చట్టం వినిపించే సంగీతం ఎప్పుడైనా విన్నారా?
x

చట్టం వినిపించే సంగీతం ఎప్పుడైనా విన్నారా?

సంగీతంలో ఎన్నో స్వరాలు ఉంటాయి. చట్ట నిర్మాణంలో కూడా ఎన్నో కోణాలు ఉన్నాయి. అయితే చట్టం ఎలా సంగీతాన్ని వినిపించ గలదనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న?


చట్టం సంగీతంలా వినిపించడం అనేది ఒక రూపకం (Metaphor). ఈ చట్టాన్ని సంగీతంలా వినిపించేలా మా ప్రభుత్వం చేస్తుందంటున్నారు విద్యాశాఖ మంత్రి నారాలోకేష్. ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే.. కాదు రెడ్ బుక్ తన పని తాను చేస్తూ పోతోందని ఒక ఇంటర్వ్యూలో లోకేష్ స్పష్టం చేశారు. ఇదేమిటబ్బా ఇందులోనూ ఇన్ని కోణాలు ఉన్నాయా? అంటే అవును స్టాన్ ఫర్ట్ యూనివర్సిటీలో చదువుకున్న నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు 23 కేసులు గత ప్రభుత్వం నమోదు చేసింది. ఈ మాత్రం కూడా తెలుసుకోవడానికి స్టాన్ ఫర్ట్ చదువు ఉపయోగ పడదా అనేది లోకేష్ మనసులో మాట. అంటే ఆశ్చర్యమే. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వాలకు భిన్నంగా ‘రెడ్ బుక్’ ఆదేశాలను కూడా అమలు చేస్తోంది. అందులో భాగంగానే చట్టం సంగీతం వినిపించే వరకు వచ్చింది. తప్పు చేసిన వాళ్లు చట్టం వినిపించే సంగీతాన్ని వినాల్సిందేనని లోకేష్ చెప్పటం విశేషం.

చట్టం సంగీతాన్ని ఎలా వినిపిస్తుందంటే...

సంగీతానికి స్వరాలు, లయ, శృతి వంటి నియమాలు ఉన్నట్లే, చట్టానికి కూడా నియమాలు, నిబంధనలు ఉంటాయి. సంగీతంలో ఒక నిర్దిష్ట నిర్మాణం ఉన్నట్లే, చట్టంలో కూడా ఒక నిర్దిష్ట నిర్మాణం ఉంది. సంగీతంలో వివిధ స్వరాలు కలిసి శ్రావ్యమైన హార్మొనీని సృష్టిస్తాయి. అదేవిధంగా, చట్టం సమాజంలో సామరస్యాన్ని, శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంది. చట్టం అనేది సమాజంలో అందరూ కలిసి జీవించడానికి ఒక విధమైన సంగీతంలా పనిచేస్తుంది.

సంగీతానికి లయ, తాళం ఎంత ముఖ్యమో, చట్టానికి కూడా సమయం అంతే ముఖ్యం. న్యాయ ప్రక్రియలో సమయానికి విలువ ఉంటుంది. చట్టం తనను తాను లయబద్దంగా అమలుచేస్తుంది. సంగీతంలో వివిధ రకాల శైలులు ఉన్నట్లే, చట్టంలో కూడా వివిధ రకాల చట్టాలు ఉంటాయి. చట్టం అనేది ఒక్కో సందర్భానికి ఒక్కో రాగంలా మారుతూ ఉంటుంది.

సంగీతం వినడానికి ఎంత శ్రావ్యంగా ఉంటుందో, న్యాయం కూడా అంతే శ్రావ్యంగా ఉండాలి. న్యాయం అందరికీ ఒకేలా అందించినప్పుడే అది శ్రావ్యంగా ఉంటుంది. ఈ విధంగా చట్టం సంగీతంలా వినిపిస్తుందని చెప్పొచ్చు.

కొనసాగుతున్న కేసుల పరంపర

ఏపీలో కేసుల పరంపర కొనసాగుతోంది. మాటలు, రాతలతో చంపేసే వారు ఉన్నారని, అటువంటి వారిని కట్టడి చేయాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఎన్నికల సమయంలో తెలుగుదేశం దాని మిత్ర పక్ష పార్టీలను వేధించిన కొందరు వ్యక్తులు, వ్యవస్థలను టార్గెట్ చేసిన నేటి ప్రభుత్వం అటువంటి వారిని వేరి కేసులు నమోదు చేస్తోంది. వారిని జైలుకు పంపించే కార్యక్రమం ఒక ఉద్యమంలా కొనసాగిస్తోంది.

ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులు, తెలుగుదేశం నాయకులను అక్రమంగా ఇరికించిన కేసులను తిరగదోడింది. ఇందులో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు చట్టపరమైన నిబంధనలను ఫాలో అవుతోంది.

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వారు మొదటి టార్గెట్

సోషల్ మీడియా ద్వారా ఎదిటి వారిని ద్వేశించడం, అవమానించడం, కించ పరచడం వంటి పోస్టులు పెట్టిన వారిని మొదటిగా ప్రభుత్వం టార్గెట్ చేసింది. పార్టీల సోషల్ మీడియా పోస్టుల ద్వారా మానశికంగా బాధ పడ్డవారు, తమ నాయకులను అవమానించారంటూ ఆందోళనకు గురైన వారు ఇచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటున్న ప్రభుత్వం ప్రస్తుతం చర్యలకు పూనుకుంది. ఫిర్యాదులను స్వీకరించి కేసులు నమోదు చేసి నిందితులను పట్టుకునే పనిలో చట్టం ఉంది.

రెండో టార్గెట్ గా మీడియా ప్రెస్ మీట్లలో మాటల తూటాలు పేల్చిన వారు

వైఎస్సార్సీపీలో నాయకులుగా, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసులు బాధితులుగా బాధపడుతున్న వారు ఇవ్వటం లేదు. బాధితుల తరపున వారి అభిమానులు కేసులు పెడుతున్నారు. వాటిని పరిగణలోకి తీసుకుంటున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను వేటాడే పనిలో ఉన్నారు.

ఇప్పటి వరకు ఎవరెవరు..

ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో పనిచేసిన వందల మందిపై కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియా ఇన్చార్జ్ పనిచేసిన భార్గవ్ రెడ్డి రెడ్డి టార్గెట్ గా కేసులు నమోదు కాగా కొంత మంది బెయిల్ పై విడుదలయ్యారు. మరికొందరు జైలులో ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ జైలులో ఉన్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ ను వంశీ కిడ్నాప్ చేశారనే నేరంపై ఆయనకు రిమాండ్ పడింది. ఆయన అనుచరులపైనా కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్, దాడి కేసులో సుమారు 100 మంది పైన నిందితులు కేసులో ఉన్నారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై కేసు నమోదైంది. ఆయన బెయిల్ పై ఉన్నారు. మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) పై కూడా కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వ్యూహం పన్నుతున్నారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు నేరాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ, అటవీ భూములు ఆక్రమించారనే నేరారోపణలపై విచారణలు కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంపెనీలకు ప్రభుత్వ భూములు లాక్కున్నారనే నేరారోపణలపై విచారణలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి విడదల రజనీపై కేసులు నమోదయ్యాయి. ఆమెకు గతంలో షోషల్ మీడియా ఇన్చార్జ్ గా పనిచేసిన దొడ్డా రాకేష్ గాంధీ ని చిలకలూరిపేట అర్బర్ పోలీసులు శనివరం అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి జోగి రమేశ్ నాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంపై దాడి చేశారనే కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ పై నమోదైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ చేశారు. ఇష్టానుసారం మాట్లాడిన బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇటీవలే ఆయనకు బెయిల్ వచ్చింది. వైఎస్సార్సీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళిపై 17 కేసులు నమోదయ్యాయి. తొందరపడి అరెస్ట్ లు చేయద్దని కోర్టు చెప్పినా పీటీ వారంటుపై పలు కేసుల్లో అరెస్ట్ లు జరుగుతూనే ఉన్నాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదై విచారణలో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ ప్రకంపనలు

‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అనే పదం ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. పాలకపక్షం తమ రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి, వారిపై కక్ష సాధించడానికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి, బెదిరింపులకు, అక్రమ కేసులకు, భయ భ్రాంతులకు గురిచేయడానికి రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగిస్తున్నారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదం మీడియాపై ఆంక్షలు, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి, ప్రతిపక్ష నాయకులపై దాడులు వంటి వివాదాలతో ముడిపడి ఉంది. కొందరు రాజకీయ నాయకులు వారి యొక్క రాజకీయ ప్రత్యర్థుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటానికి ఈ రెడ్ బుక్ ను వాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, సీఎం ప్రోద్బలంతోనే దాడులు జరుగుతున్నాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు.

Read More
Next Story