సీఎం చంద్రబాబుకు అధికారులపై గౌరవం లోపించిందా?
x

సీఎం చంద్రబాబుకు అధికారులపై గౌరవం లోపించిందా?

ముఖ్యమంత్రి దోరణి మీద రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరావు అసంతృప్తి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని ప్రజా వేదికపై అవమానకరంగా సంబోధించిన సంఘటనపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వ అధికారులు ప్రజా సేవకులేనని, వారిని వ్యక్తిగత బంట్రోతులుగా చూడకూడదని నాగేశ్వరావు పేర్కొన్నారు. ఈ సంఘటన రాజకీయ నాయకులు, అధికారుల మధ్య సంబంధాలపై కొత్త చర్చకు తెరలేపింది.

నాగేశ్వరరావు 1986 బ్యాచ్ ఒదిశా క్యాడర్ కు చెందిన ఇండియన్ పోలీసు సర్వీస్ అధికారి. ఆయన తెలంగాణలో వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. 2016 లో సిబిఐలో పనిచేశారు. కొంత కాలం సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ గా కూడా పనిచేశారు.



రాయవరం గ్రామ పంచాయతీలో పట్టాదార్ పాస్ బుక్స్ తీసుకున్న సుమారు 900 మంది లబ్ధిదారులు ముఖ్యమంత్రి సభకు హాజరు కాకపోవడంపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన జాయింట్ కలెక్టర్‌ను ఏకవచనంతో సంబోధించి, అవమానకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగినది కాదని, పాలకుల వ్యవహారశైలి ప్రజలపై ప్రభావం చూపుతుందని నాగేశ్వరావు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.


నాగేశ్వరావు తన ఎక్స్ పోస్ట్‌లో ముఖ్యమంత్రికి నేరుగా సందేశం ఇస్తూ, "మీకు ప్రజా జీవితంలోనూ, ప్రభుత్వ పాలనలోనూ చాలా విస్తృతమైన అనుభవం ఉందని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి, మంత్రులు ఎలా ప్రజా సేవకులో, ప్రభుత్వ అధికారులు కూడా అదే విధంగా ప్రజా సేవకులే అని మీకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులు మీ వ్యక్తిగత బంట్రోతులు కాదనీ, ప్రజా విధుల నిర్వహణలో ఏవైనా తప్పిదాలు జరిగితే వారిపై సంస్థాగత చర్యలు తీసుకోవచ్చనీ కూడా మీకు బాగా తెలిసిన విషయమే" అని వ్యాఖ్యానించారు. మరో పోస్ట్‌లో, "చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు విధులను సరిగా నిర్వర్తించని అధికారులపై సంస్థాగత కఠిన చర్యలు తీసుకోవాలి. అంతే గానీ అగౌరవంగా మాట్లాడటం తగదు" అని హితవు చెప్పారు.


ఈ విమర్శలు 'యథా రాజా తథా ప్రజా' అనే సామెతను గుర్తు చేస్తూ, పాలకుల వ్యవహారం ప్రజల ప్రవర్తనపై ప్రతిఫలిస్తుందని నాగేశ్వరావు పేర్కొన్నారు. అలాగే, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మాటలను ఉటంకిస్తూ, "మంత్రులు అధికారులను తిట్టడం అంటే తమ అసమర్థతను తామే ఒప్పుకోవడమే. అసమర్థుడైన కార్మికుడు మాత్రమే తన పనిముట్లను నిందిస్తాడు" అని పేర్కొన్నారు. ఇది రాజకీయ నాయకులకు శిరోధార్యం కావాలని ఆయన సూచించారు. నాగేశ్వరావు సీబీఐ మాజీ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవజ్ఞుడు. గతంలో కూడా పలు రాజకీయ సంఘటనలపై తన అభిప్రాయాలను ఎక్స్ ద్వారా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇంతవరకు అధికారిక స్పందన రాలేదు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు అధికారులపై వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు 2019లో తెలంగాణ మాజీ ఐఏఎస్ అధికారులు చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన సంఘటనలు ఉన్నాయి. అలాగే 2023లో చంద్రబాబు అరెస్ట్ సమయంలో నాగేశ్వరావు ఆయనపై వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇటువంటి సంఘటనలు ప్రభుత్వ యంత్రాంగంలో మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రజా పాలనలో అధికారులు, నాయకుల మధ్య సమన్వయం అవసరమని వారు పేర్కొంటున్నారు. ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరిన్ని చర్చలకు దారి తీసే అవకాశం ఉంది. ప్రజా సేవలో గౌరవం, సమర్థత రెండూ కలిసి ఉండాలని నాగేశ్వరావు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

Read More
Next Story