
విందు భేటీలు పెట్టుకోండి
జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలుస్తూ ఉండండి. మళ్లీ మనమే అధికారంలోకి రావాలనే సృహతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఉద్బోదించారు.
ఏదైనా ఒక అంశాన్ని ప్రచారం చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మించిన రాజకీయ నాయకుడు లేరు. మార్కెటింగ్ చేసుకోవడంలో తనకు తానే సాటి. 2014–19లో అధికారంలో ఉన్నప్పుడు తనకు మించిన మార్కెటింగ్ మేనేజర్ లేడని ఓ కార్యక్రమంలో స్వయంగా ఆయనకు ఆయనే ప్రకటించుకున్నారు. రూపాయి ఖర్చు పెట్టి వంద రూపాయలతో దానిని మార్కెటింగ్ చేసుకుంటారనే టాక్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే వినిపించింది. బడ్జెట్‌ను ప్రజల్లో తీసుకెళ్లాలనే కాన్‌సెప్ట్‌ను తన పార్టీ కేడర్‌కు దిశా నిర్థేశం చేయడంతో చంద్రబాబు మంచి మార్కెటింగ్ మేనేజర్ అనే చర్చ తాజాగా తెపైకొచ్చింది.
కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఓ నిర్ణయానికి వచ్చాయి. తొలుత ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దలు ఎన్డీఏ పక్ష నేతలకు, ఎంపీలకు ఆ మేరకు దిశానిర్థేశం చేశారు. కేంద్ర బడ్జెట్‌ను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు మంత్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. ప్రజల్లోకి కేంద్ర బడ్జెట్‌ను ఎలా తీసుకెళ్లాలో వారికి దిశానిర్థేశం చేసింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కేంద్ర బడ్జెట్‌ను ప్రజల్లో ప్రచారం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయంపై ఈ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్న ప్రచార విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ప్రజల్లో చర్చలు పెట్టాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆ బాధ్యతలు తీసుకోవాలి. బడ్జెట్‌పైన ప్రజలు ఏమనుకుంటున్నారో కనుక్కోవాలి. అలాగే అన్న క్యాంటీన్‌లకు వెళ్లి అక్కడ కూడా బడ్జెట్ మీద మాట్లాడుతూ.. అక్కడకు వచ్చిన వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నడు లేని విధంగా బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, చర్చలు పెట్టాలి, ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని చెప్పి మరో సారి తన మార్కెటింగ్ మార్కును చూపించుకున్నారనే టాక్ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.
నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. నామినేటెడ్ పదవుల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ప్రతిపాదనలు పంపాలని సూచించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మీరు వివరాలు ఇవ్వకుండా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలంటే ఎలా కుదురుతుందని మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సహజంగా నామినేటెడ్ పోస్టులు కానీ, ఏ ఇతర పోస్టులైనా నియామకాలు చేపట్టేది చంద్రబాబే. ఆయన ఎవరికి పదవి ఇవ్వాలనుకుంటారో వారికే ఆ పదవి దక్కుతుంది. ఎవరి ఏ రెకమెండేషన్‌లు చేసినా వాటిని పట్టించుకోరు అనేది టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాట. అయితే తాజాగా లోకేష్ తెరపైకి రావడం, ఆయన కనుసన్నుల్లోనే అన్నీ జరుగుతుండటంతో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల్లో అసంతృలు వినిపిస్తున్నాయి. లోకేష్‌కు తెలియకుండా చిన్న పని కూడా జరగదనేది టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సూచించిన వారికి నామినేటెడ్ పదవులు ఎలా ఇస్తారని, పార్టీ కేడర్ దెబ్బతినకుండా చేయడానికి చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలు అనేక చేస్తుంటారనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది.
ఇదే సందర్భంలో పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని కష్ట కాలంలో వెన్నంటే ఉన్నారని, కేడర్‌ను కాపాడుకోవడం మన బాధ్యత అంటూ మాట్లాడుతూ.. నేతలు ఎలా ఉంటే కేడర్ ఎంత బలంగా ఉంటుందో అనే అంశాలను వివరించారు. గ్రామ స్థాయి నుంచి నియోజక వర్గం స్థాయి వరకు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలి. ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లాలి. ఇన్‌చార్జి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు సమన్వయంతో పని చేయాలి. ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో తరచుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం అవుతూ ఉండాలని అనేక సూచనలు చేశారు. ఇలాంటి సమావేశాలకు వీలైతే విందు భేటీలు ఏర్పాటు చేసుకోండి. అలా అయినా అందరూ కలిసేందుకు వీలుంటుంది. సమావేశం అయినట్లు ఉంటుంది అంటూ దిశానిర్థేశం చేయడంతో ఒక్క సారిగా ఆశ్చర్యం వ్యక్తం అయింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబే సమావేశాల కోసం విందు భేటీలు పెట్టుకోండని చెప్పడం కొత్తగా ఉందని మాట్లాడుకోవడం విశేషం.
Next Story