![Handcuff Warకాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ‘బేడీల’ యుద్ధం Handcuff Warకాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ‘బేడీల’ యుద్ధం](https://andhrapradesh.thefederal.com/h-upload/2024/12/13/498009-farmer-handcuff.webp)
Handcuff Warకాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ‘బేడీల’ యుద్ధం
లగచర్ల రైతుకు బేడీలు(Handcuff to Lagacharla Farmer) వేసి ఆసుపత్రికి తరలించిన విషయం రెండుపార్టీల మధ్య పెద్ద దుమారమే రేగుతోంది.
అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై మాటల యుద్ధం జరగాల్సిందే అన్నట్లుగా తయారైంది వ్యవహారం. తాజాగా లగచర్ల రైతుకు బేడీలు(Handcuff to Lagacharla Farmer) వేసి ఆసుపత్రికి తరలించిన విషయం రెండుపార్టీల మధ్య పెద్ద దుమారమే రేగుతోంది. రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తరలించటంపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), హరీష్ రావు(Harish Rao) పెద్దఎత్తున మండిపడుతున్నారు. ప్రభుత్వానికి సంస్కారంలేదు, హేయం, అరాచకం, మానవత్వంలేదంటు ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఇదే సమయంలో ఏడేళ్ళక్రితం బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒక ఘటనను కాంగ్రెస్ నేతలు తెరమీదకు తీసుకొచ్చి ఎదురుదాడులకు దిగారు. 2017, మే 10వ తేదీన ఖమ్మంలోని మిర్చి రైతు(Khammam Mirchi Farmers)లు 10 మందికి పోలీసులు బేడీలు వేసిన ఘటనను ఇపుడు బయటకు తీసి కేటీఆర్, హరీష్ పై ఎదురుదాడులకు దిగుతున్నారు. దాంతో రెండుపార్టీల నేతలమధ్యా మాటలయుద్ధం పెరిగిపోతోంది.
ఇంతకీ ఏమిజరిగిందంటే దాదాపు నెలరోజుల క్రితం కొడంగల్(Kodamgal) నియోజకవర్గం దుద్యాల మండలంలోని మూడు గ్రామాల్లో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకోసం ప్రభుత్వం భూసేకరణ చేయాలని డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో లగచర్ల గ్రామంలో సభ నిర్వహించిన కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Pratik Jain) పైన గ్రామస్తులు, రైతులు దాడిచేయటం పెద్ద సంచలనమైంది. దాడికి సంబంధించి పోలీసులు 45 మంది రైతులను అరెస్టుచేసి రిమాండుకు పంపారు. రైతులు ఇంకా సంగారెడ్డి సెంట్రల్ జైలులోనే ఉన్నారు. వారిలో హీర్యానాయక్ అనే రైతుకు బుధవారం రాత్రి చాతీలో నొప్పివచ్చింది. దాంతో రైతును స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసరమైన చికిత్స చేయటంతో పాటు డాక్టర్లు పరీక్షలు కూడా చేశారు. పరిస్ధితి నిలకడగానే ఉందని చెప్పిన డాక్టర్లు మెరుగైన చికిత్స్ కోసం హైదరాబాదులోని నిమ్స్(NIMS) లో చేర్పించమని చెప్పారు. దాంతో పోలీసులు రైతును నిమ్స్ కు తరలించారు. ఆసుపత్రికి తరలించేటపుడు రైతు కుడిచేతికి పోలీసులు సంకెళ్ళు(బేడీలు) వేసి ఇనుపగొలుసులతో తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దాన్నిపట్టుకుని రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ చర్య హేయమని, అమానుషమని, అమానవీయమని, సంస్కారహీనం, రేవంత్ రెడ్డి క్రూరమనస్తత్వానికి నిదర్శనమని ఏమిటేమిటో మాట్లాడేశారు. గుండెనొప్పి వచ్చిన రైతును అంబులెన్సులో కాకుండ పోలీసు జీపులో తరలిస్తారా అంటు మండిపోయారు. హరీష్ రావు కూడా ఇలాంటి ఆరోపణలు, విమర్శలతోనే ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు. ఇద్దరూ ట్విట్టర్లో రేవంత్ కు వ్యతిరేకంగా రెచ్చిపోయారు. వీళ్ళిద్దరు గమనించాల్సిన విషయం ఏమిటంటే చాతీనొప్పి అన్నంత మాత్రాన గుండెనొప్పికాదు. గ్యాస్ సమస్యతో కూడా చాతిదగ్గర నొప్పిగా అనిపించచ్చు. అయినాసరే రేవంత్ ప్రభుత్వం దొరికింది కదాని కేటీఆర్, హరీష్ ప్రభుత్వంపై పెద్దఎత్తున విరుచుకుపడ్డారు. ఇదేసమయంలో బీజేపీ నేతలు కూడా రెచ్చిపోయారు. రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకురావటం అన్యాయమన్నారు. జరిగిన ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాద్యులపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ(BJP) నేతలు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఘటనపై స్పందించిన రేవంత్ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. అలాగే జైలర్ సంజీవరెడ్డిపైన ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. జైలు సూపరెండెంట్ పై విచారణకు రేవంత్ ఆదేశించారు.
