గిరిజన విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ .. త్వరలో ఉచిత డిఎస్సీ కోచింగ్‌
x

గిరిజన విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ .. త్వరలో ఉచిత డిఎస్సీ కోచింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన విద్యార్థులకు ఉచితంగా డిఎస్సీ కోచింగ్‌ ఇచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఎన్ని నెలలు ఇవ్వనున్నారంటే..


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇది వరకే మెగా డిఎస్సీని ప్రకటించింది. దీని ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అర్హులైన గిరిజన విద్యార్థులకు ఉచితంగా డిఎస్సీ కోచింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కోచింగ్‌ కార్యక్రమం చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వేల మందికి ఉచిత డిఎస్సీ కోచింగ్‌ ఇవ్వనున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 200 మంది విద్యార్థులకు, విజయనగరం జిల్లాలో 200 మందికి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 300 మంది గిరిజన విద్యార్థులకు డిఎస్సీ కోచింగ్‌ ఇవ్వనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ, విజయనగరం జిల్లాలో పార్వతీపురం ఐటీడీఏ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు ఐటీడీఏ పర్యవేక్షణలో కోచింగ్‌ ఇవ్వనున్నారు. విశాఖపట్నం జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో 100 మందికి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో 150 మందికి రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో కోచింగ్‌ ఇవ్వనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని చింతూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో మరో 50 మందికి, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో 100 మందికి కేఆర్‌పురం ఊటీడీఏ పర్యవేక్షణలోను శిక్షణ ఇవ్వనున్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కలిపి 100 మందికి, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 150 మందికి, ప్రకాశం జిల్లాలో 100 మందికి, నెల్లూరు జిల్లాలో 150 మందికి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 100 మందికి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 100 మందికి, వైఎస్‌ఆర్‌ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 200 మందికి ఆయా జిల్లాల గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
అభ్యర్థులు బీఈడీ, డీఈడీ కోర్సులను పూర్తి చేసి టెట్‌ పరీక్షలో క్వాలిఫై అయ్యుండాలి. ప్రభుత్వం నిబంధనల మేరకు అర్హత వయసు కలిగి ఉండాలి. మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపి చేస్తారు. డిగ్రీ, బీఈడీ, ఇంటర్‌తో పాటు డీఈడీ కోర్సులు మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ టెస్ట్‌ పెట్టి అందులో మెరిట్‌ సాధించిన వారిని ఎంపిక చేయాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. ఎంపికలో గిరిజన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిబంధలన ప్రకారం 33.1శాతం వరకు మహిళలకు అవకాశం కల్పించనున్నారు.
అన్ని జిల్లాలో దరఖాస్తుల ప్రక్రియను చేపట్టనున్నారు. ఆగస్టు 5 నుంచి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. జిల్లా అధికారుల ఆధ్వర్యంలోనే దరఖాస్తులు, స్క్రూటినీ చేయనున్నారు. ఆగస్టు 14లోపు మెరిట్‌ జాబితాను ప్రకటించనున్నారు. ఆగస్టు మూడో వారం నుంచి కోచింగ్‌ ప్రారంభించనున్నారు.
దాదాపు రెండున్నర నెలల నుంచి 3 నెలల వరకు కోచింగ్‌ ఇవ్వనున్నారు. కోచింగ్‌ ఇచ్చే సమయంలో భోజనంతో పాటు వసతి సౌకర్యం కల్పించనున్నారు. ఉచితంగా నిపుణులతో తయారు చేయించిన స్టడీ మెటీరియల్‌ను కూడా అభ్యర్థులకు అందించనున్నారు. కోచింగ్‌ సమయంలో అభ్యర్థులకు వీక్లీ టెస్టులు కూడా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏలు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని నిధుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రముఖ డిఎస్సీ కోచింగ్‌ సెంటర్ల నేతృత్వంలో కోచింగ్‌ ఇవ్వాలని భావిస్తున్నారు. అదనంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని విద్యా సంస్థలలో సీనియర్‌ ఉపాధ్యాయులు, కోచింగ్‌లో అనుభవం కలిగిన వారి సేవలను కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి నవ్య, ట్రైకార్‌ జనరల్‌ మేనేజర్‌ సీఏ మణికుమార్‌ నేత్వతంలో గైడ్‌లైన్స్‌ రూపకల్పన చేపట్టారు. అన్ని ఐటీడీఏల ప్రాజెక్టు ఆఫీసర్లు, అన్ని జిల్లాల గిరిజన సంక్షేమ శాఖల అధికారులకు కమ్యునికేట్‌ చేయడంతో పాటు కోచింగ్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను పంపనున్నారు. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిరిజన నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా డిఎస్సీ కోచింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉచిత డిఎస్సీ కోచింగ్‌ను తమ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, డైరెక్టర్‌ డాక్టర్‌ బి నవ్య సూచనలు, సలహాలను పాటిస్తూ, ఈ మెగా డిఎస్సీలో ఎక్కువ మంది గిరిజన అభ్యర్థులు విజయం సాధించే విధంగా అభ్యర్థులను తీర్చిదిద్దుతామని ట్రైకార్‌ జనరల్‌ మేనేజర్‌ సీఏ మణికుమార్‌ ది ఫెడరల్‌కు తెలిపారు.
Read More
Next Story