KTR/కేటీఆర్ అసలు విషయం మరచిపోయారా ?
x

KTR/కేటీఆర్ అసలు విషయం మరచిపోయారా ?

రెండు రాష్ట్రాల ఎన్నికల్లో జనాలు జాతీయ పార్టీలు కాంగ్రెస్(Congress), బీజేపీల(BJP)ను తిరస్కరించినట్లు కేటీఆర్(KTR) చెప్పటమే విచిత్రంగా ఉంది.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందన చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే పునాదలని గట్టిగా చెప్పారు. దేశభవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే పునాదులని మహారాష్ట్ర(Maharashtra), జార్ఖండ్(Jarkhand) ఎన్నికలతో తేలిపోయిందన్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికల్లో జనాలు జాతీయ పార్టీలు కాంగ్రెస్(Congress), బీజేపీల(BJP)ను తిరస్కరించినట్లు కేటీఆర్(KTR) చెప్పటమే విచిత్రంగా ఉంది. రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో కూటమికి నాయకత్వం వహించిన విషయం అందరికీ తెలిసిందే. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్), శివసేన(ఉద్థవ్) కూటమికి పెద్ద దెబ్బతగిలింది. ఇదే సమయంలో బీజేపీ నాయకత్వంలో పోటీచేసిన శివసేన(షిండే, ఎన్సీపీ అజిత్)కూటమి బ్రహ్మాండమైన విజయం సాదించిన విషయాన్ని కేటీఆర్ మరచిపోయినట్లున్నారు.

మహాయుతి కూటమిలో కూడా శివసేన, ఎన్సీపీ కన్నా బీజేపీకి గెలుచుకున్న సీట్లు చాలా ఎక్కువ. బీజేపీ కూటమినే జనాలు గెలిపించినపుడు ఇక బీజేపీని జనాలు తిరస్కరించింది ఎక్కడ ? అలాగే జార్ఖండ్ లో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమే విజయం సాధించింది. సాదించిన విజయంలో కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు తక్కువే అయ్యుండచ్చు. కాని గెలిచింది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమే కదా. రెండు రాష్ట్రాల్లోను, రెండు కూటముల్లోను ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించాయనటంలో సందేహంలేదు. అంతమాత్రాన దేశ భవిష్యత్తుకు ప్రాంతీయపార్టీలే పునాదులని, జాతీయపార్టీలు కాంగ్రెస్, బీజేపీలను జనాలు తిరస్కరించారని కేటీఆర్ చెప్పటమే చాలా విచిత్రంగా ఉంది.

బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలబడలేని పరిస్ధితుల్లో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు చాలా సహజమన్న విషయం కేటీఆర్ కు తెలీందేమీ కాదు. రెండుఎన్నికల్లో పదేళ్ళపాటు తెలంగాణాను ఎదురులేకుండా ఏలిన బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్ధితి ఏమిటో అందరు చూస్తున్నదే. అయినా అన్నింటికన్నా విచిత్రం ఏమిటంటే బీఆర్ఎస్ కూడా జాతీయపార్టీయే అన్న విషయం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరచిపోవటం. తాను జాతీయపార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి కూడా ప్రాంతీయపార్టీలే దేశ భవిష్యత్తుకు పునాదులని చెప్పటం అంటే బీఆర్ఎస్ వల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని అంగీకరించటమేనా ?

ప్రాంతీయపార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పేయాలన్న ఆశతోనే కదా జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మార్చింది. 2022, అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతున్నట్లు పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రకటించిన విషయం కేటీఆర్ మరచిపోయారా ? తమ పార్టీని జాతీయపార్టీగా గుర్తించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ను కలిసి అందుకు అవసరమైన అన్నీ డాక్యుమెంట్లను సమర్సపించిన విషయాన్ని బహుశా కేటీఆర్ మరచిపోయారేమో. 2023 ఎన్నికల్లో ఓడిపోవటంతో జాతీయ రాజకీయాలకు కాదు చివరకు తెలంగాణా రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా లేకుండా ఫామ్ హౌసుకు మాత్రమే కేసీఆర్(KCR) పరిమితమైపోయిన విషయం అందరు చూస్తున్నదే. ఈ నేపధ్యంలోనే తమది జాతీయపార్టీ అన్న విషయాన్ని మరచిపోయిన కేటీఆర్ ప్రాంతీయపార్టీలదే భవిష్యత్తని, దేశ భవిష్యత్తుకు పునాదులని ఏమిటేమిటో మాట్లాడేస్తున్నారు.

Read More
Next Story