2 లక్షలు ఇవ్వండి..మత్స్యకారుల ఆందోళన
x

2 లక్షలు ఇవ్వండి..మత్స్యకారుల ఆందోళన

గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. రూ. 2 లక్షల బకాయిల కోసం నిర్వాసిత మత్స్యకారుల ఆందోళన చేపట్టారు.


గంగవరం పోర్టు వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వన్-టైమ్ సెటిల్‌మెంట్ (OTS) బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసిత మత్స్యకారులు, కార్మికులు పోర్టు గేటు వద్ద భారీ ధర్నాకు దిగారు. చెల్లిస్తామని చెప్పిన రూ. 2 లక్షల చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ఈ ఆందోళన చేపట్టారు. ఏడాది క్రితం యాజమాన్యంతో కుదిరిన ఒప్పందం ప్రకారం, 499 మంది కార్మికులకు ఒక్కొక్కరికి వన్-టైమ్ సెటిల్‌మెంట్ కింద చెల్లించాల్సిన రూ. 2 లక్షల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. కార్మికులు మూకుమ్మడిగా పోర్టు గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా, ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.

నిరసనలు తెలుపుతున్న మత్స్యకారులు యాజమాన్యంపై ఆరోపణలు చేశారు. చెల్లింపుల్లో ఆలస్యంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల రూపంలో డబ్బులు అయిపోయాయని అధికారులు సాకులు చెబుతున్నారని, తద్వారా తమకు చెందాల్సిన బకాయిలను కావాలనే ఆపుతున్నారని కార్మికులు ఆరోపించారు. కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం వల్లే సోమవారం మూకుమ్మడి ధర్నాకు దిగాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో కార్మికుల ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో, పోర్టు యాజమాన్యం దిగివచ్చింది. ప్రస్తుతం కార్మిక నాయకులను చర్చలకు ఆహ్వానించింది. పోర్టు అధికారులు, కార్మిక ప్రతినిధుల మధ్య బకాయిల చెల్లింపుతో పాటు వివిధ అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.

Read More
Next Story