పర్యాటక శాఖకు గ్లోబల్ టూరిజం అవార్డు
x

పర్యాటక శాఖకు గ్లోబల్ టూరిజం అవార్డు

ఢిల్లీలో అవార్డు అందుకున్న ఏపీ పర్యాటక శాఖ ప్రతినిధి నిషితా గోయల్


ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలోని అత్యంత ఆశాజనకమైన పర్యాటక గమ్యస్థానాలలో ఒకటిగా మార్చేందుకు చేసిన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖను గ్లోబల్ టూరిజం అవార్డు -2025 వరించింది. ఈ మేరకు మంగళవారం ద్వారక ఢిల్లీలోని యశోభూమిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ పర్యాటక శాఖ తరపున టూరిజం కన్సల్టెంట్ నిషితా గోయల్ ఈ అవార్డును అందుకున్నారు.


నూతన పర్యాటక విధానాన్ని రూపొందించడంలో దార్శనిక నాయకత్వం, గమ్యస్థాన అభివృద్ధిలో ఇన్వెస్టర్లకు అందించిన మార్గదర్శకత్వం, పర్యావరణ అనుకూలమైన కొత్త రాజధానిని నిర్మించడం వంటివి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, భారతదేశ పర్యాటక వృద్ధిలో కీలక పాత్ర పోషించడం, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించినందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం కు అవార్డు కేటాయించామని గ్లోబల్ న్యూస్ నెట్వర్క్ యాజమాన్యం పేర్కొంది.


ప్రధానంగా గండికోటను అత్యంత ఆశాజనకమైన కొత్త పర్యావరణ, సాహస గమ్యస్థానాలలో ఒకటిగా విజయవంతంగా నిలపడం, మౌలిక సదుపాయాల కల్పన, ఆతిథ్య సామర్థ్యం, ఉపాధిని పెంచడానికి పీపీపీ విధానంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడం జరిగాయి. 15 నెలల కాలంలో ప్రఖ్యాత సంస్థలతో 103 ఎంవోయూలను కుదుర్చుకోవడం అవార్డు సాధించడానికి కారణాలు అయ్యాయి.

అంతేగాక బీచ్, టెంపుల్, ఎకో టూరిజం ప్రక్రియలతో కూడిన టూరిజం సర్క్యూట్లను అభివృద్ధి చేయడంతో పాటు, యువత భాగస్వామ్యాన్ని, స్థిరమైన పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించడం కూడా గ్లోబల్ టూరిజం అవార్డుకు ఎంపికైందని ఏపీ పర్యాటకశాఖ పేర్కొంది.

Read More
Next Story