గ్యాస్ గుప్పెట్లో కోనసీమ ప్రజలు!
x

గ్యాస్ గుప్పెట్లో కోనసీమ ప్రజలు!

ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంటోందని, గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు యుద్ధప్రతిపాదికన చర్యలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.


కోనసీమ వాసులను మరోసారి గ్యాస్ భయం వెంటాడుతోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆందోళన చెందుతున్నారు. గతంలో జరిగిన పాశర్లపూడి బ్లో అవుట్ వంటి దారుణ ఘటనలు గుర్తుకు వస్తుండటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

భయం గుప్పెట్లో ఇరుసుమండ

కోనసీమ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం భారీ గ్యాస్ లీకేజీ ఘటన చోటుచేసుకుంది. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ సైట్ నుంచి గత రెండు గంటలుగా గ్యాస్ భారీ శబ్దంతో పైకి చిమ్ముతోంది. పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడం గమనించిన గ్రామస్థులు వెంటనే ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం అందించారు. ఈ ప్రాంతంలో తరచుగా ఇలాంటి లీకేజీలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలిలో గ్యాస్ వాసన వ్యాపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. ఇది మరొక 'బ్లో అవుట్‌'కు దారితీస్తుందేమోనని, గతంలో పాశర్లపూడి వద్ద జరిగిన ఘోర ప్రమాదం మళ్ళీ పునరావృతమవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

అధికారుల పరిశీలన

గ్యాస్ లీకేజీ వార్త తెలియగానే తహసీల్దార్ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. లీకేజీ తీవ్రత దృష్ట్యా సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
రంగంలోకి టెక్నికల్ టీమ్
ఈ ఘటనపై ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులకు సమాచారం అందించామని తహసీల్దార్ తెలిపారు. రాజమండ్రి నుంచి ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంటోందని, గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు యుద్ధప్రతిపాదికన చర్యలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.
Read More
Next Story