గుంటూరు మున్సిపల్ కమిషనర్ 9.24కోట్లను దోచేశారు
మేయర్ మనోహర్ నాయుడు మున్సిపల్ కమిషన్ శ్రీనివాసరావుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. అవినీతిపైన సీఎం, పీఎంలకు లేఖలు రాస్తానని వెల్లడించారు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ రచ్చకెక్కింది. కార్పొరేషన్ నిధులను అడ్డంగా దోచేశారని కమిషనర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు డుమ్మా కొట్టడంపై మేయర్ కావటి మనోహర్‌నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సహాయం పేరుతో ఖర్చు పెట్టిన నిధులకు లెక్కలు చెప్పాల్సి వస్తుందనే నెపంతో కమిషనర్ శ్రీనివాసులు కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టారని సంచలన వాఖ్యలు చేశారు. అంతేకాకుండా తనకు ప్రొటోకాల్ ప్రకారం ఉండాల్సిన సిబ్బందిని వెనక్కు తీసుకున్నారని విమర్శలు గుప్పించారు.
దీనిపైన శుక్రవారం గుంటూరు నగర్ మేయర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ.. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న పులి శ్రీనివాసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మేయర్ నిర్ణయించిన మేరకు కౌన్సిల్ సమావేశాన్ని ఖచ్చితంగా నిర్వహించాలని, కానీ కమిషన్ డుమ్మా కొట్టారని అన్నారు. జనవరి 4వ తేదీన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో విజయవాడ వరదల సహాయం కింద పెట్టిన ఖర్చులు గురించి ప్రశ్న లేవనెత్తామని, అయితే ఆ సమావేశం నుంచి కమిషనర్ అర్థాంతరంగా వెళ్లిపోయారని అన్నారు. నాటి నుంచి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారని కమిషనర్‌పై ధ్వజమెత్తారు.
కమిషనర్‌కు ఓపిక, సహనం ఉండాలని, అలా కాకుండా ఐఏఎస్ అధికారిని అని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తానని అనుకుంటే కుదరదని కమిషనర్ శ్రీనివాసులను హెచ్చరించారు. బాధ్యతాయుతమైన కమిషనర్ స్థానంలో ఉన్న శ్రీనివాసులు జవాబుదారిగా వ్యవహరించాలని సూచించారు. కౌన్సిల్ సమావేశం నుంచి అర్థాంతరంగా కమిషనర్ వెళ్లి పోవడం ద్వారా నగర మేయర్‌ను, కార్పొరేటర్లను మాత్రమే కాకుండా 11 లక్షల మంది ప్రజలను అవమానించారని అన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా మేయర్, డిప్యూటీ మేయర్‌లకు ఉన్న సిబ్బందిని తొలగించడం సమంజసం కాదన్నారు. వరద బాధితుల సహాయం పేరుతో కార్పొరేషన్ సొమ్ము రూ. 9.24కోట్లను ఎడాపెడా ఖర్చు చేశారని అన్నారు.
అయితే దేని ఎంత ఖర్చు చేశారనే దానిపై ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా క్లారిటీ లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. ఈ పంపకాల్లో గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు కార్పొరేషన్ సొమ్ము 9.24లక్షలను దోచేశారని సంచలన ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా ఖర్చు పెట్టిన నిధులకు తప్పుడు లెక్కలతో కూడిన నివేదికను ఇచ్చాని విమర్శించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఖాతాలో కోటి రూపాలను జమ చేశారని ఆరోపించారు. వరద సహాయం కింద ఎవరికి ఎంత ఖర్చు పెట్టారో కూడా కమిషనర్ చెప్పడం లేదని, ప్రజల సొమ్మును కాజేసిన కమిషనర్ శ్రీనివాసరావుపై విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాస్తానని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు పేర్కొన్నారు.
Next Story