ఉద్ధరిస్తానని ఊడ్చేశాడు.. అపై ఉడాయించాడు!
x
విశాఖలో బోర్డు తిప్పేసిన స్నేహ సొసైటీ ప్రధాన కార్యాలయం

ఉద్ధరిస్తానని ఊడ్చేశాడు.. అపై ఉడాయించాడు!

అంబేడ్కర్‌ ఆశయ సాధన పేరిట ఓ సహకార సొసైటీని స్థాపించిన ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి సాటి దళితులను నిండా ముంచేశాడు.

ఆయనో ఐఆర్‌ఎస్‌ అధికారి. పేరు కటికల శివ భాగ్యారావు. ఆదాయపు పన్నుల శాఖలో ఉన్నత పదవులు చేపట్టారు. పదవీ విరమణకు ముందే వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ప్రాంతానికి చెందిన శివ భాగ్యారావు దళితుల అభ్యున్నతికి పాటుపడడానికే వీఆర్‌ఎస్‌ తీసుకున్నానని చెప్పేవారు. వేదికలెక్కి అవే ఉపన్యాసాలు చేసేవారు. అందులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌నూ జోడించేవారు. దళిత, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఉద్ధరించడానికంటూ 2008లో విశాఖపట్నం సీతంపేటలోని రాజేంద్రనగర్‌లో స్నేహ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (స్నేహ మ్యాక్స్‌)ని స్థాపించారు. కొన్నాళ్లకు స్నేహ టీవీ పేరుతో న్యూస్‌ ఛానల్‌నూ పెట్టారు.


ఆందోళన చేస్తున్న బాధితులు

తమ స్నేహ సొసైటీలో డిపాజిట్లు చేస్తే 12 శాతం వడ్డీ చెల్లిస్తానని చెప్పి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ఇతరులను నమ్మించారు. ఈ సంస్థ ద్వారా వచ్చే లాభాలను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దళిత మహిళలకు రుణాలు ఇచ్చి ఆదుకుందామని చెప్పారు. అంతేకాదు.. దళితులు ఆరాధ్యదైవంగా భావించే అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసమే ఈ సొసైటీని స్థాపించానని చెప్పుకున్నారు. సమాజంలో పలుకుబడి కలిగిన కొంతమందిని డైరెక్టర్లుగా నియమించారు.

ఆదాయపు పన్నుల శాఖలో అత్యున్నత పదవిలో ఉంటూ స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం, అంబేడ్కర్‌ ఆశయ సాధన పేరిట సొసైటీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించడంతో పలువురు దళితులతో పాటు ఇతర బలహీన వర్గాల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఆయనను నమ్మారు. ఆయనలాగే తమనూ ‘భాగ్య’వంతులను చేస్తారని గుడ్డిగా విశ్వసించారు. ఆ నమ్మకంతో వందో రెండొందలమందో కాదు.. 2,500 మందికి పైగా స్నేహ సొసైటీలో డిపాజిట్లు చేశారు. ఇలా వీరు స్నేహలో చేసిన డిపాజిట్లు రూ.100 కోట్లకు పైనే. కొన్నేళ్ల పాటు డిపాజిటర్లకు సజావుగా వడ్డీలు చెల్లించారు. సంస్థ వార్షికోత్సవాలు అట్టహాసంగా నిర్వహించి ప్రముఖులను, రాజకీయ నాయకులను తీసుకొచ్చి హడావుడి చేసేవారు.


సొసైటీ చైర్మన్, ఐఆర్‌ఎస్‌ అధికారి (వీఆర్‌ఎస్‌) శివ భాగ్యారావు

విసిగి వేసారి పోలీసులకు ఫిర్యాదు..

కొన్నాళ్ల తర్వాత నుంచి వడ్డీ చెల్లింపులు ఆలస్యం చేయడం, అరకొరగా చెల్లించడం, సొసైటీ కార్యకలాపాలు సన్నగిల్లడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మెచ్యూరిటీ అయిన డిపాజిట్ల సొమ్మును తిరిగి ఇవ్వలేదు. పైగా డిపాజిటర్లను మభ్యపెట్టి ఆ మొత్తాన్ని తిరిగి రెన్యూవల్‌ చేయించే వారు. గత ఏడాది మే నెల నుంచి చెల్లింపులు దాదాపు నిలిచిపోయాయి. దీంతో అనుమానం వచ్చిన డిపాజిటర్లు తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ బాధిత డిపాజిటర్లు తాము మోసపోయామని గ్రహించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం రిటైర్డ్‌ ఉద్యోగి (డిపాజిటర్‌) ఎన్‌.బాల భాస్కరరావు, మరికొందరు బాధితులు దువ్వాడ, ద్వారకానగర్‌ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సొంత ఆస్తులను కూడబెట్టుకున్నారని, డైరెక్టర్లు, సిబ్బందితో కుమ్మక్కై శివ భాగ్యారావు తమను నిండా ముంచేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘శివ భాగ్యారావు మాటలను నమ్మి నా రిటైర్మెంట్‌ తర్వాత వచ్చిన సొమ్మును స్నేహ సొసైటీలో డిపాజిట్టు చేశాను. దళితులను ఉద్ధరిస్తారన్న నమ్మకంతో నాలాగే ఎంతో మంది దళితులు స్నేహలో డిపాజిట్లు చేసి మోసపోయారు’ అని స్నేహ సొసైటీ పరిరక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి అప్పారావు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు. శివ భాగ్యారావు వలలో చిక్కిన బాధితుల్లో 98 శాతం మంది దళితులే కాగా మిగిలిన వారిలో ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారే.

నిజమేనని నిగ్గు తేల్చిన పోలీసులు..

బాధిత డిపాజిటర్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసు అధికారులు స్నేహ సొసైటీ వ్యవస్థాపకుడు శివ భాగ్యారావు వ్యవహారాలపై విచారణ జరిపారు. డిపాజిటర్లకు చెల్లింపులు జరపడం లేదని, ఫిర్యాదులో అంశాలు వాస్తవమేనని నిర్ధారణకు వచ్చారు. అనంతరం సంస్థ ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు, డైరెక్టర్లు గూడూరు సీతామహలక్ష్మి, ఉండవల్లి శ్రీనివాసరావు, ఎల్‌.విశ్వేశ్వరరావు, మేనేజర్‌ రంగారావు, అకౌంటెంట్‌ ధనలక్ష్మిలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరికి కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం వీరు జైలులో ఉన్నారు. మరో 12 మందిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, సొసైటీ చైర్మన్‌ అయిన కటికల శివ భాగ్యారావు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఇతర డైరెక్టర్లు, ఉద్యోగులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సొసైటీ వ్యవహారంలో మోసగించిందీ దళితుడే. మోసపోయిన వారిలో 98 శాతం మంది దళితులే కావడం విశేషం!

Read More
Next Story