ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి చేసిన తన ప్రసంగంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రంగా దాడి చేశారు. జగన్ వల్ల ఆంధ్రప్రదేశంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిందని, రాష్ట్రంలో చీకటి పాలన కొనసాగిందని, తన ప్రసంగంలో విమర్శలపై విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగం అనగానే రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ఎక్కువుగా ఉంటుంది. అయితే గత ఐదేళ్ల కాలంలో వైఎస్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగాయి. ఏ ప్రభుత్వమైనా తాము చేయబోయే పాలన గురించి, పథకాల అమలు గురించి చెప్పుకుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం గవర్నర్‌కు ఇచ్చిన ప్రసంగం నోట్‌లో సగ భాగం జగన్‌పై దాడికే కేటాయించింది. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న రాష్ట్ర గవర్నర్ మాజీ ముఖ్యమంత్రిపై ఇంతటి తీవ్రమైన విమర్శలు గుప్పించడం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర చర్చగా మారింది.
ప్రభుత్వం తన ఇష్టాను సారం ప్రసంగం తయారు చేసి ఇచ్చినా, రాజ్యాంగం పట్ల, రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యతల్లో ప్రథముడిగా ఉంటున్న రాష్ట్ర గవర్నర్ తనదైన సంయమనం పాటించి అవసరమనుకుంటే కొన్ని అంశాలను పక్కన పెట్టి ప్రసంగిచ్చొచ్చు. కానీ గవర్నర్ నజీర్ చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే తన ప్రసంగం తయారు చేసి ఇచ్చిందో దానినే ఉన్నది ఉన్నట్లు చదివి, జగన్‌పై కక్షపూరితంగా మాట్లాడారనే నింద గవర్నర్ తనపై వేసుకున్నారు.
2019లో జూన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన ప్రారంభించారు. 2024 జూన్‌తో తన పాలన ముగిసే వరకు నిరంతరాయంగా విధ్వంసం కొనసాగిందని గవర్నర్ ప్రసంగించారు. ఈ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీంతో జీవించే స్వేచ్ఛను కూడా కోల్పోయారు. పాలన.. ప్రతీకారం రాజకీయాలు రాష్ట్ర శ్రేయస్సును అభివృద్ధి అవకాశాలను తీవ్రంగా దెబ్బ తీశాయి. అంటూ గవర్నర్ తన ప్రసంగంలో జగన్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజ్యాంగ పరమైన విచ్ఛిన్నం జరిగిందా అనే అంశంపై న్యాయ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోరినట్లు తన ప్రసంగంలో చెప్పారు. బ్రాండ్ ఏపీకి అతి పెద్ద నష్టం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చెప్పుకోదగ్గా సంస్థలేవీ ముందుకు రాలేదు. అన్ని స్థాయిల్లో అవినీతి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆదాయాన్ని ఆర్జించే శాఖల్లో పాలన సాధనాలను ఆయుధాలుగా మార్చుకున్నారు.
చెక్స్ అండ్ బ్యాలెన్స్ దెబ్బతినడం వల్ల అనేక ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు నిర్వీర్యమయ్యాయి. అప్పటి వరకు ఉన్న ఔత్సాహిక పెట్టుబడి దారులు, పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్‌ను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ అనిశ్చిత ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడటం వల్ల మొత్తం ప్రజల విశ్వాసాన్ని, పెట్టుబడుదారుల నమ్మకాన్ని గందరగోళానికి గురి చేశాయి. ఆదాయ వృద్ధి పరిమితం, ఖర్చులు మాత్రం అపరిమితంగా ఉన్నాయి. అప్పులు, చెల్లింపులు బాగా పెరిగాయి. విద్యుత్ రంగంలో అప్పులు పెరిగాయి. మూల ధన వ్యయాన్ని నిర్లక్షం చేయడం వల్ల ఆర్థిక దుర్వినియోగం జరిగింది. దీంతో కార్పొరేషన్‌లు బలహీన పడ్డాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నందు వల్ల బిల్లుల చెల్లింపుల్లో కూడా తీవ్ర జాప్యం జరిగింది. కాంట్రాక్టర్లు, వ్యాపారులు బిల్లుల కోసం ఆంధ్రప్రదేశ్ హై కోర్టును ఆశ్రయించి మునుపెన్నడు లేని విధంగా 25వేల కేసులు వేశారు. అనేక కేసుల్లో అధికారులు వ్యక్తిగత హాజరు, అరెస్టు వారెంట్లతో హడలి పోయారు. కోర్టు ధిక్కార కేసులు నమోదన ఫలితంగా బ్యూరోక్రెసీ అవమానానికి గురైంది. ఇది వారిని బలి పశువులను చేయడంతో పాటు పరిపాలన యంత్రాంగాన్ని పూర్తిగా నిరుత్సాహానికి గురి చేసింది.
