ఏపీలో మళ్లీ సలహాదారుల యుగం, నలుగురు ప్రముఖుల నియామకం
x
AP Government advisers

ఏపీలో మళ్లీ సలహాదారుల యుగం, నలుగురు ప్రముఖుల నియామకం

ప్రభుత్వ సలహాదారుల ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించిన వారే ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ లో నియామకాలు చేస్తున్నారు. వీళ్లు నిజంగానే రాష్ట్రానికి ఉపయోగపడతారా?


హైప్రొఫైల్ సలహాదారుల నియామక ప్రక్రియ టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా చేపట్టింది. నలుగురు ప్రముఖులను గౌరవ సలహాదారులుగా నియమించింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ సుచిత్ర ఎల్లాను చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చెశారు. ఈ నలుగురు కేబినెట్ ర్యాంకుతో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రభుత్వం వీరి సలహాలను చేనేత, హస్తకళలు, ఏరో స్పేస్, డిఫెన్స్, ఫోరెన్సిక్ సైన్స్, స్పేస్ టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోగించుకుంటుంది. అయితే వీరి నియామకంపైనా చిటపటలు మొదలయ్యాయి. రాష్ట్రానికి సాంకేతిక సలహాదారులు ఏమి చేస్తారని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరేమో ఇవన్నీ కేంద్ర నియామకాలేనని పెదవి విరుస్తున్నారు. గత ప్రభుత్వంలో సలహాదారుల నియామకాన్ని ప్రశ్నించిన టీడీపీ కూడా అదే దారిలో నడుస్తోందనే టాక్ వినపడుతోంది.
ఈ విమర్శలను అధికార పార్టీ ప్రతినిధులు తోసిపుచ్చారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన పి.సాయినాథ్, స్వామినాథన్ లాంటి వాళ్ల నియామకాలను తాము తప్పుబట్టలేదని, అడ్డగోలుగా ఎవర్ని పడితే వాళ్లను నియమించినపుడు ప్రశ్నించామని చెబుతున్నారు.
యువత స్కిల్ డెవలప్మెంట్ కు సతీష్ రెడ్డి...
ఏరో స్పేస్, డిఫెన్స్ తయారీ హబ్ గౌరవ సలహాదారుగా నియమితులైన జి.సతీష్‌రెడ్డి రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు, టెస్టింగ్ ఫెసిలిటీల్లో పరిశ్రమల ఏర్పాటుకు సతీష్ రెడ్డి సలహాలు ఇస్తారు. AI, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డీప్‌టెక్‌లో కూడా ప్రభుత్వానికి సూచనలు అందించనున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఏపీ ప్రభుత్వానికి సతీష్ రెడ్డి సలహాలు ఇవ్వనున్నారు. ఆయనకు కూడా ఏపీ ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ కేటాయించింది.
ఏరోస్పేస్, డిఫెన్స్‌ పరిశోధన, తయారీ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయడానికి మార్గదర్శకత్వం వహిస్తారు. అభివృద్ధి చెందుతున్న రక్షణ, సాంకేతికతలకు అనుగుణంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటుకు తోడ్పడతారు. డీప్‌టెక్, ఏఐ, రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి డిజిటల్‌ సాంకేతికతలను రక్షణ రంగ ఉత్పత్తుల్లో వినియోగించుకునేందుకు వీలుగా సలహాలు ఇస్తారు.
చేనేత, హస్తకళల రంగ సలహాదారు సుచిత్ర ఎల్ల
సుచిత్ర ఎల్ల భారత్‌ బయోటెక్‌ సంస్థ సహ వ్యవస్థాపకురాలు. భారత్‌ బయోటెక్‌తోపాటు, ఎల్ల ఫౌండేషన్‌కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారికి వ్యాక్సిన్‌ను అందించడంతో పాటు, బయోటెక్నాలజీ రంగంలో చేసిన విశేష కృషికిగాను 2022లో భర్త డాక్టర్‌ కృష్ణ ఎల్లతో సంయుక్తంగా పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగానూ సేవలందిస్తున్నారు. పారిశ్రామిక, సామాజిక సేవా రంగాల్లో ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా సౌండ్‌ ఇండియా బిజినెస్‌ అచీవర్స్‌ అవార్డ్, సార్క్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అవార్డ్‌ వంటి అనేక పురస్కారాలు వరించాయి.