గుంటూరులో కలకలం, అతిసారంతో బెంబేలు
x

గుంటూరులో కలకలం, అతిసారంతో బెంబేలు

తురకపాలెం మృత్యుఘోష నేపథ్యంలో అధికారుల ఉరుకులు, పరుగులు


గుంటూరులోని పలు ప్రాంతాలలో అతిసారం వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. నీటి కాలుష్యంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరంలోని పలు అంతర్గత పైపులైన్ల లీకేజీలకు మరమ్మతులు చేయకపోవడంతో వివిధ కాలనీలలో నీరు కలుషితమై అతిసారం వ్యాధితో ఆస్పత్రి పాలవుతున్నారు.
తాజాగా గుంటూరు శ్రీనగర్ వాసులు ఆస్పత్రి పాలయ్యారు. దీంతో స్థానికులు లీకేజీలను అరికట్టడంలో ఇంజినీరింగ్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. శ్రీనగర్‌ కాలనీ 7వలైన్‌ బుద్ధుడి బొమ్మ కూడలితోపాటు పలు చోట్ల తాగునీటి పైపులైన్లకు లీకులై తాగునీటి వృథాతోపాటు కలుషిత నీరు చేరుతోందని ఫిర్యాదులు వస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఆదివారం ఈప్రాంతంలో ఒకరు వాంతులు, విరోచనాలతో తీవ్ర అనారోగ్యం పాలవ్వగా..మరికొంతమంది ఇలాంటి లక్షణాలతోనే బాధపడుతూ స్థానిక ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవడం కలకలం రేపింది.
కలుషిత నీటి సరఫరాపై స్థానికులు ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత శారదా కాలనీ వద్ద రిజర్వాయర్‌ వద్దకు వెళ్లి అధికారులను నిలదీశారు. తాము కొన్ని రోజులుగా చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన డీఈఈ కల్యాణరావు, ఏఈ రాజశేఖర్‌లు వెంటనే శ్రీనగర్‌ 7వ లైన్‌లో లీకేజీలు ఉన్న చోట్ల రాత్రికి రాత్రే తవ్వించి సరఫరా అవుతున్న నీరు కలుషితమౌతుందేమోనని పరిశీలించారు. సంఘటనపై డీఈఈ కల్యాణరావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నీటిని పరిశీలించినట్లు, తిరిగి సోమవారం ఉదయం సరఫరా సమయంలో కూడా నవనాలు సేకరించి పరీక్షించనున్నట్లు తెలిపారు.
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో పలువురు మరణించిన నేపథ్యంలో గుంటూరు నగరంలో వ్యాపించిన అతిసారం వ్యాధి కలకలం రేపింది. గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో రాజధాని అమరావతి, పలువురు రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్న గుంటూరులో నీటి సరఫరాపై తక్షణమే శ్రద్ధ చూపాలని గుంటూరు ఎమ్మెల్యేలు వైద్యాధికారులను ఆదేశించారు.
Read More
Next Story