కేటీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైందా ?
x

కేటీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైందా ?

మొత్తం అవినీతికి అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ దే కీలకపాత్రగా ఏసీబీ అనుమానిస్తోంది.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైందా ? ఇపుడీ విషయమే తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఈరోజో, రేపే విచారణ నిమ్మితం కేటీఆర్ కు నోటీసులు జారీ అవబోతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రు. 55 కోట్ల అవినీతిలో కేటీఆర్ పాత్ర కీలకమన్నా ఆధారాల కారణంగానే కేటీఆర్(KTR) ను విచారించేందుకు ఏసీబీ(ACB) ఉన్నతాధికారులు నోటీసులు జారీచేసేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావటమే ఆలస్యం వెంటనే నోటీసు జారీతో రంగంలోకి దిగటానికి ఏసీబీ ఉన్నతాధికారులు రెడీగా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ ఫార్ములా కార్ రేసు(Formula E Car Race) నిర్వహణ వ్యవహారంలోనే పెద్దఎత్తున ప్రభుత్వ నిధుల్లో అవినీతి జరిగిందని ఇప్పటికే ఏసీబీ తన విచారణలో నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ మొత్తం అవినీతికి అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ దే కీలకపాత్రగా ఏసీబీ అనుమానిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాదులోని హుస్సేన్ సాగర్(Hussain Sagar) చుట్టూ ఉన్న 3 కిలోమీటర్ల రోడ్డులో పార్ములా కారు రేసు నిర్వహణకు బీఆర్ఎస్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. డిసైడ్ చేయటమే ఆలస్యం ఆ బాధ్యతలను హెచ్ఎండీఏకి అప్పగించారు కేటీఆర్. కారు రేసు నిర్వహణ కోసం గ్రీన్ కో అనే కంపెనీతో మున్సిపల్ శాఖ ఒప్పందం కూడా చేసుకుంది. ఒప్పందాలన్నీ మున్సిపల్ శాఖ చేసుకున్నా రేసుకు అవసరమైన ఖర్చులంతా గ్రీన్ కో కంపెనీయే పెట్టేట్లుగా ఒప్పందంలో ఉంది. అయితే అందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు మాత్రం హెచ్ఎండీఏ చూడాలి. పనులు మొదలైన తర్వాత జరిగిన ఒప్పందానికి భిన్నంగా హెచ్ఎండీఏ(HMDA) గ్రీన్ కో కంపెనీని తప్పించింది. గ్రీన్ కో కంపెనీ స్ధానంలో అన్నీ తానే అయి వ్యవహారాలు నడిపింది. తూతూమంత్రంగా గ్రీన్ కో కంపెనీ స్ధానంలో మరో కంపెనీని తీసుకొచ్చిన హెచ్ఎండీఏ సదరు కంపెనీకి రు. 55 కోట్లను విడుదలచేసింది. ఇన్ని కోట్లు విడుదల చేసేటపుడు ఆర్ధికశాఖ అనుమతులు తీసుకోలేదు.

ఫార్ములా రేసుకు ఇన్ని ఏర్పాట్లుచేసిన హెచ్ఎండీఏ రేసు నిర్వహణ తేదీ సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో పనులన్నీ ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ఓడిపోవటం, కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నపుడే కాంగ్రెస్ నేతలు ఫార్ములా రేసు నిర్వహణలో అవినీతి జరిగిందనే ఆరోపణలు చేసున్నారు. అందుకనే అధికారంలోకి రాగానే ముందు ఫార్ములా కారు రేసు అవినీతిపై విచారణ చేయమని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి(Chief Secretary SantiKumari)ని ఆదేశించింది ప్రభుత్వం. రంగంలోకి దిగిన చీఫ్ సెక్రటరీ అప్పటి మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ డైరెక్టర్ అర్వింద్ కుమార్ ను విచారించారు. విచారణలో ఫార్ములా కారు రేసు నిర్వహణలో జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలిసింది, నిధుల బదాలాయింపు విషయాన్ని ప్రస్తావిస్తు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్ ఆదేశాల ప్రకారమే తాను రు. 55 కోట్లు బదిలీ చేసినట్లు రాతమూలకంగా చీఫ్ సెక్రటరీకి చెప్పారని సమాచారం.

అర్వింద్ కుమార్ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగానే ప్రభుత్వం ఇపుడు పావులు కదుపుతోంది. జరిగిన అవినీతిపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. విచారణలో భాగంగానే ఏసీబీ అర్వింద్ కుమార్ కు నోటీసులు జారీచేసి విచారణకు హాజరవ్వాలని కోరారు. అర్వింద్ విచారణలో చెప్పే విషయాల ఆధారంగానే కేటీఆర్ ను కూడా విచారించి తర్వాత కేసు నమోదు చేయబోతున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. కేటీఆర్ ను విచారించటం, కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకునే విషయంలో ఎలాంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం న్యాయపరమైన విషయాలను సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి(Revanth Reddy) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma)ను కలిసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకపోయినా గవర్నర్ ను సడెన్ గా రేవంత్ బుధవారం రాత్రి కలవటంతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

జరిగిన అవినీతి గురించి గవర్నర్ కు రేవంత్ వివరించి కేటీఆర్ అరెస్టుకు అనుమతులు కోరినట్లుగా ప్రభుత్వంలో బాగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా సర్కులేట్ అవుతోంది. కేటీఆర్ మీద కేసు నమోదు చేయటం, అవసరమైతే అరెస్టు చేయటానికి గవర్నర్ అనుమతి అవసరంలేదు. అయినా సరే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే గవర్నర్ కు రేవంత్ సమాచారం ఇచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి. బహుశా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) తొందరలోనే పెద్ద బాంబు పేలుతుందని చెబుతున్నది.

Read More
Next Story