జగన్ సలహాదారుల నోళ్లకు ఈసీ కళ్లెం వేసిందా?
x

జగన్ సలహాదారుల నోళ్లకు ఈసీ కళ్లెం వేసిందా?

జగన్ సలహాదారుల నోళ్లకు ఈసీ కళ్లెం వేసిందని టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సలహాదారులంతా దొడ్డి దారి నుంచి వచ్చారని ఆరోపించారు.


ఆంధ్రలో ప్రభుత్వ సలహాదారుల విషయంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఈ అంశంపై టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 60 మంది సలహాదారులు ఉన్నా ప్రజలకు ప్రయోజనం చేకూరింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయం ఈ సలహాదారుల నోర్లను కట్టడి చేస్తుందని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు.. ‘‘అసలు ఈ సలరహాదారులు ఎవరు? వీరు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్లు ఎలా అపాయింట్ అయ్యారు?’’ అంటూ ప్రశ్నలు గుప్పించారు.

‘‘వైసీపీ హయంలో మంత్రులు నామ్‌కే వాస్తీ ఉన్నారు. ఈ సలహాదారులనే చక్రం తిప్పారు. ప్రభుత్వాన్ని తెరవెనుక నుంచి నడిపించారు. ఇలాంటి వీళ్ల నోళ్లను ఎన్నికల సంఘం ఎందుకు కట్టడి చేసింది? ప్రజల డబ్బును ఐదేళ్ల నుంచి దిగమింతుతున్న వారు ప్రజలకు తెలుసా? వారిని కూడా వైసీపీ నాయకులగానే ప్రజలు భావిస్తున్నారు.జగన్ పాలన అంతా ఈ జంబో సలహాదారులే నడిపించారు. మంత్రులు ఉన్నారంటే పేరుకి ఉన్నారు అంతే.. ప్రస్తుతం రాష్ట్రంలో 40 మంది సలహాదారులు ఉన్నారు. 2019లో జగన్ ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల గ్యాప్‌లోనే 37 మంది ప్రభుత్వ సలహాదారులు నియమితులయ్యారు. రాజ్యాంగంతో సంబంధం లేకుండా దొడ్డి దారిలో ప్రభుత్వంలోకి ప్రవేశించిన వీరు ఐదేళ్లలో ఏం చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి జీవోకు తాళం వేయడంతో ఎంతమంది ఉన్నారో స్పష్టత లేదు’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘వైసీపీ తన హాయాంలో 69 మందికి దొడ్డి దారిలో ప్రభుత్వంలో స్థానం కల్పించి హంగామా చేసి ప్రజా ధనాన్ని వారికి దోచి పెట్టింది. 1980లో అంజయ్య హయాంలో 64 మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు సలహాదారులను చూస్తుంటే అదే గుర్తుకొస్తుంది. క్యాబినెట్ కన్నా ముందే సలహాదారుల నియామకాలు జరుగుతున్నాయి. క్యాబెనెట్ కన్నా ఎక్కువ ప్రాధాన్యత కూడా వీరికే లభిస్తుంది. 2019 నుంచి ప్రభుత్వాన్ని కూడా ఈ సలహాదారులే నడిపించారు. వీళ్లంతా వైసీపీ ప్రైవేట్ టీమ్. వారందరి బ్యాగ్రౌండ్ కూడా సాక్షిలో పనిచేయడమే. 2019లో ప్రమాణ స్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే ఆరుగురు సలహాదారులను నియమించిన జగన్.. ఆ తర్వాత మరికొన్ని రోజులకు మరో ఇద్దరు సలహాదారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో మొదటి వ్యక్తి సజ్జల కాగా రెండోది కృష్ణమోహన్’’అని వివరించారు.

అసలు సలహాదారుల పనేంటి..

‘‘జగన్ ప్రభుత్వంలో ఉన్న వారంతా కూడా ఒక ప్రభుత్వ సలహాదారుగా అధికారంగా చేసేదేమీ లేదు. అంతా అనధికారమే.. ఒక్క జీవోతో వీరికి దాదాపు క్యాబినెట్ మంత్రులతో సమానమైన హోదాను కల్పించి వారిలో ఒక్కొక్కరికి నెలకు రూ.30 లక్షల ఖర్చు పెట్టారు. వీళ్లకు తెలిసిందేమీ లేదు. ఇంత మందిని సలహాదారులుగా నియమించుకోవచ్చని ప్రపంచంలోని ఏ ముఖ్యమంత్రికీ తెలియదు. మన జగన్‌కు తప్ప. వీరు చేసే పని ఒక్కటే ప్రభుత్వ సొమ్మును దిగమింగడం. జగన్ తొత్తులంతా సలహాదారులైపోయారు. జగన్ పాద సేవ చేయడమే వీరి పని’’అని మండిపడ్డారు.

సలహాదారుల అర్హతలు?

జగన్ ప్రభుత్వంలో సలహాదారు కావాలంటే అభ్యర్థికి కొన్ని ప్రత్యేక అర్హతలు ఉండాలని నీలాయపాలెం విజయ్ కుమార్ చురకలంటించారు. ‘‘అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే 37 మంది సలహాదారులు నియమితులయ్యారు. వారి అర్హతలు ఏంటో తెలుసా.. ఒకటి సాక్షిలో పనిచేయడం. వీరంతా వైసీపీ చేత, వైసీపీ కోసం పనిచేసేవాళ్లే. వీరి కాక మిగిలిన వారంతా జగన్ చుట్టాలుపక్కాలే. టీడీపీ హయాంలో చంద్రబాబుకు యాంటీగా పనిచేసిన ఐఏఎస్‌లను జగన్ తన ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్నారు. చేసిన అప్పులను తీర్చుకోవడం కోసం రిటైర్డ్ బ్యాంక్ అధికారులను కూడా సలహాదారులుగా నియమించేసుకున్నారు. సలహాదారుల నియామకంలో సాక్షిలో పనిచేసిన వారికి పెద్దపీట వేశారు. ఆ తర్వాత సామాజిక వర్గానికి.. ప్రభుత్వ సలహాదారుల్లో 23 మంది రెడ్లే. టీడీపీని తిట్టే వారే’’అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచే జగన్ అక్రమాలు, అవినీతి మొదలు పెట్టేశారంటూ ధ్వజమెత్తారు.

ఈసీ ఇచ్చిన ఆదేశాలు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి రాష్ట్ర మంత్రికి వర్తిస్తున్నప్పుడు ప్రభుత్వ సలహాదారుకు ఎలా మినహాయింపు ఉంటుందని ప్రశ్నించింది. ఆంధ్రలో కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితలై జీతం తీసుకుంటున్న 40 మంది సలహాదారులకు ఈ నియమావళి వర్తిస్తుందని వెల్లడిస్తూ ఆదేశాలిచ్చింది. వారి ప్రవర్తనపై తమకు అనేక ఫిర్యాదులు వస్తుండటంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఈసీ వివరించింది.

వారు తమ పరిధిని దాటి రాజీయ ప్రచారంలో పాల్గొంటున్నారని, ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారని గుర్తించామని, వారికీ కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని, వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. వాళ్లు తమ పరిధిని దాటి ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని, ఇలా మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

Read More
Next Story