
విజయవాడ జైలుకు గోవిందప్ప
లిక్కర్ స్కామ్‌లో గోవిందప్ప 33వ నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో 33వ నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీను విజయవాడ జైలుకు తరలించారు. ఈ నెల 20 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో సిట్ అధికారులు గోవిందప్పను జైలుకు తరలించారు.
గోవిందప్ప బాలాజీని లిక్కర్ స్కామ్‌లో 33వ నిందిడుగా చేర్చారు. ఇతను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది. జగన్‌తో పాటు ఆయన భార్య భారతిలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ గోవిందప్పే చక్కబెడుతుంటారనే ప్రచారం కూడా ఉంది. లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చిన నాటి నుంచి ఈ కేసులో తనను అరెస్టు చేస్తారనే ఆలోచనలతో ఆయన పరారీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు బోర్డర్ ప్రాంతాలైన మైసూర్ లిమిట్స్ ఏరియాలో గోవిందప్ప ఉన్నారనే సమాచారంతో అక్కడకు వెళ్లిన సిట్ అధికారులు అక్కడ గోవిందప్పను మంగళవారం అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. బుధవారం ఉదయం ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసును విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు గోవిందప్పకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు.
Next Story