కోర్టులో గుడివాడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని భవిష్యత్
గుడివాడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించాలని తెలుగుదేశం పార్టీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ ఓటర్లలో నెలకొంది.
గుడివాడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరావు (నాని) అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ ప్రస్తుతానికి ఆమోదం పొందినా కోర్టు నిర్ణయం ఎలా వస్తుందో దాని ప్రకారం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై కృష్ణా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డీకే బాలాజీ పూర్తి నివేదిక ఇవ్వాలని గుడివాడ ఆర్డీవో పద్మావతిని కోరారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా తలెత్తిన పరిణామాలపై ఆమె కలెక్టర్‌కు నివేదికను సమర్పించారు.
గుడివాడ ఎన్నికల అధికారి నానీకి ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చారు. పాత మునిసిపల్ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్న విషయాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో చూపించలేదని తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తరువాత అద్దెచెల్లిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నుంచి పత్రాలు తీసుకుని ఆర్‌వోకు ఇచ్చారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. తాను బకాయి లేకపోవడం వల్లే అఫిడవిట్‌లో దాన్ని పొందుపరచలేదని వివరణ ఇచ్చినట్టు తెలిసింది. కానీ ప్రభుత్వ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నా ఆ వివరాలనూ కచ్చితంగా అఫిడవిట్‌లో నమోదుచేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. అఫిడవిట్‌లో నో అని పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆర్‌వోకు ఆధారాలు అందజేత
కొడాలి నాని నామినేషన్ పత్రాల్లో అభ్యంతరాలకు తగిన ఆధారాలు ఇవ్వాలని ఆర్వో పద్మావతి తెలుగుదేశం పార్టీ వారికి నోటీసులు జారీచేశారు. దీంతో వారు శనివారం ఆధారాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తులసిబాబు, హైకోర్టు న్యాయవాది అరవింద్ కలిసి గుడివాడ ఆర్వో కార్యాలయానికి వెళ్లి తమ అభ్యంతరాలను ఆధారాలతో ఆర్వోకు సమర్పించారు. పాత మున్సిపల్ కార్యాలయాన్ని గత ఐదేళ్లుగా నాని వినియోగించారనేందుకు ఆధారాలను ఇచ్చారు. నాని నామినేషన్ అఫిడవిట్‌లోని 17వ పేజీలో ప్రభుత్వ అకామడేషన్‌ను వాడుకోలేదంటూ నో అని పెట్టడం. నిబంధనల ప్రకారం తప్పని చెప్పారు. ఐదేళ్లు ప్రభుత్వ భవనాన్ని నాని వాడుకున్నారని మున్సిపల్ కమిషనర్ ధృవీకరించిన పత్రాలను తెలుగుదేశం పార్టీ నేతలు అందజేశారు.
నామినేషన్ పత్రాల పరిశీలన సందర్భంగా మేం లేవనెత్తిన లోపాలకు సంబంధించిన వివరాలు, ఆధారాలను ఆర్వోకు అందజేశాం. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో మా అభ్యంతరాలకు ఆధారాలు చూపించాలంటూ ఆర్‌వో నోటీసులు ఇచ్చారు. అలా ఇచ్చారంటేనే తప్పు జరిగినట్టు అర్థమవుతోందని టీడీపీ నాయకుడు రావి వెంకటేశ్వరావు అన్నారు.
కొడాలి నాని అఫిడవిట్ లోపాలపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశామని టీడీపీ నేత తులసిబాబు తెలిపారు.
కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ 2009లో తిరస్కరణ
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2009లో పోటీ చేసిన కదిరి బాబూరావు నామినేషన్ అప్పట్లో చెల్లలేదు. ఎంత ఏడ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పట్లో కలెక్టర్‌గా పనిచేసిన కె దేవానంద్ నిర్ణయం తీసుకుంటూ రెండు చోట్ల సంతకాలు లేని కారణంగా నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో కదిరి బాబూరావు ఆ ఎన్నికలకు దూరం కావాల్సి వచ్చింది. ఆయనపై ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఐ తరపున ముక్కు ఉగ్ర నర సింహారెడ్డి పోటీ చేశారు. కదిరి బాబూరావు నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సుంకర మధుసూదన్‌రావును తెలుగుదేశం పార్టీ బలపరిచింది. ఈ ఎన్నికల్లో ఉగ్ర కేవలం 2,935 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు. టీడీపీ నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా ఉంటే తప్పకుండా కదిరి బాబూరావు గెలిచి ఉండే వారు. మధుసూదన్‌రావుకు ఉంగరం గుర్తు వచ్చింది. ఉగ్రను గింగిరాలు తిప్పిన ఉంగరం శీర్షికలతో అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. నామినేషన్ పత్రంలో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటే తప్ప ఏచిన్న లోపం ఉన్నా తిరస్కరణకు గురికాక తప్పదు.
Next Story