కేసీయార్ కు గుత్తా బిగ్ షాక్
x

కేసీయార్ కు గుత్తా బిగ్ షాక్

బీఆర్ఎస్ అగ్రనేతలు ఎంత గింజుకున్నా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్సీలపై అనర్హత వేటు పడదని అర్ధమైపోయింది.


శాసనమండలి ఛైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులపై కేసీయార్ జాతీయస్ధాయిలో పోరాటం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదేసమయంలో గుత్తా మీడియాతో మాట్లాడుతు పార్టీ మారిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీల అనర్హతపై గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు. అంటే గుత్తా చెప్పిందాని ప్రకారం బీఆర్ఎస్ అగ్రనేతలు ఎంత గింజుకున్నా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్సీలపై అనర్హత వేటు పడదని అర్ధమైపోయింది.

ఇంతకీ విషయం ఏమిటంటే గుత్తా బీఆర్ఎస్ తరపున నామినేట్ అయిన శాసనమండలి ఛైర్మన్ అన్నవిషయం తెలిసిందే. గుత్తా పదవీకాలం సుమారు మూడేళ్ళుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడే కేసీయార్ కు గుత్తాకు గ్యాప్ వచ్చేసింది. అందుకనే నల్గొండ ఎంపీగా తనకొడుక్కి టికెట్ కోసం కేసీయార్ ను కలవాలని గుత్తా ఎంత ప్రయత్నించినా అవకాశం దొరకలేదు. అప్పటికే మొదలైన గ్యాప్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో బాగా పెరిగిపోయింది. ఇదే సమయంలో కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. దాంతో గుత్తా కూడా తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ నుండి ఫిరాయింపులు మొదలయ్యాయి.

ఎంఎల్ఏలతో మొదలైన ఫిరాయింపులు ఇపుడు ఎంఎల్సీల దాకా వచ్చింది. ఒకేసారి ఆరుగురు ఎంఎల్సీలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఎంఎల్ఏలపై అనర్హత వేటుకోసం అసెంబ్లీ స్పీకర్ కు, ఎంఎల్సీలపై అనర్హత వేటు వేయాలని గుత్తాకు బీఆర్ఎస్ అగ్రనేతలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటంలేదు. దాంతో వీళ్ళతో లాభంలేదని గులాబీపార్టీ నేతలు హైకోర్టులో కేసులు దాఖలు చేశారు. కోర్టులో కేసు విచారణల మీద విచారణలు పడుతోంది. అందుకనే కాంగ్రెస్ ఫిరాయింపులకు వ్యతిరేకంగా జాతీయస్ధాయిలో ఆందోళనలు చేయాలని కేసీయార్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే కేసీయార్ ప్లాన్లు ఎంతవరకు వర్కవుటవుతాయో అనుమానమే. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నపుడు కేసీయార్ కూడా పెద్దఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీల నుండి నలుగురు ఎంపీలు, 25 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలను బీఆర్ఎస్ లోకి లాక్కున్నారు. ఆరోజుల్లో టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఫిరాయింపులపై ఎంత గోలచేసినా కేసీయార్ ఏమత్రం లెక్కచేయలేదు. ఎంఎల్ఏలను లాక్కోవటమే కాకుండా టీడీఎల్పీ, సీఎల్పీలను కూడా బీఆర్ఎస్ లో విలీనం చేసేసుకున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎంఎల్సీలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఎంత మొత్తుకున్నా మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పట్టించుకోలేదు. ఎందుకంటే కేసీయార్ ఆదేశాల ప్రకారమే అప్పట్లో గుత్తా నడుచుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు.




ఇపుడు ప్రభుత్వంలో బీఆర్ఎస్ స్ధానంలో కాంగ్రెస్ ఉంది. అయితే మండలి ఛైర్మన్ గా మాత్రం గుత్తానే కంటిన్యు అవుతున్నారు. ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. మండలిలోని 29 మంది బీఆర్ఎస్ సభ్యుల్లో మెజారిటి సభ్యులను కాంగ్రెస్ లోకి లాక్కోవాలన్నా, ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడకూడదన్నా కాంగ్రెస్ కు గుత్తా సహకారం చాలా అవసరం. బీఆర్ఎస్ అధికారంలో లేదు, పైగా కేసీయార్ తో పడటమూలేదు. అందుకనే గుత్తా కూడా బీఆర్ఎస్ ను పట్టించుకోవటంలేదు. కాంగ్రెస్ యధేచ్చగా ఎంఎల్సీల ఫిరాయింపులకు పాల్పడుతోంది. అసెంబ్లీ స్పీకర్ ఎలాగు కాంగ్రెస్ నేతే కాబట్టి ఇబ్బంది లేదు.

గుత్తా నుండి మండలిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అంతా మాట్లాడుకన్న తర్వాతే రేవంత్ ఎంఎల్సీల ఫిరాయింపులకు లాకులెత్తినట్లు అర్ధమవుతోంది. అందుకనే ఎంఎల్ఏలు, ఎంఎల్సీల అనర్హతపై గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే నడుచుకుంటానని గుత్తా ఇపుడు మీడియాతో చెప్పింది. గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం అంటే ఏమిటి ? ఏమీలేదు, కాంగ్రెస్ ఫిరాయింపులను మండలి ఛైర్మన్ హోదాలో గుత్తా ఆమోదించటమే. గతంలో కేసీయార్ ప్రోత్సహించిన ఫిరాయింపులను ఆమోదించినట్లే ఇపుడు రేవంత్ ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులను కూడా గుత్తా ఆమోదించబోతున్నారు. గతనిర్ణయాల్లాగే ఇపుడు బీఆర్ఎస్ ఎంఎల్సీలు కాంగ్రెస్ లోకి ఫిరాయించటాన్ని ఆమోదించబోతున్నట్లు గుత్తా చెప్పకనే చెప్పి కేసీయార్ కు పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి. గుత్తా ప్రకటనపై ఇంకా క్లారిటి కావాలంటే కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్సీలపై అనర్హత వేటు వేసేందిలేదనే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేత శాసనమండలి ఛైర్మన్ గా ఎంఎల్సీలపై ఎందుకు అనర్హత వేటు వేయటంలేదని జాతీయపార్టీలు ప్రశ్నిస్తే కేసీయార్ ఏమని సమాధానం చెబుతారు ?

పదేళ్ళలో కేసీయార్ ప్రోత్సహించిన ఫిరాయింపుల చరిత్రంతా బయటపడుతుంది. అయినా ఈ విషయం జాతీయపార్టీల నేతలకు తెలీకుండా ఉండదు కదా. మొత్తంమీద కేసీయార్ ను తెలంగాణాలోనే కాదు జాతీయస్ధాయిలో ఏ పార్టీ కూడా పట్టించుకునే అవకాశంలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నపుడు జాతీయపార్టీల నేతలను కేసీయార్ లెక్కచేయలేదు కాబట్టి. అందుకనే ఫిరాయింపులపై కేసీయార్ జాతీయస్ధాయి పోరాటంచేసినా, కోర్టుల్లో కేసులు వేసినా చివరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూను కలిసినా ఎలాంటి ఉపయోగం ఉండదు.

Read More
Next Story