కాంగ్రెస్‌లో షర్మిలపై పెరుగుతున్న వ్యతిరేకత
x

కాంగ్రెస్‌లో షర్మిలపై పెరుగుతున్న వ్యతిరేకత

కాంగ్రెస్‌ పార్టీపై చర్చ మొదలైంది. పీసీసీ చీఫ్‌గా షర్మిల సక్సెస్‌ అవుతారా? ఎప్పుడో ఒక కార్యక్రమం చేస్తే సరిపోతుందా? నిరంతరం ఎందుకు కార్యక్రమాలు చేపట్టడం లేదు.


ఏపీ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలపై చర్చ మొదలైంది. కేవలం ప్రెస్‌ మీట్లు, అప్పుడప్పుడు వర్థంతులు, జయంతులకు ఆమె పరిమితమయ్యారు. ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్‌కు 1.72 శాతం ఓట్లు రాగా సీపీఎంకు 0.13 శాతం, సీపీఐకి 0.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. జీవశ్చవంలా ఉన్న కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో బతికించడం ఎవరివల్లైనా అవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి.

షర్మిలపై పెరిగిన వ్యతిరేకత
కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్లలో షర్మిలపై వ్యతిరేకత వచ్చిందని చెప్పొచ్చు. ఆమె పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఒంటెత్తు పోకడతో పోతున్నారనే విమర్శలు వచ్చాయి. ఎంతో మంది మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారు కాంగ్రెస్‌లో ఉన్నారు. అయితే షర్మిలతో సహా నాయకులెవ్వరినీ ప్రజలు ఓన్‌ చేసుకోవడం లేదు. షర్మిల సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీల అభీష్టం మేరకు ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోవడంతో ఎవ్వరినీ లెక్కచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆమె పార్టీ కార్యాలయానికి రాని రోజుల్లో ఎక్కడుంటున్నారో పార్టీలోని వారికెవ్వరికీ తెలియడం లేదు. పార్టీ ఆఫీస్‌లో కార్యక్రమం ఉన్న రోజు ఆమె ఒక ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేస్తున్నారు. పార్టీలోని అన్ని క్యాడర్‌ల వారికి సమాచారం ఇవ్వడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా ఇటీవలి వరకు ఉన్న సుంకర పద్మశ్రీ షర్మిలపై విమర్శలు గుప్పించారు. పార్టీ ఆఫీస్‌లో కానీ, బయట కానీ ఏ కార్యక్రమం జరిగినా తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని, అందరినీ కలుపుకుని పోవడం లేదని, ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోతున్నారని ఆమె పలు మార్లు విమర్శించారు. ఎన్నికల సమయంలో కనిపించిన పీసీసీ మాజీ చీఫ్‌ రఘువీరారెడ్డి కూడా ఇప్పుడు కనిపించడం లేదు. కేవీపీ రామచంద్రరావు ఎన్నికల సమయంలో ఎక్కువ సార్లు కనిపించారు. ఆయన కూడా ముఖం చాటేసినట్లు కనిపిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న మానిక్కం ఠాగూర్‌ కూడా ఇటీవల కార్యక్రమాలకు రావడం లేదు.
కమిటీల పునరుద్ధరణ ఎప్పుడు?
ఏపీ కాంగ్రెస్‌ కమిటీలన్నీ రద్దయ్యాయి. ఏపీసీసీ చీఫ్‌ ఒక్కరు మాత్రమే ప్రస్తుతం యాక్టింగ్‌లో ఉన్నారు. మిగిలిన అన్ని రకాల కమిటీలు రద్దు చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. ఆ తరువాత ఆయా కమిటీల ఇన్‌చార్జ్‌లకు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో కేటాయించిన రూములకు షర్మిల తాళాలు వేయించారు. దీంతో పార్టీలోని విభాగాలకు చెందిన వారు కూడా హాజరు కావడం లేదు. కొత్త కమిటీల్లో ఎవరిని నియమిస్తారో.. అందుకు ఏ విధమైన విధానాన్ని అవలంభిస్తారో ఇంత వరకు ప్రకటించలేదు. పార్టీ అనుబంధ విభాగాలకు నాయకులు లేకపోవడంతో పార్టీలో నిస్సత్తువ ఏర్పడిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్‌ ఇలాగే ఉండిపోతుందా? ఏమైన జవసత్వాలు కూడగట్టుకుని ముందుకు సాగుతుందా అనేది పలువురిలో ఉన్న సందేహం. పార్టీ నాయకులు ఇలాగే వ్యవహరిస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఏపీలో శాశ్వతంగా ప్రజలు దూరంగా ఉంటారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త కమిటీల ఏర్పాటులో ఎందుకు అడుగు ముందుకు పడటం లేదో షర్మిల కూడా చెప్పవడం లేదని కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్‌లు వ్యాఖ్యానించడం విశేషం. అయితే వారు పేర్లు చెప్పడానికి ఇష్టపడటం లేదు. జీవితాలను కాంగ్రెస్‌ రాజకీయాల కోసం త్యాగం చేసిన ఎంతో మందికి కనీస గౌరవం ప్రస్తుతం పార్టీలో దక్కడం లేదని వారు చెప్పడం విశేషం.
జగన్‌పై వచ్చింది రూమరా... నిజమా...
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే రూమర్స్‌ ఎన్నికల తరువాత ఎక్కువయ్యాయి. ఈ రూమర్స్‌పై ఇటీవల షర్మిల స్పందించారు. ఎన్ని పిల్లకాలువలైనా సముద్రంలో కలవాల్సిందేనని, కాంగ్రెస్‌ పార్టీ సముద్రం వంటిదని వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీలోని పెద్దలను ఎవ్వరినీ కలవలేదుని స్పష్టం చేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో ఉన్న వారంతా 90 శాతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెళ్లిన వారే. వైఎస్సార్‌ను ప్రజలు ఎలా ఓన్‌ చేసుకున్నారో అలాగే వైఎస్‌ జగన్‌ను 2019లో ఓన్‌ చేసుకున్నారు. అయితే ఆయన పనితీరును అంగీకరించని ప్రజలు 2024లో ఓడించారు.
Read More
Next Story