ఓటమిపై సుదీర్ఘ చర్చ అవసరం.. గుడివాడ అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ చవిచూసిన ఘోర పరాజయంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలకంగా స్పందించారు. ఓటమిపై పార్టీలో సుదీర్ఘ చర్చ జరగాలి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ చవిచూసిన ఘోర పరాజయంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలకంగా స్పందించారు. ఓటమిపై పార్టీలో సుదీర్ఘ చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అడగకుండా అన్నీ అందించినా, సంక్షేమాన్ని గడకు చేర్చినా ప్రజల ఆదరణ ఎందుకు లభించలేదు అన్న అంశాలపై చర్చించి, అందుకు కారణాలు తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు. వ్యవస్థల్లో చేసిన మార్పులు, తీసుకొచ్చిన సంస్కరణల వల్ల మంత్రివర్గానికి ఎటువంటి గౌరవం దక్కగపోగా ఎటు చూసినా అవమానాలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడానికి ఏమిటి కారణం అని ప్రతి నేత ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం, పార్టీ మధ్య దూరం పెరిగిందని చెప్పారు. పరిపాలనను ప్రజల ఇంటికే తీసుకెళ్లే సచివాలయం, వ్యాలంటీర్ వ్యవస్థలు తీసుకొచ్చినా ఎందుకు గెలవలేకపోయాం అన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలని తెలిపారు. ఈ అంశంపై పార్టీ పెద్దలు పరిశీలన సమీక్ష నిర్వహించాలని కోరారు.
48 గంటల్లోనే దాడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారి 48 గంటలు కూడా గడవకముందే దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేశారన్న కక్షతో ఇళ్లకు వెళ్లిమరీ చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా దాడులు చేస్తున్నారని, దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు అమర్నాథ్. ఓడిపోయినంత మాత్రాన తాము ఇళ్లకే పరిమితమవుతానమి అనుకోవద్దని, ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్’ అన్న మా అధినాయకుడి మాటకు కట్టుబడి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కూడా స్పందించారు. తాము ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదన్నారు.
అభివృద్ధికి కృషిచేయాలి
ఆంధ్రకు మూడు రాజధానులు అని ప్రకటించినప్పటికీ తాము ఏనాడూ అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పారు. ‘‘అమరావతితో పాటు విశాఖ నగర అభివృద్ధికి కూడా కొత్త ప్రభుత్వం కృషి చేయాలి. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలి. ఎవరు ఏం చేసినా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే. వాటి దిశగానే కొత్త ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోవాలి’’ అని కోరారు.
ఆ నిర్ణయం అందిరిదా..?
‘‘గెలిచిన వెంటనే పేర్ల మార్పును ప్రారంభించిన కొత్త ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా పేరును కూడా మారుస్తుందా? మాజీ ఎమ్మెల్చే జక్కంపూరి రాజా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అది ఆయనొక్కడి అభిప్రాయమేనా లేకుంటే అందిరికీ ఇబ్బందులు ఉన్నాయా? అనేది సంమీక్షించుకుంటాం. ఈ ఎన్నికల్లో ఓటమిని ఈవీఎం ట్యాంపరింగ్‌గా నమ్మితే తప్పవుతుంది. దీనిని ప్రజల తీర్పుగానే స్వీకరించాలి. అప్పుడే సమీక్షకు అవకాశం లభిస్తుంది’’ అని వివరించారు. ప్రజలను సంతృప్తి పరచడం ఎంతటి గొప్ప నాయకుడి వల్ల కూడా కాదని ఈ ఎన్నికలతో ఆంధ్ర ప్రజలు తేటతెల్లం చేశారని చెప్పారు.