భోగి మంటల్లో సర్కార్ జీవోల దహనం
x

భోగి మంటల్లో 'సర్కార్' జీవోల దహనం

ఎన్నికల్లో ఊరించిన నిరుద్యోగ భృతి ఏమైంది? జాబ్ క్యాలెండర్ హామీలు ఎక్కడ? అంటూ నిలదీస్తూ కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్రాంతి సంబరాలు నిరసన జ్వాలలుగా మారాయి. పాత వస్తువులను మంటల్లో వేసి కొత్త కాంతిని ఆహ్వానించే 'భోగి' పండుగ వేళ.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు కూటమి ప్రభుత్వ విధానాలపై యుద్ధం ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. "కూటమి ప్రభుత్వ అహం తొలగిపోవాలి.. ప్రజా వ్యతిరేక జీవోలను వెనక్కు తీసుకోవాలి" అంటూ ప్రతిపక్ష శ్రేణులు గళమెత్తాయి.

రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు: భోగి మంటల్లో ప్రభుత్వ జీవోల దహనం

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూనే, కూటమి సర్కార్ వైఫల్యాలపై పోరాట పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగలు మిన్నంటాయి. ఆయన పిలుపునందుకున్న పార్టీ శ్రేణులు ప్రతి జిల్లాలోనూ వినూత్న రీతిలో భోగి వేడుకలను నిరసన వేదికలుగా మార్చాయి. వైఎస్సార్ జిల్లా కేంద్రంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ పాకా సురేష్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోలను దహనం చేయగా, పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన నివాసం వద్ద భోగి మంటల్లో ఈ నిరసన సెగలు రాజేశారు. విజయవాడ బీసెంట్ రోడ్డులో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో భారీ నిరసన జరిగింది. రైతుల ఆత్మహత్యలు, ప్రజలపై మోపుతున్న పన్నుల భారాలపై ఆయన మండిపడుతూ.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మరోవైపు కోస్తాంధ్ర నుండి రాయలసీమ వరకు కూటమి ప్రభుత్వ పీపీపీ విధానంపై వైఎస్సార్‌సీపీ నేతలు విరుచుకుపడ్డారు. నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా తన నివాసం వద్ద జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. నాలుగుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేకపోయారని, ఇప్పుడు జగన్ నిర్మించిన కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం దారుణమని ఆమె విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఎంపీ మార్గాని భరత్, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. పేదలకు మెరుగైన వైద్యం అందించే ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడాన్ని సహించేది లేదని, ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

సర్కార్‌పై వామపక్షాల సమరం: భోగి మంటల్లో 'కూటమి మేనిఫెస్టో' దగ్ధం

ఈ రాజకీయ నిరసనల్లో వామపక్షాలు సైతం గళం కలపడంతో ఏపీలో భోగి మంటల సెగ మరింత పెరిగింది. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం వద్ద కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, వివాదాస్పద జీవో 590, 847 ప్రతులను మంటల్లో వేసి దహనం చేశారు. అయితే, అందరినీ ఆశ్చర్యపరిచేలా AIYF నాయకులు ఒకడుగు ముందుకు వేసి, ఏకంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోనే భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. ఎన్నికల వేళ ఊరించిన నిరుద్యోగ భృతి ఏమైంది? జాబ్ క్యాలెండర్ హామీలు ఎక్కడ? అంటూ నిలదీస్తూ చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా మిన్నంటేలా నినాదాలు చేశారు. హామీలు నెరవేర్చని మేనిఫెస్టో పనికిరాని కాగితంతో సమానమని వారు ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More
Next Story