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఆమె వ్యవహరిస్తారు. చేనేత, హస్తకళల రంగాల సుస్థిరత, బలోపేతం, అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇస్తారు. మార్కెట్‌ అవకాశాలను పెంచడం, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా కళాకారులు, సహకార సంస్థలు, ఎంఎస్‌ఎంఈలకు మద్దతిస్తారు. మహిళా కళాకారులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అవసరమైన కార్యక్రమాలను రూపొందిస్తారు.
కీలక సలహాదారుగా ఫోరెన్సిక్‌ నిపుణుడు కేపీసీ గాంధీ
డాక్టర్‌ కేపీసీ గాంధీ ప్రముఖ ఫోరెన్సిక్‌ సైన్స్‌ శాస్త్రవేత్త. గతంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాల ఫోరెన్సిక్‌ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1970లో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో చేరారు. సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌)లో పనిచేసి ఫోరెన్సిక్‌ దర్యాప్తులో నైపుణ్యం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేసి అక్కడే పదవీ విరమణ చేశారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌కు సంబంధించి సొంతంగా ట్రూత్‌ ల్యాబ్స్‌ను స్థాపించారు. ప్రస్తుతం దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా రాష్ట్రంలో ఫోరెన్సిక్‌ మౌలిక వసతులు, మానవ వనరులను మెరుగుపరిచేందుకు, నిధులు ఎలా రాబట్టాలనేదానిపై సలహాలిస్తారు. నేరస్తుల ప్రొఫైలింగ్, అనుమానితుల గుర్తింపునకు వీలుగా ఫోరెన్సిక్‌ డేటా ఇంటిగ్రేషన్‌కు సహకరిస్తారు. ఫోరెన్సిక్‌ ప్రయోగశాల స్థాపన, వాటి ఆధునికీకరణపై దిశా నిర్దేశం చేస్తారు.
ఇస్రో మాజీ ఛైర్మన్‌ సోమనాథ్‌కు కీలక బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్పేస్‌ టెక్నాలజీ (అంతరిక్ష సాంకేతికత) రంగ గౌరవ సలహాదారుగా నియమితులైన శ్రీధర్‌ ఫణిక్కర్‌ సోమనాథ్‌కు ఈ రంగంలో 40 ఏళ్ల విశేష అనుభవముంది. 2022 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఇస్రో ఛైర్మన్‌గా పనిచేశారు. అంతకు ముందు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌కు కార్యదర్శిగా పనిచేశారు. స్పేస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఆయన పరిపాలన, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో స్పేస్‌ టెక్నాలజీ వినియోగానికి అవసరమైన విధానాల రూపకల్పనకు సాయపడతారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, అర్బన్‌ ప్లానింగ్, వాతావరణ మార్పులు, స్మార్ట్‌ సిటీలు, విపత్తు నిర్వహణ తదితర అంశాల్లో స్పేస్‌ టెక్నాలజీని ఉపయోగించుకోవటానికి అవసరమైన సూచనలు ఇస్తారు.
"ఈ నలుగుర్ని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు నియమించినట్టు అర్థమవుతోంది. వీరిలో ఎక్కువ మందికి బీజేపీతో, ఆర్ఎస్ఎస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనని, కేంద్రంలో సర్దుబాటు కాక ఆంధ్రప్రదేశ్ లో పోస్టింగులు ఇచ్చినట్టు"గా ఉందని ఓ మాజీ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. డాక్టర్ సతీష్ రెడ్డి ప్రధానమంత్రి సాంకేతిక సలహాదారు పదవికి ప్రయత్నించినట్టు సమాచారం. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ సమయంలో సుచిత్ర ఎల్లా కూడా చాలా ఆరోపణలను ఎదుర్కొన్నారు.
Read More
Next Story