ప్రభుత్వాలు భూమిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నాయి
x

ప్రభుత్వాలు భూమిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నాయి

నాటి అనాగరికుడు నేల నా తల్లి అనుకున్నాడని, కానీ నేటి ఆధునికుడు నేల నా బానిస అంటున్నాడని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ అన్నారు.


మన భూమిని మనకాకుండా చేస్తున్న వ్యవస్థల మీద, రాజ్యం మీద కథలు రావాలని, ఇవాళ దేశంలో భూమిని రాజ్యమే కార్పొరేట్లకు అప్పచెప్పుతోందని, ఇలాంటి సంక్లిష్ట స్థితిలో సాహిత్య కారుల పాత్ర క్రియాశీలకమైనదని, ఈ నేపథ్యంలోనే కథలు రావాలని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ అన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అనంతపురం లలిత కళా పరిషత్‌లో కథా కార్యశాలకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. సాహితీ స్రవంతి అనంతపురం నాయకులు డాక్టర్‌ అంకె శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో మోహన్‌ మాట్లాడుతూ.. దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అన్న గురజాడ మాటను స్మరిస్తూనే దేశమంటే మట్టి కూడా.. మటి ్టమీద చెట్టు, గుట్ట, గొడ్డు అన్నీ ఈ మట్టిలో భాగమేనని, ఈ మట్టిని కార్పొరేట్‌ శక్తులు కొల్లగొడుతుంటే మనం చూస్తూ ఉండకూడదన్నారు. ఈ దేశంలో మట్టి కూడా భాగమే కదా అని అన్నారు.

Nature does not belong to man; but man belongs to nature అన్నట్లు మనిషి ప్రకృతికి చెందిన వాడు కానీ, ప్రకృతి మనిషిది కాదన్నారు. ప్రకృతిలో విడదీయరాని బంధంగా వుండాల్సిన మనిషి ప్రకృతి మీద పెత్తనం చెలాయిస్తున్నాడన్నారు. తన క్షేమం కోసం మనిషిని ప్రకృతిని వశం చేసుకున్నాడని ప్రకృతిని కొల్లగొట్టడం ఇవాళ పరాకాష్టకు చేరిందన్నారు. నాటి అనాగరికుడు నేల నా తల్లి అనుకున్నాడని, కానీ ఈనాటి ఆధునికుడు నేల నా బానిస అంటున్నాడని అన్నారు. ఈనాటి ఆధునికుడు నేల నుంచి నీటిని పిండుతున్నాడని, ఖనిజాలు తవ్వుతున్నాడని, అభివృద్ధి పేరుతో చేసే విధ్వంసాలు మామూలువి కాదన్నారు. అందుకే ఈ కోణంలో కథలు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దేశంలో అభివృద్ధికి నీడ అవినీతి అని, అభివృద్ధి– అవినీతి కవల పిల్లలన్నారు. అభివృద్ధి పేరుతో చేసే ఆర్థిక దోపిడి మీదకథకులు కథలు రాయాలన్నారు. అసమానతలు, చిద్రమవుతున్న బతుకులు, విచ్చిన్నమవుతున్న విలువలు ఇవే కాకుండా కార్పొరేట్‌ శక్తులు ఆగడాలపై రాజ్యం చేసే దురాగతాలపై సాహిత్యకారులు తమ పాత్ర పోషించాలన్నారు. మొదటి సెషన్‌కు సాహితీ స్రవంతి జిల్లా నాయకులు ప్రజ్ఞా సురేష్‌ అధ్యక్షత వహించారు.

కథ అంటే ఏమిటి? కథకులకు ఉండవలసిన ప్రాథమిక అవగాహన విషయాలపై ప్రముఖ కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్‌ వేంపల్లి షరీఫ్‌ మాట్లాడారు. రెండో సెషకు జిల్లా నాయకులు జి యమునారాణి అధ్యక్షత వహించగా, విరసం నాయకులు ఆర్‌ శశికళ ‘ఆధునిక కథలో రాయలసీమ చిత్రం’ అన్న అంశంపై మాట్లాడారు. మూడవ సెషన్‌కు సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రముఖ కథా రచయిత్రి డాక్టర్‌ ప్రగతి అధ్యక్షత వహించారు. ఈ సెషన్లో ప్రముఖ కథా రచయిత టి శ్రీనివాసమూర్తి కథల విశ్లేషణపై మంచి కథ ఎలా తయారవుతుంది? అన్న అంశంపై మాట్లాడారు. ముగింపు సెషన్‌ను సాహితీ స్రవంతి కార్యదర్శి రవిచంద్ర నిర్వహించారు. ఈ సభలో సీనియర్‌ కథకులు మారుతి పౌరోహితం, ఉప్పరపాటి వెంకటేశులు వారి అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు. సభ ప్రారంభానికి ముందు ప్రముఖ కథా రచయిత సింగమనేని నారాయణ చిత్రపటానికి అతిథులు పూలమాలవేసి జోహార్లు అర్పించారు.
Read More
Next Story