‌ తండ్రి ఈనెల 4న హైదరాబాద్‌ వెళ్తున్న విషయాన్ని వారం రోజులు ముందే తెలుసుకుని ఆరోజు దోపిడీకి ప్లాన్‌ వేశారు.
దోపిడీకి పాల్పడ్డారిలా..
ఈనెల 5వ తేదీ అర్థరాత్రి 12.30 గంటల సమయంలో ఆనందంరెడ్డి ఇంటి వెనక తలుపులు పగులగొట్టి ముగ్గురు వ్యక్తులు లోపలకు ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లో కృష్ణకాంత్, అతని నాయనమ్మ ఉన్నారు. ముందస్తు ప్లాన్‌లో భాగంగా కృష్ణకాంత్‌ను, నాయనమ్మను ప్లాస్టిక్‌ తాళ్లతో కట్టేసి, నోటికి ప్లాస్టర్‌ వేశారు. ఆమె ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, మనవడు కృష్ణకాంత్‌ డైమండ్‌ ఉంగరం, బీరువాలోని రూ.50 వేల నగదు దోచుకున్నారు. అనంతరం ఇంటి ముందు పార్క్‌ చేసిన మహింద్ర ఎక్స్‌యూవీ 500 (ఏపీ 31 ఈటీ 3777) వాహనాన్ని దొంగిలించి పరారయ్యారు. దోపిడీ సంగతిని హైదరాబాద్‌లో ఉన్న ఆనందంరెడ్డి చెప్పారు. ఆయన ఫిర్యాదుతో కంచరపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సాంకేతికతతో చిక్కారు..
పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతికతతో ముందుకు వెళ్లారు. మొబైల్‌ డేటాలో ఆనుమానాస్పద యాప్‌లు, డిలీట్‌ అయిన చాట్స్, ట్రేడింగ్‌కు సంబంధించిన హిస్టరీ, ప్లాస్టర్‌ సెర్చి హిస్టరీ తదితర ఆధారాలను గుర్తించారు. సాంకేతిక విశ్లేషణ ద్వారా నిందితులు విజయవాడ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో శోధించారు. తమను పోలీసులు వెంటాడుతున్నారన్న సంగతి తెలుసుకుని వీరు విశాఖపట్నం తిరిగి వచ్చి బంగారం, నగదు పంచుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో కుమారుడే ఇంటి దొంగ అని తెలిసి షాకయ్యారు.
విచారణలో నిందితులు ఏం చెప్పారంటే?
ఆనందంరెడ్డి ఇంట్లో దోపిడీ అనంతరం నిందితులు ఇంటి ముందు పార్క్‌ చేసిన వాహనాన్ని సీసీ కెమెరాలకు చిక్కకుండా, పోలీసు తనిఖీలు తక్కువగా ఉండే ప్రాంతాల మీదుగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా ఎన్‌ఏడీ, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, అడివరం, హనుమంతవాక మీదుగా మారికవలస వెళ్లి అక్కడే వాహనాన్ని వదిలిపెట్టారు. అక్కడ నుంచి ఆటోలో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చి విజయవాడ, ఆపై హైదరాబాద్‌కు పారిపోయారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి విశాఖ వచ్చేశారు. ఈ దోపిడీ ఘటనకు ఆనందంరెడ్డి కుమారుడు కృష్ణకాంతే సూత్రధారి అని, ముందస్తు పథకంలో భాగంగానే కృష్ణకాంత్‌ను కూడా తాళ్లతో కట్టేసి కొట్టామని నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. తెలుగులో మాట్లాడితే స్థానికులన్న అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో చోరీ సమయంలో నిందితులు ముగ్గురూ హిందీలోనే మాట్లాడిన ట్టు, ముఖాలను గుర్తించకుండా మాస్కులు ధరించినట్టు చెప్పారు.
చోరీ సొత్తు స్వాధీనం.. నిందితుల అరెస్టు..
పోలీసులు నిందితుల నుంచి రూ.2.10 లక్షల నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు, మహింద్ర ఎక్స్‌యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ సూత్రధారి కృష్ణకాంత్‌ సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. క్రైమ్‌ డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, సీఐ మీసాల చంద్రమౌళి, ఎస్‌ఐ షేక్‌ అబ్దుల్‌ మరూఫ్, సీసీఎస్‌ సిబ్బంది దర్యాప్తులో పాలుపంచుకుని నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ వీరిని అభినందించారు.
పోలీస్‌ కమిషనర్‌ ఏమన్నారంటే?
ఆన్‌లైన్‌ ట్రేడింగ్, బెట్టింగ్‌లు, ఫాస్ట్‌/ఈజీ మనీ ఆకర్షణలతో చాలా మంది యువత తప్పుదారి పడుతున్నారు. కష్టపడి సాధించిన విజయం మాత్రమే శాశ్వతం. షార్ట్‌ కట్‌ లాభాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు చట్టవ్యతిరేక మార్గం కాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడి సరైన దారిని ఎంచుకోండి. ఒక తప్పుడు నిర్ణయం మీ భవిష్యత్తును చీకట్లోకి నెడుతుంది’ అని విశాఖ నగర కమిషనర్‌ శంఖ బ్రత బాగ్చీ యువతకు సూచించారు.
Read More
Next Story