హైదరాబాద్‌లో హలీం దోసె సూపర్ హిట్
సింపుల మసాలా దోసె రోజు కొక అవతారం మార్చుకుంటూంది. చాకొలేట్ దోసె కూడా ఈ జాబితాలో చేరింది. ఇపుడు తాజాగా హలీమ్ దోసె హైదరాబాద్ లో ట్రెండ్...
మసాల దోసె,,రవ్వదోసె, ఆనియన్ దోసె, పన్నీర్ దోసె, చీజ్ దోసె...ఇలా చెప్పుకుంటూ పోతే దోసెల్లో ఎన్నెన్నో రకాలు...వేడివేడి దోస అంటే అందరికీ ఇష్టమే...ఖీమా దోసె, మసాల దోసె, బన్ దోసె, 65 దోసే కాదు...రమజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్‌లోని లేట్ నైట్ ఫుడ్ కొత్తగా హలీం దోస విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బిర్యానీ, హలీమే కాదు హైదరాబాదీ రుచుల జాబితాలో కొత్తగా హలీం దోసె కూడా చేరింది.
- కొంత మందికి దోసె అంటే ఇష్టం...మరికొంతమందికి హలీం అంటే ఇష్టం...ఈ రెండు ఇష్టమైన వంటకాలను కలిపి చేసిన హలీం దోస ఇప్పుడు హైదరాబాద్ నగరంలో సూపర్ హిట్ అయింది.
అది విజయనగర్ కాలనీలోని పాండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్...సమయం : రాత్రి 9 గంటలు అవుతుందంటే ఒక్కొక్కరు బైక్‌లు, కార్లపై ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటరుకు చేరుకుంటున్నారు...వచ్చి రాగానే హలీం దోస అంటూ ఆర్డర్ చేస్తున్నారు. వేడివేడిగా పొగలు కక్కుతున్న పెనంపై షెఫ్ మహేష్ నీళ్లు చల్లి మినపదోసలు వేశారు...దోస కాలుతుండగా దానిపై నెయ్యి చల్లారు...అనంతరం ఒక టిన్ నుంచి హలీంను తీసి దోసపై వేసి రౌండప్ చేసి, ఆపై దానిపై జున్ను వేసి వేడివేడి హలీం దోసలను కొబ్బరి చట్నీతో సర్వ్ చేశారు...అంతే హలీం దోస ముక్కను నోట్లో వేసుకున్న ఫుడ్ లవర్స్ దీని రుచికి మైమరచి పోతున్నారు. దీంతో మొదట ఒకరు...ఇద్దరితో మొదలైన హలీం దోస ఆర్డర్లు ఆ నోటా ఈ నోటా సోషల్ మీడియాకు చేరడంతో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద యువకుల రద్దీ పెరిగింది.
బలవర్ధకమైన ఆహారం...
మినపప్పు, మటన్ లేదా చికెన్, డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, జున్ను ఇలా ఎన్నెన్నో బలవర్ధకమైన పదార్థాలతో చేసిన హలీం దోసను హైదరాబాదీలు ఇష్టంగా తింటున్నారని చెఫ్ మహేష్ చెప్పారు. ఇఫ్తార్ తర్వాత రాత్రి 9 గంటల నుంచి లేట్ నైట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లలో వీటిని అందుబాటులో ఉంచారు. ఒక్క రమజాన్ మాసంలోనే లభించే ఈ కొత్తరకం దోసలు తెల్లవారుజామున 3గంటల వరకు లభిస్తాయని మహేష్ పేర్కొన్నారు. హలీం దోసల గురించి ఇన్‌స్టాగ్రామ్ లో ఫుడ్ లవర్స్ వీడియో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో ఏంటీ బ్రదరూ అంటూ నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ వీడియోను 9,594 మంది నెటిజన్లు లైక్స్ చేయగా, పలువురు కామెంట్లతో ముంచెత్తారు.హలీమ్ దోస టేస్ట్ సూపర్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టుల వరద పారిస్తున్నారు.
హలీం దోస తయారీ ఇలా...
ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న వైరల్ రీల్ హలీమ్ దోసను తయారుచేసే విధానాన్ని చూపిస్తోంది. వేడి వేడి పెనంపై మినప దోస వేసి దానిపై నెయ్యి చల్లుతారు. ఒక చిన్న టిన్ హలీంను రౌండప్ చేస్తారు.తర్వాత దానిపై జున్ను చల్లి వేడివేడి హలీం దోసను ఆరు ముక్కలుగా చేసి కొబ్బరి చట్నీతో వేడివేడిగా వడ్డిస్తున్నారు.
హలీం తీసుకువెళ్లి ఇంట్లోనూ హలీం దోస చేసుకోవచ్చు...
మసాలా దోసె, ఎగ్ దోసె లా రుచికరమైన హలీం దోసలను ఇంట్లో కూడా చేసుకోవచ్చునని హైదరాబాదీ చెఫ్ చెప్పారు.హోటల్ నుంచి హలీం తీసుకువచ్చి ఇంట్లోనే దోసలు వేసి దానిపై హలీంని వేసి నెయ్యి, జున్ను వేసి తినవచ్చు. ఈ హలీం దోసలో గుడ్డు పగలగొట్టి, ఫోర్క్‌తో కలిపి, ఆ గుడ్డు సొనను హలీం మీద పోసి దానిపై మిరియాల పొడి కూడా చల్లుకుంటే మంచి టేస్ట్ వస్తుంది.
చట్నీ లేకుండానే హలీం దోస తినవచ్చు
ఈ హలీం దోసను చట్నీ లేకుండా కూడా తినొచ్చు. కావాల్సి వస్తే చట్నీ కూడా వేసుకోవచ్చు. దోస బాగా కాలితేనే టేస్ట్ వస్తుందని, దీనికి నెయ్యి, జున్ను వేస్తే అదనపు రుచి వస్తుందని చెఫ్ మహేష్ చెప్పారు. హోటల్ నుంచి తెచ్చిన మిగిలిపోయిన హలీంతో ఇంట్లోనే ఈ దోసలు వేసుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల దోస క్రిస్పీగా, రుచిగా ఉంటుంది. కారంగా ఉండేలా దోసపైన మిరియాలు చల్లుకోవచ్చు. క్రియేటివ్ రెసిపీ అయిన ఈ కొత్త వంటకం హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లోని లేట్ నైట్ టిఫిన్, స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లలో విక్రయిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ హలీం దోస రుచి చూడండి.
Next Story