ఉరకలేస్తున్న గోదావరి..నిలకడగా కృష్ణమ్మ
x

ఉరకలేస్తున్న గోదావరి..నిలకడగా కృష్ణమ్మ

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.


ఎగువ ప్రాంతాల వరద నీటి ప్రవాహం వల్ల గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. దీని వల్ల భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.8 అడుగుల నీటిమట్టంకు చేరుకుంది. కూనవరం వద్ద నీటిమట్టం 18.10 మీటర్లుకు చేరుకుంది. పోలవరం వద్ద 11.71 మీటర్లుగా ఉంది. ఇక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ ఫ్లోతో పాటు ఔట్‌ ఫ్లో కూడా భారీగా పెరిగింది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 7.99లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద నీటి ప్రవాహం అధికాంగ ఉన్న నేపథ్యంలో శనివారం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. వరద ఉధృతి ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలకు 6 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఏర్పాటు చేశారు.

మరో వైపు కృష్ణా నది వరద నీటి ప్రవాహం ప్రస్తుతానికి నిలకడగా ఉంది. దీని వల్ల ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా ఇన్‌ఫ్లోతో పాటు ఔట్‌ ఫ్లో కూడా పెద్దగా లేదు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఇన్‌ ఫ్లో ,ఔట్‌ ఫ్లో 2.98 లక్షల క్యూసెక్కలుగా ఉందని ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వినాయక మండపాల నిర్వాహకులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదుల్లో వరద నీటి ప్రవాహాలు ఎక్కువుగా ఉంటున్న నేపథ్యంలో వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నదీపరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.
Read More
Next Story