నిధుల కొరత కారణంగా జలవనరులు, రోడ్లు, రవాణా, భవనాలు వంటి శాఖలు ఎలాంటి పనులు చేపట్టలేక పోయాయి. జలవనరులపై మూల ధన వ్యయం 56 శాతానికి తగ్గింది. రోడ్లు, భవనాలుపై భయంకరంగా 85 శాతానికి తగ్గింది. ఈ ఐదేళ్లల్లో రాష్ట్ర సొంత పన్నులకు సంబంధించి వార్షిక వృద్ధి రేటు 12.8 శాతం నుంచి 8.1 శాతానికి పడిపోయింది. రెవిన్యూ వ్యయం 7.8 శాతం నుంచి 10.5 శాతానికి పెరిగింది. మూల ధన వ్యయం వృద్ధి దారుణంగా 26.4 శాతం నుంచి 3.4 శాతానికి పడిపోయింది. అంటూ జగన్ ప్రభుత్వ పాలనపై గవర్నర్ నజీర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా భావించిన అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా నాశనమైంది. నాటి జగన్ ప్రభుత్వం వికేంద్రీకరణ ముసుగులో మూడు రాజధానుల ఆలోచన ప్రజలను గందర గోళానికి గురి చేసింది. అన్ని ప్రభుత్వ రంగాలు నిర్వీర్యమయ్యాయి. మౌలిక సదుపాయాలు ఎక్కడా చేపట్ట లేదు. అన్ని విధ్వంసక నిర్ణయాలు నాడు జగన్ తీసుకున్నారు. దీని వల్ల యువతలో, నిరుద్యోగుల్లో అశాంతి నెలకొంది. చివరికి యువత చట్ట విరుద్దమైన పదార్థాలకు బానిసలు కావడం జరిగింది. అంటూ నాటి జగన్ ప్రభుత్వ పని తీరును గవర్నర్ తన ప్రసంగంలో దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఇంధన రంగం భారీ నష్టాలకు గురైంది. భూమి, ఘనులు, ఖనిజాలు, అడవులు, వంటి సహజ వనరుల దుర్వినియోగం జరిగింది. భూ ఆక్రమణలు, ఇంటి స్థలాల కేటాయింపుల్లో దుర్వినియోగం, భూముల కేటాయింపుల్లో ఉలంఘనలు, రీ సర్వే పేరుతో భూ హక్కు చట్టంపై ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బ తీశారు. 1.75 లక్షల ఎకరాల్లో రూ. 35,576 కోట్లు నష్టం జరిగింది. ఎర్రచందనం దొంగల దోపిడీకి గురవుతూనే ఉంది. విశాఖలోని రుషి కొండ, మడ అడవుల విధ్వంసం వల్ల రాష్ట్ర వారసత్వ సంపద, సంస్కృతిని దెబ్బ తీశారు. శాంతి భద్రతల విషయంలో యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ సామర్థ్యంపై ప్రజలకు నమ్మకం పోయేలా జగన్ ప్రభుత్వం చేసింది. ఇలా నాటి జగన్ ప్రభుత్వ పరిపాలన విధానాన్ని గవర్నర్ తన ప్రసంగంలో తూర్పార బట్టారు. ఈ ప్రసంగం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. సహజంగా గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ పాలసీని తెలియజేస్తుంది. ప్రజలకు ఎలాంటి సుభిక్షమైన పాలన అందిస్తారో, అంశాలను గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం తెలియజేస్తుంది. కానీ నేడు అందుకు భిన్నంగా ప్రసంగం సాగడం ప్రజల్లో ఆశ్చర్యంతో పాటు చర్చకు అవకాశమిచ్చినట్లైంది.