చనిపోతాను అవకాశం ఇవ్వండి..90 ఏళ్ల శేషగిరమ్మ కోర్టులో పిటీషన్
x

చనిపోతాను అవకాశం ఇవ్వండి..90 ఏళ్ల శేషగిరమ్మ కోర్టులో పిటీషన్

అమరావతి ప్రాంతంలో తెరపైకొచ్చిన CRDA భూసమీకరణ వివాదం సంచలనంగా మారింది.


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియలో తన భూమిని కోల్పోయి, ప్రత్యామ్నాయ ఏర్పాటు లేకుండా ఒత్తిడికి గురవుతున్నానంటూ గుంటూరు జిల్లా రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరు శేషగిరమ్మ హైకోర్టులో సంచలన పిటిషన్ దాఖలు చేశారు. తనకు, అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు. మానసిక వికలాంగురాలైన మనుమరాలికి జీవనాధారం లేకుండా పోయిందని, భూమి ఇవ్వకుండా ఇంటిని ఖాళీ చేయాలని క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీంతో వేరే మార్గం లేక, కారుణ్య మరణం (euthanasia)కు అవకాశం ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. హైకోర్టు దీనిని స్వీకరించి WP 29253/2025గా నమోదు చేసి, విచారణకు స్వీకరించింది.

వివరాలు.. నేపథ్యం

శేషగిరమ్మకు గతంలో 1.5 ఎకరాల భూమి ఉండేది. దీంట్లో 1.45 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంది. మిగిలిన 5 సెంట్లలో ఆమె కుటుంబం నివసిస్తోంది. ఆమె కూతురు అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఉండగా, మనుమరాలు మానసిక సమస్యలతో బాధపడుతోంది. ముగ్గురూ పెన్షన్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 2015లో మొదలైన ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో ఆమె భూమిని ఇచ్చారు. అధికారులు సమానమైన భూమి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఒప్పుకున్నారని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.

కానీ, CRDA అధికారులు ఇటీవల ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పూలింగ్ నిబంధనల ప్రకారం 50 గజాలు మాత్రమే వస్తుందని, అంత ప్లాట్లు లేవని చెప్పి ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) బాండు ఇస్తామని తెలిపారు. "ఈ వయస్సులో బాండుతో ఏం చేయాలి? పెన్షన్ మందులకే సరిపోతోంది" అని శేషగిరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 12న CRDA కమిషనర్ కన్నబాబుకు వినతిపత్రం సమర్పించారు. పలుమార్లు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు కానీ, ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఎండీఓ విచారణ చేసి "మా పరిధిలో లేదు" అని చెప్పారు.

హైకోర్టు విచారణ.. వాయిదా

హైకోర్టు జడ్జి పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, అటార్నీ జనరల్ (AG)ను వివరణ కోరారు. AG వృద్ధుల సంరక్షణ కేంద్రాలు లేవని, వృద్ధాశ్రమాలు ప్రభుత్వ పరిధిలో నడవడం లేదని తెలిపారు. వారం రోజుల గడువు కోరగా, కోర్టు అంగీకరించి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. ఈ కేసు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలోని లోపాలను బయటపెట్టిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

చారిత్రక నేపథ్యం..ల్యాండ్ పూలింగ్ సమస్యలు

అమరావతి రాజధాని నిర్మాణం కోసం 2015లో TDP ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు సేకరించారు. రైతులకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు, కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ, YSRCP ప్రభుత్వం (2019-2024) మూడు రాజధానుల ప్రతిపాదనతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుత TDP-లెడ్ కూటమి ప్రభుత్వం అమరావతిని మళ్లీ అభివృద్ధి చేస్తోంది. ఇటీవల CRDA 1,575 ఎకరాలు సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో కూడా ల్యాండ్ పూలింగ్‌లో సమస్యలు ఎదుర్కొన్నారు. 2022లో హైకోర్టు CRDA మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలని ఆదేశించింది. అసైన్డ్ ల్యాండ్స్ అలాట్‌మెంట్ రద్దు గురించి వివాదాలు ఉన్నాయి. రైతులు TDP నాయకులు భూములు కొనుగోలు చేశారని YSRCP ఆరోపించింది.

ఇరువైపులా అభిప్రాయాలు

అమరావతి ప్రాజెక్టు పేరుతో పేదల భూములు లాగేసుకుని, వారిని నిరాశ్రయులను చేస్తున్నారని బయటపెట్టిందని YSRCP చెబుతోంది. "TDP ప్రభుత్వం పేదలను వదిలేసింది" అని విమర్శలు గుప్పిస్తోంది. CRDA ప్రకారం, ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025లో డ్రై ల్యాండ్‌కు 1,000 sq. yds రెసిడెన్షియల్ + 250 sq. yds కమర్షియల్, జరీబు ల్యాండ్‌కు మరిన్ని ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసు వృద్ధుల సంరక్షణ, భూసేకరణలో పారదర్శకత అవసరాన్ని హైలైట్ చేస్తోంది. అక్టోబర్ 31న విచారణ ఉంది. దీని ఫలితం ల్యాండ్ పూలింగ్ పాలసీలపై ప్రభావం చూపవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story