చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించు దేవుడా:వైఎస్‌ఆర్‌సీపీ పూజలు
x

చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించు దేవుడా:వైఎస్‌ఆర్‌సీపీ పూజలు

వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు దేవుడికి ప్రార్థనలు చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. పూజల అనంతరం తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండు చేశారు. ఆలయ పవిత్రత మంట కలిపే విధంగా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. తమ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదన్నారు. వేంకటేశ్వరస్వామిని వైయస్‌ జగన్‌ ఎన్నోసార్లు దర్శించుకున్నారు. రాజకీయ ప్రాబల్యం కోసం చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేశారన్నారు. రోజుకు 700 మందికి పైగా అన్యమతస్తులు తిరుమల దర్శనానికి వస్తారు. ఏనాడు డిక్లరేషన్‌ తీసుకోలేదన్నారు.

చంద్రబాబుకి దేవుడంటే భయం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు లడ్డూని తెరపైకి తెచ్చారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ నేరుగా ఎదుర్కొనలేక దేవుని రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. మళ్లీ వైయస్‌ జగన్‌ తిరుపతి వెళతారు. ఎవరు ఆపుతారో చూస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు పవన్‌ కళ్యాణ్‌ దీక్షలు చేయాలన్నారు. జనసేన ఎమ్మెల్యే దళిత ఉద్యోగిపై దాడి చేసినందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలన్నారు.
డిక్లరేషన్‌ బోర్డు పెట్టి ఎందుకు తీసేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అసత్య ప్రచారంతో టీటీడీ ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారని మండిపడ్డారు. డిక్లరేషన్‌ బోర్డు పెట్టి ఎందుకు తీసేశారని నిలదీశారు. గుంటూరు ఈస్ట్‌ నియోజకవర్గంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. కూటమి నేతల మెదడులోనే కల్తీ ఉందని వైయస్‌ఆర్‌సీపీ నేత పోతిన మహేష్‌ విమర్శించారు. ఇష్టానుసారంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రోజు ఏ మతంలో ఉంటాడో, ఏ కులంలో ఉంటాడో తెలియని పవన్‌ను చంద్రబాబు డిక్లరేషన్‌ అడగాలని డిమాండ్‌ చేశారు.
చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేయాలని కోరుతూ రాజమండ్రిలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్‌ పూజలు చేశారు. బొమ్మూరు ఆలయంలో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రాజానగరం ఆలయంలో వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పూజలు నిర్వహిస్తున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లిలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు.
తిరుమల లడ్డులో కల్తీ జరిగినట్టుగా అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేయాలని కోరుతూ కల్లూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.వైయస్‌ఆర్‌ జిల్లా యర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. లడ్డూ పవిత్రతను కాపాడే విధంగా అభిషేకాలు చేశారు.అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల లడ్డూపై అసత్య చేసిన చంద్రబాబును ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తారని ఆయన అన్నారు.
తిరుమల పవిత్రతను,శ్రీవారి ప్రసాదం విశిష్టతను, టీటీడీ పేరు ప్రఖ్యాతలను మంటగలిపిన చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో లబ్బీపేటలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. దాసాంజనేయ స్వామి ఆలయంలో సెంట్రల్‌ నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం చంద్రబాబు వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినిందన్నారు. వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. వరదల్లో ప్రజలను ఆదుకోవడంలో విఫలం చెందారని విమర్శించారు.
Read More
Next Story