బీఆర్ఎస్ హయాంలో ఏమి జరిగింది ?
రైతుకు బేడీలు వేయటంపై ఇపుడు ఇంతగా రెచ్చిపోతున్న కేటీఆర్, హరీష్ తమ హయాంలో ఏమి జరిగిందో మరచిపోయినట్లు నటిస్తున్నారు. 2017, మే 10వ తేదీన ఖమ్మం మిర్చిరైతులకు కూడా ఇపుడు జరిగినట్లే జరిగింది. మిర్చీకి గిట్టుబాటు ధరలు రావటంలేదని జరిగిన ఆందోళనలో అప్పుడు 10 మంది రైతులను పోలీసులు అరెస్టుచేశారు. వారందరిని ఖమ్మంకోర్టుకు తరలించినపుడు పోలీసులు పదిమంది రైతులకు బేడీలు వేసి తీసుకొచ్చారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు పెద్ద గొడవచేశాయి. అప్పట్లో అంత గొడవజరిగినా కేసీఆర్ ఏమాత్రం స్పందించలేదు. ఘటనపై కేటీఆర్, హరీష్ నోరిప్పలేదు. అప్పట్లో తమ హయంలో కూడా ఇప్పటిలాగే జరిగిన విషయాన్ని మరచిపోయిన నేతలిద్దరు లగచర్ల రైతు హీర్యానాయక్(Farmer HiryaNaik) చేతులకు బేడీలున్న ఫొటోలను మీడియాలో చూపిస్తు నానా గోలగోల చేస్తున్నారు.
కాంగ్రెస్ ఎదురుదాడి
ఎప్పుడైతే లగచర్ల రైతు విషయంలో కేటీఆర్, హరీష్ గోల మొదలుపెట్టారో వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ వీహెచ్ రంగంలోకి దిగేశారు. ఖమ్మం మిర్చి రైతుల విషయంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పదిమంది రైతుల చేతులకు బేడీలు వేసిన ఘటనను తెరపైకి తీసుకొచ్చారు. ఇపుడు రైతుకు బేడీలు వేసిన పోలీసులే అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పదిమంది బేడీలు వేయటాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వానికి సంబంధంలేకుండా పోలీసులు అప్పుడు చేసినట్లే ఇప్పుడూ చేశారని అన్నారు. పోలీసులు చేసిన చర్యకు అనవసరంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయద్దని విజ్ఞప్తిచేశారు.
తప్పు ఎక్కడ జరిగింది ?
రైతులకు బేడీలు వేయటాన్ని ఎవరూ సమర్ధించరు. బీఆర్ఎస్ హయాంలో పదిమంది రైతులకు బేడీలు వేయటమూ తప్పే, ఇపుడు హీర్యానాయక్ చేతికి బేడీలు వేయటమూ తప్పే. అప్పుడైనా, ఇప్పుడైనా రైతులకు బేడీలు వేయమని ఎవరు ఆదేశించారు ? ప్రభుత్వంలో పై స్ధాయిలో ఉన్న వాళ్ళెవరూ ఇలాంటి ఆదేశాలు ఇవ్వరు. కిందస్ధాయిలోని పోలీసులే తమకు తోచినట్లుగా వ్యవహరిస్తారు. పోలీసుల దృష్టిలో నేరస్తులు, రైతులు ఒక్కటే. జైలుకు వచ్చాడంటే ఎవరికైనా పోలీసుల చేతిలో ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది. ఏమిచేసి జైలుకు వచ్చాడని ఆలోచించేంత విచక్షణ చాలామంది పోలీసులకు ఉండదని అందరికీ తెలుసు. కిందస్ధాయిలోని పోలీసుల అనాలోచితచర్యే అప్పుడైనా, ఇప్పుడైనా ప్రభుత్వానికే చుట్టుకుంటుంది.
అప్పట్లో తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు కాబట్టి ఇపుడు దొరికింది ఛాన్స్ అన్నట్లుగా కేటీఆర్, హరీష్ రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ పదేళ్ళ హయాంలో ఏవైతే జరిగాయో ఇపుడు రేవంత్ ఏడాదిపాలనలో అలాంటివే పునరావృతమవుతున్నాయి. అయినా సరే తమహయాంలో అంతా మంచిగా జరిగితే ఇపుడు రేవంత్ పాలనలోనే అన్యాయాలు, అరాచకాలు జరుగుతు రాక్షసపాలన జరుగుతోందంటు కేటీఆర్, హరీష్ రెచ్చిపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది.
బీజేపీకే హక్కుందా ?
అప్పుడైనా, ఇప్పుడైనా ప్రభుత్వాలను నిలదేసే అవకాశం బీజేపీకి మాత్రమే ఉంది. ఎందుకంటే తెలంగాణాలో బీజేపీది మొదటినుండి ప్రతిపక్ష పాత్రే కాబట్టి. బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేయటంపై ఆందోళనలు చేసిన బీజేపీ నేతలు, ఇపుడు రైతుకు బేడీలు వేయటాన్నీ తప్పుపడుతున్నారు. అప్పుడూ, ఇప్పుడూ బీజేపీది ప్రతిపక్ష పాత్రే కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను తప్పుపట్టే హక్కు ఆ పార్టీకి మాత్రమే ఉంది.