ఎమ్మెల్యే భర్తపై అట్రాసిటీ కేసు.. అసలేం జరిగింది..
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త గళ్లా రామచంద్ర రావు అట్రాసిటీ కేసు నమోదయింది. తాను అడిగినా స్థలం అమ్మలేదని రామచంద్ర రావు రెచ్చిపోయారు.
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త గళ్లా రామచంద్ర రావు అట్రాసిటీ కేసు నమోదయింది. తాను అడిగినా స్థలం అమ్మలేదని రామచంద్ర రావు రెచ్చిపోయారు. బాధితులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అక్కడే ఉన్నా చోద్యం చూసినట్లు చూస్తూ నిల్చున్నారే తప్ప.. ఏమీ చేయలేదని బాధితులు చెప్తున్నారు. తాజాగా రామచంద్రరావుపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అసలు ఏమైందంటే..
గళ్లా రామచంద్రరావు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమ్మాలంటూ బాధితులపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఏది ఏమైనా వారు తమ భూమిని అమ్మేది లేదంటూ బాధితులు అడ్డం తిరగడంతో రామచంద్రరావుకు కోపం కట్టలు తెంచుకుని వచ్చింది. బాధిత కుటుంబంపై ఆయన దాడికి దిగారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా ముదిరి కోర్టు మెట్లెక్కింది. పోలీసుల సమక్షంలోనే ఆయన దాడికి పాల్పడినా పోలీసులు ఏమీ చేయలేదని బాధిత కుటుంబం న్యాయస్థానానికి వివరించింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వెంటనే రామచంద్రరావుపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
టీడీపీలో కలకలం
గళ్లా రామచంద్ర రావుపై అట్రాసిటీ కేసు నమోదు కావడం.. గుంటూరు టీడీపీలో కలకలం రేపుతోంది. ఇప్పుడిప్పుడే పార్టీ మళ్ళీ రాష్ట్రంలో నిలదొక్కుకుంటుందని, ఇలాంటి సమయంలో రామచంద్రరావుపై యాక్షన్ తీసుకోకుంటే పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఈ వ్యవహారంపై గళ్లా మాధవిని వివరణ కోరాలని కూడా కొందరు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే పదవిని అడ్డుపెట్టుకుని భర్త చేత గళ్లా మాధవియే ఈ రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.